Social Media- Political Parties: ఆంధ్రాలో “సోషల్” కాలకేయులు

రాజకీయ ప్రత్యర్థులపై సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా విమర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ కార్యకర్తలు.. కవులను, కళాకారులను కూడా వదిలిపెట్టడం లేదు. మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి వివాహేతర సంబంధాలు ఉన్నట్టు బురద జల్లుతున్నారు.

Written By: Bhaskar, Updated On : July 10, 2023 1:11 pm

Social Media- Political Parties

Follow us on

Social Media- Political Parties: ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా మనిషి జీవితాన్ని మరింత సుఖమయం చేసేదిగా ఉండాలి. సరికొత్త విజ్ఞానాన్ని అందించే విధంగా ఉండాలి. ఇలాంటి అప్పుడే చరిత్ర పురోగతి సాధ్యమవుతుంది. మనిషి మనుగడ అభివృద్ధి వైపు సాగుతుంది. అదే సాంకేతిక పరిజ్ఞానం పక్కదారి పడితే.. లైన్ దాటి ఇతర మార్గాల వైపు వెళితే.. అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. దీనివల్ల మనుషుల జీవితాలు తారుమారవుతాయి. సరికొత్త వికృతాలు మనుషుల జీవితాల్లోకి చొచ్చుకు వస్తాయి. దీని పర్యవసానం సమాజం మీద తీవ్రంగా పడుతుంది. అది ఎంతకు దారితీస్తుందో తెలియదు కానీ.. దీనివల్ల బాధితులు నరకం చూస్తారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కనిపిస్తోంది.

సోషల్ యుద్ధం

ఒకప్పుడు రాజకీయాలంటే ప్రత్యక్షంగా ఉండేవి. సోషల్ మీడియా అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో నాయకులు ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రమే తమ వాణి వినిపించేవారు. ఇదే సందర్భంగా సభ్య సమాజం ఏమైనా అనుకుంటుందేమోనని భయం వారిలో కనిపించేది. కార్యకర్తలు కూడా నాయకుడు చెప్పిన విధంగానే వినేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సోషల్ మీడియా పెరిగిపోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, స్మార్ట్ఫోన్ అనేది కనీస అవసరంగా మారిపోవటం వంటివి సోషల్ యుద్ధాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్య ఈ పైత్యం మరింత విపరీతంగా ఉంటున్నది.. ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేసేందుకు పార్టీలు దిగజారిపోతున్న విధానం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల సతీమణులను కూడా వివాదాల్లోకి లాగడం పరిపాటిగా మారింది. ” మేం డిమాండ్ చేసిన (నిజానికి ఇక్కడ వేరే పదం వాడారు) ప్రతిసారి నీ భార్య ఫోటో చూపించాల్సిందే”.. ఇది ఇటీవల ఓ నాయకుడికి ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ఒక సందేశం. ఇది ఆ నోట ఈ నోట పడటంతో ఆ నాయకుడి కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళింది.. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే “ఇది మా రాజ్యం. ఇలాగే ఉంటుంది. ఇష్టమైతే ఉండండి.. లేకపోతే.. యండి” అనే మాటలు వారి నోటి నుంచి అలవోకగా వస్తున్నాయి. వెరసి సోషల్ మీడియా వేదికగా దారుణాతి దారుణమైన యుద్ధాలు జరుగుతున్నాయి.

కవులను కూడా వదిలిపెట్టడం లేదు

రాజకీయ ప్రత్యర్థులపై సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా విమర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ కార్యకర్తలు.. కవులను, కళాకారులను కూడా వదిలిపెట్టడం లేదు. మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి వివాహేతర సంబంధాలు ఉన్నట్టు బురద జల్లుతున్నారు. టార్గెట్ మహిళల ఫోన్లో మెసేజ్లు పంపి బెదిరిస్తున్నారు. శృంగార వీడియోలు ఉన్నాయని పోస్టులు పెట్టడం.. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ సృష్టించడం వంటి వికృత క్రీడలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను పొరపాటున చిన్న మాట అంటే విరుచుకుపడే పోలీసులు.. అదే ముఖ్యమంత్రి కుటుంబానికి దగ్గరగా ఉండే ఒక వ్యక్తి.. ఎవరి భార్యను, ఎవరి చెల్లెలిని, ఎవరి తల్లిని ఏమన్నా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదు. ఇక మహిళా కమిషన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఇలాంటి చర్యలు తగవని ఎవరైనా హితవు పలికితే వారిని కూడా వదిలిపెట్టడం లేదు. చివరికి తమ మాట వినని సినీ ప్రముఖులు, నచ్చని టీవీ షోలపై కూడా అక్కసు వెళ్ళగకుతున్నారు. ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియాకు కొత్త ఇన్చార్జి వచ్చిన తర్వాత పోస్టింగ్ల వ్యవహారం మరింత విచ్చలవిడిగా మారిపోయింది. వాస్తవానికి ఆ నాయకుడికి మొన్నటి వరకు పెద్దగా గుర్తింపు లేదు. పాత మిత్రుల సమీకరణలోనూ పూర్తిగా విఫలమయ్యారు. అయితే తనకు గుర్తింపు రావడానికి పైశాచికత్వాన్నే నమ్ముకున్నారు. ఏముంది వెంటనే సోషల్ మీడియాలో వికృతానికి తెరలేపారు. అందులోనే ఆయన ఆనందం పొందుతున్నారు.

ఏడ్చే రోజు తీసుకొస్తా

తనను మానసికంగా వేధిస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు, మెసేజ్ లతో ఇబ్బంది పెడుతున్నారని
టిడిపి మహిళా నేత ఉండవల్లి అనూష గత నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆ మరుసటి రోజే వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి ఆమెను హెచ్చరిస్తూ ఒక ఆడియో రిలీజ్ చేశారు. “దగ్గరలో ఒకరోజు ఉంది. గుండెలు బాదుకుని పొర్లాడి, పొర్లాడి ఏడ్చే రోజు తీసుకొస్తా” అంటూ అని ఆయన ఆ ఆడియోలో బెదిరించారు. ఇక కడప జిల్లా పులివెందుల చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ ద్వారా వైసిపి కార్యకర్తలు ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో రాజధాని ప్రాంతానికి చెందిన టిడిపి మహిళా కార్యకర్త శృంగార సన్నివేశంలో పాల్గొన్నట్టు మార్ఫింగ్ వీడియో సృష్టించారు. ఈ వీడియో ఆమె వ్యక్తిగత జీవితాన్ని రోడ్డున పడేసింది. వాస్తవానికి ఈ కేసు నిర్బయ పరిధిలోకి వస్తుంది. సిఐడి గాని, మహిళా కమిషన్ గాని ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇక రాయలసీమ చెందిన ఓ తెలుగు మహిళను నాలుగు రోజుల క్రితం వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. ఆమె బెదరకపోవడంతో ఆమె ఫోన్లో ఉన్న కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేసి నేరుగా వాట్స్అప్ చేశారు. తర్వాత వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఆమె తీవ్రమైన మానసికక్షోభకు గురయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.. వీటిపై అటు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

అవి కూడా తక్కువ తినలేదు

ఇక టిడిపి సోషల్ మీడియా విభాగం కూడా వైసిపి స్థాయిలో కాకున్నా.. రెచ్చగొట్టే పోస్టులు పెడుతోంది. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. మొదట్లో విధానాలను మాత్రమే ప్రశ్నించిన టిడిపి సోషల్ మీడియా.. తర్వాత వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళింది. వాస్తవానికి రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో ఉన్నంత మాత్రాన వారి వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం అత్యంత దారుణం. ఇటువంటి సోయి లేని పార్టీలు, వాటి సోషల్ మీడియా ఇన్చార్జులు అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు. నైతికతకు నీళ్లు వదులుతున్నారు. ఫలితంగా సోషల్ మీడియా కాస్త కాలకేయుల రాజ్యం గా మారిపోయింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలప్పుడు ఇంకెంతకు దిగజారుతుందోనని ఏపీ మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వికృత క్రీడకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాల్సి ఉంది.