Mekapati Goutham Reddy Death: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఈ రోజు ఉదయం గుండెపోటు రావడంతో ఆస్సత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నారు. వైసీపీలో కీలక నేత దూరం కావడంతో నేతలు జీర్ణించుకోలేకేపోతున్నారు. తమ అనుచరుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న వెంటనే సీఎం జగన్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. తమ సహచరుడిని కడసారి చూసుకునేందుకు వస్తున్నారు. మరోవైపు గౌతమ్ రెడ్డి ప్రభుత్వం కోసం పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దుబాయి పర్యటనకు వెళ్లి ఆదివారమే స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంతలోనే ఆయనకు గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: పంజాబ్ లో గెలుపెవరిది?
మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం నేపథ్యంలో జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న గౌతమ్ రెడ్డి దూరం కావడం భరించలేనిదని తన మనసులోని బాధను వ్యక్తం చేశారు. 2014 నుంచి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచారు. జగన్ మంత్రివర్గంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఎప్పుడు ప్రజలతో మమేకమయ్యేందుకు గౌతమ్ రెడ్డి ఇష్టపడతారు. ప్రజల ఓట్లతో గెలిచినందుకు వారికి ఏదో చేయాలనే తపన ఆయనలో ఉండటం తెలిసిందే. వివాదారహితుడుగా పేరున్న ఆయన ప్రజల కోసమే తన జీవితం అంకితం చేశారు. ప్రజాసేవలోనే కన్ను మూశారు. దీంతో ఏపీ ప్రజలు దుఖసాగరంలో మునిగిపోయారు. తమ ప్రియతమ నేతను కోల్పోవడం బాధాకరంగా ఉందని చెబుతున్నారు.
యాభై ఏళ్ల వయసులోనే ఆయన చనిపోవడం బాధాకరమే. ఎప్పుడు జిమ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండే ఆయనకు గతంలో కరోనా సోకిందని తెలుస్తోంది. దీంతోనే గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. మొత్తానికి గౌతమ్ రెడ్డి మరణం రెండు రాష్ట్రాల్లోనూ విషాదం నింపింది.