APSRTC: అసలు అప్పులే తప్పించి ఆదాయం ఎరుగని ఏపీఎస్ ఆర్టీసీ ఫస్ట్ టైమ్ తీపి కబురు చెప్పింది. ఆదాయం మెరుగుపరచుకోవడంతో పాటు అప్పులు తీరుస్తున్నట్టు ప్రకటించింది. అటు ఉద్యోగుల వేతన బకాయిలు, ఇతరత్రా బెనిఫిట్స్ అందిస్తూనే గతంలో చేసిన అప్పులు తీర్చుతున్నట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తాజాగా ప్రకటించారు. ఇది హర్షించదగ్గ పరిణామమే. ఎప్పుడో నిజాం ప్రభువులు ప్రారంభించిన రోడ్డు రవాణా సంస్థ దినదిన ప్రవర్థనమానంగా అభివృద్ధి సాధించింది. వేల కోట్ల ఆస్తులతో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. కానీ నిర్వహణలో ఎదురైన ఇక్కట్లతో ఇప్పటికీ పురిటినొప్పులు పడుతోంది. ఎడాపెడా అప్పులు చేసి రుణ సంస్థగా మారిపోయింది. ఏపీలో జగన్ సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ప్రయోజనం లేకపోయింది.

ఏపీఎస్ ఆర్టీసీది సుదీర్ఘ చరిత్ర. ప్రపంచంలో అతిపెద్ద రవాణా సంస్థగా గుర్తింపు పొందింది. నిజాం ప్రభువులు 1932 జూన్‍లో “రోడ్ ట్రాన్స్‌పోర్టు” ప్రారంభించారు. మూడులక్షల తొంబై మూడువేల రూపాయల మూల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. 1951 నవంబరు హైదరాబాద్ రాష్ట్ర రవాణా సంస్థగా మారింది. 1958 వరకూ అలానే కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో 1958 జనవరి 11 ‘ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ’ గా రూపాంతరం చెందింది. అయితే కేంద్ర ఆర్టీసీ చట్టం ప్రకారం 2/1 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి. 1988 వరకూ సంయుక్త భాగస్వామ్యంతో ఆర్టీసీ నడిచేది. కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.70 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.140 కోట్లు..ఇలా మొత్తం రూ.210 కోట్ల మూల పెట్టుబడితో ఆర్టీసీ నడిచేది. కానీ కేంద్రం పెట్టబుడులు నిలిపివేయడంతో 1989 నుంచి ఆర్టీసీ అప్పులు చేయడం ప్రారంభించింది. ఏడాదికేడాది అప్పులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
1999 లో ప్రపంచంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ లో నమోదైంది.1932లో 27 బస్సులతో ప్రారంభమైన ఈ రవాణా సంస్థ 2017 నాటికి 11,678 బస్సులతో ప్రతి రోజు 72 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. 55,628 సిబ్బంది ఉద్యోగ, అవకాశాలను కల్పిస్తోంది. రాష్ట్ర విభజనతో ఈ సంస్థ నవ్యాంధ్రకు పరిమితమైంది. తెలంగాణ రోడ్ రవాణా సంస్థ వేరుపడడంతో తన పరిధిని తగ్గించుకుంది. ప్రస్తుతం 12 రీజియన్లు, నాలుగు జోన్లు, 129 డిపోలతో మెరుగైన సేవలందిస్తోంది. కానీ అప్పులను మూటగట్టుకుంది. ప్రభుత్వంలో విలీనం అయ్యాక తమ ఉద్యోగ రాయితీలు తగ్గిపోయాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయినా గతంకంటే మెరుగైన సేవలందిస్తున్నారు.

ఆర్టీసీలో అనేక సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. కార్గో సేవలు, నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ స్థలాలను వినియోగంలోకి తేవడం, లీజులికివ్వడం వంటి వాటితో ఆదాయం గణనీయంగా మెరుగుపరచుకుంది. ఇలా ఆదాయం మెరుగుపరచుకోవడమే కాకుండా పాత అప్పులను తీర్చడం ప్రారంభించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,150 కోట్లు అప్పులు తీర్చినట్టు ఎండీ ద్వారక తిరుమల ప్రకటించారు. ఈ డిసెంబరు మాసాంతం నాటికి రూ.210 నికర ఆదాయం సమకూరినట్టు కూడా ప్రకటించారు. ఉద్యోగుల పాత బకాయిలు రూ.950 కోట్లు చెల్లించినట్టు కూడా వెల్లడించారు. మొత్తానికైతే ఆర్టీసీ మూడు పద్ధతుల్లో ముందంజ వేస్తోంది. ఆదాయం సమకూర్చుకోవడం, అప్పులు తీర్చడం, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం.