జిల్లాలవారీ గణాంకాలు ఆసక్తికరం
ఈ సంస్థ ఇచ్చిన జిల్లాలవారీ గణాంకాలు ఆసక్తికరంగా వున్నాయి. మొత్తం 13 జిల్లాల్లో 7 జిల్లాల్లో వైఎస్ఆర్ సి పి కి 50 శాతం కన్నా అధిక ఓట్లు వస్తాయని చెప్పింది. అవి జిల్లాలవారిగా కడప (66.20), నెల్లూరు (60), కర్నూలు (59.55), ప్రకాశం (58.24), చిత్తూరు (55.15), విజయనగరం (53.36), అనంతపూర్ (50.45)లుగా ఇచ్చారు. ఈ జిల్లాల్లో ఒక్క అనంతపూర్ తప్పితే మిగతా అన్నిచోట్ల తెలుగుదేశంతో పోలిస్తే తేడా 10 శాతం పైగానే వుంది. అవి ఎలాగానంటే కడప (36.60), నెల్లూరు (21.49), కర్నూలు (22.55), ప్రకాశం (20.24), చిత్తూరు (16.40), విజయనగరం (13.39). అదే అనంతపూర్ లో ఈ తేడా కేవలం 6.45 శాతం మాత్రమే వుంది. ఈ వివరాలు చూస్తే దాదాపు ఆరు జిల్లాల్లో వైఎస్ఆర్ సి పికి పోటీయే వున్నట్లు లేదు. ఇందులో అయిదు జిల్లాలు రాయలసీమ , దానిని ఆనుకొని వున్న నెల్లూరు, ప్రకాశం లు. ఉత్తరాంధ్రలోని విజయనగరం ఆరో జిల్లా . రాయలసీమ మొత్తం మీద ఒక్క అనంతపూర్ లోనే రెండు పార్టీల మధ్య పోటీ వుంది. ఇక తెలుగుదేశం పరిస్థితి చూద్దాం.
తెలుగుదేశం ఓ అయిదు జిల్లాల్లో వైఎస్ ఆర్ సి పి తో నువ్వా నేనా అన్నట్లు పోటీలో వుంది. మొత్తం మీద ఈ జిల్లాల్లోనూ వైఎస్ ఆర్ సి పి ఆధిక్యంలో వున్నా తేడా అయిదు శాతం కన్నా తక్కువే వుంది. వాటిల్లో తెలుగుదేశం ఓటింగ్ సరళి ఎలావుందంటే శ్రీకాకుళం (44.69), గుంటూరు (44.08), కృష్ణా (44), తూర్పు గోదావరి (42.05), పశ్చిమ గోదావరి (41.50). ఈ జిల్లాల్లో తెలుగుదేశం కు వైఎస్ ఆర్ సి పి కన్నా ఎంత తక్కువ శాతం వుందంటే గుంటూరు (3.54), తూర్పు గోదావరి (4.10), శ్రీకాకుళం (4.31), పశ్చిమ గోదావరి (4.70), కృష్ణా (4.72). అంటే పోటీ రెండింటిమధ్య గట్టిగానే వుందనుకోవాలి. ఇకపోతే విశాఖపట్నం ఆసక్తికరంగా వుంది. వైఎసార్ సి పి కి ఇక్కడ కేవలం 47.65 శాతం వున్నా తెలుగుదేశానికి ఇంకా తక్కువగా కేవలం 38.61 శాతం మాత్రమే వుంది. అంటే వైఎస్ ఆర్ సి పి కి ఈ జిల్లాలో 50 శాతం కన్నా తక్కువ ఓట్లు వున్నా తెలుగుదేశం కన్నా 9.04 శాతం ఆధిక్యత ఉండటంతో ఫలితం ఏక పక్షంగా వుండే అవకాశం వుంది. అంటే ఈ ఓటింగ్ సరళిని బట్టి తెలుగుదేశం కేవలం ఆరు జిల్లాల్లోనే గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. అవి గుంటూరు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణ, అనంతపూర్ . మిగతా 7 జిల్లాల్లో వైఎస్ ఆర్ సి పి కి ఇప్పుడు ఎన్నికలు జరిగితే పోటీయే లేదని తెలుస్తుంది.
ఇక మూడో కూటమి జనసేన-బిజెపి పరిస్థితి ఎలా వుందో చూద్దాం. కేవలం మూడు జిల్లాల్లోనే పది శాతం పైగా ఓట్లు వున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. అవి పశ్చిమ గోదావరి (11.40), విశాఖపట్నం (11.20), తూర్పు గోదావరి (10.80). 5 శాతం పైగా ఇంకో నాలుగు జిల్లాల్లో నమోదయ్యాయి. అవి గుంటూరు (6.80), విజయనగరం (5.55), శ్రీకాకుళం (5.41), కృష్ణా (5.28). అనంతపూర్, చిత్తూరు లలో నాలుగు శాతం పైగా మిగతా నాలుగు జిల్లాల్లో ( కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు) నామమాత్రంగా నమోదయ్యాయి. ఈ రెండింటిలో ఇప్పటికీ జనసేననే బిజెపి కన్నా మెరుగుగా వుంది. వీటినుంచి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.
ప్రజాదరణలో వైఎసార్ సి పికి ఎదురులేదు
ఈ సర్వే ఫలితాలు చూస్తే వైఎస్ ఆర్ సి పి కి ప్రస్తుతానికి ఎదురులేదని అర్ధమవుతుంది. మొత్తం రాయలసీమ , దక్షిణ కోస్తా ( దీన్నే కొంతమంది గ్రేటర్ రాయలసీమ అనికూడా పిలుస్తారు), ఉత్తర ఆంధ్ర లోని మూడు జిల్లాల్లో రెండు పూర్తిగా జగన్ ప్రభావం లో వున్నట్లు అనుకోవాలి. మధ్య కోస్తా లోని గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి , ఉత్తర ఆంధ్ర లోని శ్రీకాకుళం మాత్రమే సమ వుజ్జీ పోటీ వుందని అర్ధమవుతుంది. అంటే జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పధకాలు, గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ప్రజల్లోకి బాగా వెళ్లిందని అనుకోవాలి.
ఆసక్తికర విషయమేమంటే తెలుగుదేశం పని అయిపోయిందని వైఎస్ఆర్ సి పి ప్రచారం చేసినా ఈ రోజుకీ ప్రజల్లో దాని ఓటింగు శాతం ఎన్నికల నాటి కంటే తగ్గలేదని సర్వే చెబుతుంది. ఇకపోతే మూడో కూటమి ఇప్పటికయితే ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదని సర్వే చెబుతుంది. వాస్తవానికి ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఇంతవరకు ప్రజల్లోకి వెళ్ళలేదు. కరోనా మహమ్మారి అడ్డంకిగా వుందని వాళ్ళు సరి పెట్టుకుంటున్నారు. ఎన్నికలకి ఇంకా మూడున్నర ఏళ్లకు పైగానే వుంది. ఈ ఫలితాలు ఇప్పటివి. రాజకీయాల్లో మూడున్నర సంవత్సరాలు సుదీర్ఘం. ఇంత ముందుగా అప్పటి పరిస్థితుల్ని ఊహించటం సరికాదు. ఇది కేవలం జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత తనపై ప్రస్తుతం ప్రజాభిప్రాయం ఎలా ఉందనే వరకే మనం చూడాల్సి వుంటుంది. ఇప్పటికయితే ప్రజల్లో అత్యంత ప్రజాదరణ వుందనేది ఈ సర్వే సారాంశం. చివరిగా ఒకమాట . ఈ సంస్థ గురించి మాకు తెలిసింది తక్కువ. కేవలం వార్తల్లో వచ్చిన సర్వే ఆధారంగా మా ఈ విశ్లేషణ. గమనించగలరు.