Anil Ambani ED Raids: దేశంలోని కార్పొరేట్ దిగ్గజం అనిల్ అంబానీ, అతని రిలయన్స్ గ్రూప్‌నకు సంబంధించిన కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున సోదాలను నిర్వహించింది. ఢిల్లీ, ముంబైతో పాటు 35కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. ఈ కేసు మనీ లాండరింగ్‌కు సంబంధించినది కాగా, ఇందులో వేల కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ అంబానీకి చెందిన దాదాపు 50 కంపెనీలు, 25 మందికి పైగా వ్యక్తుల ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో సీబీఐ, సెబీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఏజెన్సీల నుంచి ఈడీకి కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది.
Also Read: భూమ్మీద లేని దేశం పేరుతో ఎంబసీ.. నిత్యానందను ఆదర్శంగా తీసుకొని ఇతడు ఏం చేస్తున్నాడంటే?
ఈడీ చర్యలు సీబీఐ రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో మొదలయ్యాయి. ఈ కేసులు రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ యూనిట్లకు చెందిన కంపెనీలకు సంబంధించినవి. ఇందులో మోసం, నిధుల దుర్వినియోగం, బ్యాంకుల నుంచి నకిలీ మార్గాల్లో లోన్లు తీసుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించి, ఒక వెల్ ప్లాన్డ్ స్కీం ద్వారా బ్యాంకులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలను మోసం చేసినట్లు గుర్తించింది. యెస్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధులను కంపెనీ ప్రమోటర్లకు, ఇతర గ్రూప్ కంపెనీలకు అక్రమంగా మళ్లించినట్లు కూడా ఏజెన్సీ గుర్తించింది.
ఈడీ దర్యాప్తులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. 2017 నుండి 2019 మధ్య యెస్ బ్యాంక్, రిలయెన్స్ కంపెనీలకు మంజూరు చేసిన లోన్లు పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించి మంజూరు చేసినవే. రుణం మంజూరు చేయడానికి ముందే యెస్ బ్యాంక్ ప్రమోటర్లకు ప్రైవేట్ కంపెనీల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ముట్టిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. క్రెడిట్ అప్రూవల్ మెమోరాండమ్స్ వంటి లోన్ డాక్యుమెంట్లను తప్పుడు తేదీలతో రెడీ చేశారు. ఎలాంటి డ్యూ డిలిజెన్స్ లేదా క్రెడిట్ అనాలసిస్ లేకుండానే రుణాలు మంజూరు చేసినవి. ఇది బ్యాంక్ క్రెడిట్ పాలసీని పూర్తిగా ఉల్లంఘించింది.
దీనితో పాటు లోన్లను వెంటనే ఇతర గ్రూప్, షెల్ కంపెనీలకు బదిలీ చేసినట్లు కూడా ఈడీ గుర్తించింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న, ఒకే అడ్రస్ ఉన్న లేదా ఒకే డైరెక్టర్లు ఉన్న కంపెనీలకే లోన్లు ఇచ్చినట్లు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో అప్లికేషన్, ఆమోదం డేట్ కూడా ఒకే రోజు ఉండటం లేదా లోన్ సాంక్షన్ చేయడానికి ముందే డబ్బు ట్రాన్సఫర్ కావడం వంటివి కూడా జరిగాయి.
Also Read: టాటా పరువు తీస్తున్న టాప్ కంపెనీ.. రెండ్రోజుల్లో రెండు ప్రమాదాలు
సెబీ కూడా ఈ కేసులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు సంబంధించి అనేక కీలక సమాచారాన్ని ఈడీతో పంచుకుంది. సెబీ నివేదికలో 2017-18లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ.3,742.60 కోట్ల కార్పొరేట్ లోన్లు మంజూరు చేయగా, 2018-19లో ఈ మొత్తం రూ.8,670.80 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ కాలంలో కంపెనీ లోన్లు ఇచ్చే అన్ని నిబంధనలను విస్మరించింది. ఈ లోన్లలో ఎక్కువ భాగం ప్రమోటర్ గ్రూప్ కంపెనీలకు మళ్లించారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగాయి.