కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆర్థిక మూలాలను భారీగా దెబ్బతీస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్, జూన్ క్వార్టర్‌లో ఏకంగా మైనస్ 32.9 శాతానికి పడిపోయింది. తర్వాతి స్థానంలో మైనస్ 23.9 శాతంతో భారత్ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు రాష్ట్రాలను అప్పులతోనే నడిపించాల్సి వస్తోంది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు విడుదల కావడం లేదు.
Also Read : అబ్బా.. ఏం చెప్తిరి.. అన్యాయాలపై సరెండరేనా?
రాష్ట్రాల్లో ఎప్పుడైతే లాక్‌డౌన్ షురూ అయిందో అప్పటి నుంచి పూర్తిస్థాయిలో ఆదాయం కోల్పోయాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే తెలంగాణ రాష్ట్రం 83 శాతం ఆదాయం లాస్ అయింది. దీనిపై పీఎం నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారు. కొవిడ్ కారణంగా ఖర్చు భారీగా పెరిగింది కానీ.. ఆదాయం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ‘ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఒడిదుడుకులతో తగినంత నిధులను సమకూర్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాం. రుణాల కోసం ద్రవ్య సంస్థల నుంచి ఫ్రంట్ లోడింగ్ విధానంలో అప్పులు తీసుకుంటున్నాం. విధిలేని పరిస్థితుల్లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కోసం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంపై ఆధారపడాల్సి వచ్చింది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇక ఆగస్టు 31న ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో రాష్ట్రం రూ.8,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని వెల్లడించారు. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతోంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయిలో ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నాయో.
Also Read : నాటి డమ్మీ నేతలే.. నేడు హీరోలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతలా బాగోలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ వివరాల ప్రకారం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో రాష్రంలో ఆదాయంతో పోలిస్తే ఖర్చు ఎక్కువగా ఉంది. ఐదు నెలల ఆదాయం రూ.37,305.79 కోట్లు కాగా.. ఖర్చు రూ. 88,618.19 కోట్లు. దీంతో లోటు రూ. 51,312.40 కోట్లకు చేరింది. కేవలం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో తీసుకున్న అప్పులు రూ.25,103.58 కోట్లు. గత ఆర్థిక సంవంత్సరం 2019–-20లో తీసుకున్న మొత్తం అప్పు రూ. 40,400.96 కోట్లు.
ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో తెలంగాణ ఆదాయం రూ.23,221.56 కోట్లు కాగా.. ఖర్చు రూ. 38,425.67 కోట్లు. దీంతో లోటు రూ.15,204.11 కోట్లకు చేరింది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో తీసుకున్న అప్పులు రూ.20,783.84 కోట్లు. గత ఆర్థిక సంవంత్సరం 2019–20 లో తీసుకున్న అప్పు రూ.29,902 కోట్లుగా కాగ్ అంచనా వేసింది.
మరోవైపు కేంద్రం నుంచి జీఎస్టీ సెస్ బకాయిలు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.4,863.21 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.5,420 కోట్లు రావాల్సి ఉందని ప్రభుత్వాలు చెబుతున్నారు. ఐజీఎస్‌టీ కూడా రూ.2,700 కోట్ల వరకూ కేంద్రం బాకీ ఉందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం భవిష్యత్‌లో అంత సులభం కాదని చెప్పాలి. అభివృద్ధి, సంక్షేమ వ్యయాల్లో కోత పడే ప్రమాదం ఉంది. అటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం.. ఇటు ఆదాయాన్ని పెంచుకోవడం ఇప్పుడు రాష్ట్రాలకు పెద్ద టెన్షన్‌లా మారాయి.
Also Read : ఆంధ్ర రాజకీయాలు కొత్త మలుపు