Kapu Community: కాపులు.. నిజంగా ‘కాపు’కాసేవారిగా మిగిలిపోయారు. పల్లకి మోయడం తప్ప..ఆ పల్లకిలో ఎక్కి ఊరేగే అవకాశమొచ్చినా అందిపుచ్చుకోలేని పరిస్థితి కాపులది. సంఖ్యాబలంగా రాష్ట్రంలో కాపులది అగ్రస్థానం. తూర్పుకాపులు, నాయుడులు, తెలగాలు, బలిజలు, ఒంటరి కులస్థులంటూ ప్రాంతాల వారీగా కాపులను ఒక్కోపేరు పెట్టి విభజించారు. అదే కమ్మ సామాజికవర్గమైతే చివరకు చౌదరి, రెడ్డి సామాజికవర్గమైతే చివరకు రెడ్డి అని ప్రత్యేక గుర్తింపును సంతరించుకునేలా సామాజిక‘వర్గ’ప్రయోజనాన్ని కాపాడుకునేలా వారికి వారు తీర్చిదిద్దుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనైనా, విభజిత ఆంధ్రప్రదేశ్ లోనైనా జనాభాలో సింహభాగం కాపులదే. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలైతే ఉన్నాయి. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత పాత‘కాపు’లను పక్కన పడేస్తున్నారు. రాజకీయ పార్టీల వారీగా కాపు నాయకులు విడిపోతున్నారు. వర్గ ప్రయోజనాలను పక్కన పెట్టి నేతలు బాగుపడుతున్నారు. కానీ సామాజికవర్గంలో వెనుకబాటును రూపుమాపలేకపోతున్నారు. జాతి కోసం ఐక్యత చాటుకోలేకపోతున్నారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం రూపంలో రాజ్యాధికారానికి అవకాశం వచ్చినా కాపులు జారవిడిచుకున్నారు.
2014లో చంద్రబాబు, 2019లో జగన్ పల్లకి మోశారు. కానీ ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణలతో జనసేన రూపంలో మరో అరుదైన అవకాశం కాపుల ముంగిట నిలిచింది. అదే పవన్ కళ్యాణ్ రూపంలో. శాసనసభలో కనీస సంఖ్యాబలం లేకున్నా…పేరు మోసిన నాయకులు పార్టీలో లేకున్నా పవన్ తన వాణిని వినిపిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సుదీర్ఘ కాలం దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, నిత్య పోరాటబాట పట్టే వామపక్షాలు ఉన్నా ప్రస్తుతం పవన్ వాయిస్ కు ఉన్న ఆదరణ ఎవరికీ లేదు. పవన్ ఒక ప్రకటన చేస్తే అధికార పక్షం ఉలికి పడుతోంది. పవన్ పొత్తుల మాట ఎత్తితే ప్రధాన ప్రతిపక్షం పులకించి పోతోంది. అంతలా పెరిగిపోయింది పవన్ మేనియా. అయితే ఇదంతా వినడానికి వినసొంపుగా ఉన్నా..గత అనుభవాలతో గాలిబుడగ కారాదు. అందుకే ఈ సమయంలో కాపులంతా ఒక గొడుగులోకి వస్తే రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ఆవిష్కరణ తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Paddy Row: టీఆర్ఎస్ వరియుద్ధం ఫ్లాప్ అయ్యేనా అన్నా
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నది సగటు కాపు సమాజికవర్గం సుదీర్ఘ స్వప్నం. అటువంటి అవకాశం, రాజకీయ సమీకరణలు ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఇప్పడు పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి పవన్ పొత్తు కావాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ఉనికి చాటుకునేందుకు జనసేనాని తోడుకావాలి. పవన్ ఇతర పక్షాలతో కలవకపోవడం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి కావాలి. అందుకే ఇప్పుడ పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రక్షన్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా అచీతూచి అడుగులు వేస్తే ఈ రాష్ట్ర రాజకీయ యవనికలో కాపు సామాజికవర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి కావడం ఎంతో దూరంలో లేదు.
పొత్తుల రాజకీయాలు ఎన్నికల్లో భాగమే అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగితేనే అధికార పార్టీకి ముచ్చెమటలు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్రంలో కాపులుగా పిలవబడే తూర్పుకాపులు, తెలగాలు, నాయుడులు, బలిజలు, ఒంటరి సామాజికవర్గాలంతా ఏకతాటిపై రావాల్సిన అవసరముంది. ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవడం సహజం. ఎందుకంటే రాష్ట్రంలో కాపులు, కాపు నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు. వీరికి వర్గ ప్రయోజనం కంటే తాము ఉన్న రాజకీయ పార్టీయే ముఖ్యమైపోయింది. అందుకే పవన్ ను వ్యక్తిగతం, సిద్ధాంతపరంగా తిట్టాల్సివచ్చినప్పడు గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అయినా, ఇప్పుడు వైసీపీ అయినా కాపు సామాజికవర్గం మంత్రులు, కీలక నాయకులనే రంగంలోకి దించుతుంది. దీనిని బట్టి మన నాయకుల వర్గ ప్రయోజనాలు, సామాజిక బాధ్యతను అర్ధం చేసుకోవచ్చు.
ఒక్క రాజకీయంగానే కాదు. ఇతర రంగాల్లో సైతం కాపుల పురోగతి అంతంతమాత్రం. చెప్పుకోదగిన పారిశ్రామిక వేత్తలు వేలితో లెక్కపెడదామన్నా దొరకరు. ఇటీవల ఓ చానల్ అధినేత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తన ఇంటర్వూ లో ఇదే ప్రశ్నను సంధించారు. కానీ సమాధానం చెప్పేందుకు వీర్రాజు నీళ్లు నమిలారు.
ఈ ప్రశ్న సంధించిన ఛానల్ అధినేతకు ఈ విషయం తెలియంది కాదు. కానీ కాపు సామాజికవర్గంలో ఉన్న అనైక్యతను ఈ ప్రశ్న ద్వారా బయటపెట్టారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజులు కాపు సామాజికవర్గానికి చెందిన వారు. పైగా ఆ రెండు పార్టీల మధ్య స్నేహం సైతం ఉంది. కానీ తెల్లవారు లేచింది మొదలు ఇతర పార్టీల కాపు నాయకులు వారిపైనే దుమ్మెత్తి పోస్తుంటారు. వారి పార్టీల నాయకుల ప్రాపకం కోసం తెగ ప్రయత్నిస్తుంటారు. కానీ కాపు సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నించరు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం వైసీపీ గొడుగు కింద, కమ్మ సామాజికవర్గం టీడీపీ వెనుక నిలబడింది. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన బలపడుతున్న పరిస్తితులు కనిపిస్తున్నాయి. అన్నివర్గాల ప్రజలు పార్టీ వైపు చూస్తున్నారు. ఈసమయంలో కాపులు సంఘటితమై పవన్ కు అండగా నిలిస్తే కొత్త రాజకీయ సమీకరణలు మారే పరిస్థతులు కనిపిస్తున్నాయి.
Also Read: Bodhan Nizamabad: బోధన్ గొడవ పెద్దదవుతోందా? అక్కడ హిందూ సంఘాల మోహరింపునకు కారణమేంటి?
Recommended Video: