
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ఎస్‌ఈఆర్టీని వాడుకుంది. ప్రభుత్వం బలవంతంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్న ఇంగ్లిష్ మీడియం వల్ల తెలుగు మీడియం చదవాలనుకునే విద్యార్థులకు కష్టాలు తప్పవు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 24 తీసుకొచ్చింది. ఎస్‌ఈఆర్టీ ఇచ్చిన 59 పేజీల నివేదిక ప్రకారం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు అందులో పేర్కొంది.
ఏ మాధ్యమంలో చదవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇవ్వాలని బీజేపీ నేత సుదీష్ రాంబోట్ల అంటున్నారు. ఇదే అంశంపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తన వాదనకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యా శాఖ విడుదల చేసిన 80, 81 జి.ఓలను కొట్టేసింది. హైకోర్టు తీర్పును పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసిన ఆయన ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఇంగ్లీష్ మిడియంను తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను సుప్రీంకోర్టు సాయంతో అడ్డుకోవడానికి సిద్ధపడుతున్నారు. తెలుగు మీడియం కావాలని కోరిన 53,947 మంది విద్యార్థుల కోసం మండలానికొకటి చొప్పున 672 తెలుగు మీడియం స్కూలు నడపనున్నట్లు పేర్కొందని, అయితే, తమిళ, ఒరియా, కన్నడ, ఉర్దూ మీడియం ఎప్పటిలాగే కొనసాగుతుందని ప్రభుత్వం ఆ జీవోలో చెప్పిందన్నారు. దీనిప్రకారం తెలుగు మీడియం చదవాలనుకునే విద్యార్థులకు ఏపీలో చాలా కష్టాలు ఎదురవుతాయని, ఏపీలో మండల కేంద్రానికి 50 – 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలూ ఉన్నాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని వై.రామవరం మండలంలో కొన్ని గ్రామాలు ఆ మండల కేంద్రానికి వెళ్లాలంటే మరో నాలుగైదు మండలాలను దాటి వెళ్లాలన్నారు. అలాగే మిగతా జిల్లాల్లోనూ మండల కేంద్రానికి 50 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న గ్రామాలున్నాయన్నారు. అలాంటి చోట తెలుగు చదవాలనుకునే విద్యార్థులకు అసలు బడికి వెళ్లడమే కష్టమవుతుందన్నారు.