పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించడంతో మూడు రాజధానుల ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం తొందర పడుతుంది. ఈ విషయంలో జాప్యం చేస్తే ఏదో రకంగా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అయితే ఇంతలో హై కోర్టులో రాజధాని తరలింపుపై పిటీషన్ ల ఈ నెల 4వ తేదీన విచారణ జరిపింది. ధర్మాసనం తదుపరి విచారణ (ఈ నెల 14వ తేదీ) వరకూ రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు గెజిట్ విడుదల వంటి విషయాలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్సెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది.
Also Read: ‘కరోనా’ని మించిన డేంజర్ ఏపీలో.. ప్రభుత్వ వైఫల్యమే(నా)..?
మరోవైపు విశాఖలో మూడు రాజధానుల పనులకు శంఖుస్థాపనకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 16వ తేదీన స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరిగిన మరుసటి రోజే శంఖుస్థాపన జరనుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శంఖుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. కోర్టు కేసులు, ప్రతిపక్షాలు, రాజధాని ప్రాంతవాసుల నిరసనలే ఇందుకు కారణం. మూడు రాజధానుల శంఖుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది. దీంతో పిఎంఓ నుంచి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16వ తేదీ మంచి ముహూర్తం ఉందని, అనంతరం రెండు నెలల వరకూ ముహూర్తాలు లేకపోవడంతో ఈ ముహూర్తాన్నే ఖాయం చేసినట్లుగా సమాచారం.
Also Read: వైసీపీ సవాల్ కు బాబు స్పందిస్తారా?
మూడు రాజధానుల శంఖస్థాపనకు న్యాయస్థానం నుంచి ఎటువంటి అడ్డంకులు లేవని అధికారులు చెబుతున్నారు. రాజధాని తరలింపు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, కోర్టులో ఈ వ్యవహారం తేలిన అనంతరంమే తరలింపు జరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం కార్యనిర్వహక రాజధానిగా విశాఖలో ఏర్పాటు చేయాల్సిన భవన నిర్మాణాలకు మాత్రమే శంఖుస్థాపన జరుగుతుందని అంటున్నారు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా ఈ నెల 16న మూడు రాజధానులకు శంఖుస్థాపన జరిగే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.