
జీవో అనేది సాధారణ విషయం కాదు. అది ప్రభుత్వ విధానాన్ని వెల్లడిస్తుంది. ఒక విషయంపై జీవో ఇష్యూ చేస్తున్నారంటే.. అన్ని విషయాలూ ఆలోచించి, కూలంకషంగా చర్చించి, ప్రభుత్వం అందుకు సిద్ధపడిందని అర్థం. కానీ.. ఒకసారి జారీ చేసిన జీవోను ఏదో కారణంతో మళ్లీ వెనక్కు తీసుకున్నారంటే..? పదే పదే.. ఇదే రిపీట్ అవుతోందంటే..? ప్రభుత్వ విధానాల్లో లోపం ఉందని అర్థం. ఎక్కడో గ్యాప్ ఏర్పడుతోందని అర్థం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇదే జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీలో ఎవరు పడితే వారు జీవోలు జారీచేసే పరిస్థితి వచ్చిందని, కనీసంగా సమాచారం లేకుండా ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా.. ఓ జీవో జారీచేయడం, మళ్లీ దాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఓ జీవో జారీచేసింది. అదేమంటే.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకు వస్తున్నట్టు ఈ జీవోలో పేర్కొన్నారు. కీలకమైన ఈ నిర్ణయం ఎవరితోనూ చర్చించకుండా ఓ అధికారి గవర్న మెంట్ ఆర్డర్ ఇష్యూ చేశారట. సీఎంవో ఉన్నతాధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఈ జీవో ఇచ్చారట. అయితే.. ఈ విషయమై సీఎస్ తోనూ చర్చించలేదని టాక్.
దీంతో.. ఆగ్రహించిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించారట. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్థిక శాఖలోకి తీసుకురావడం వల్ల చాలా సమస్యలు వస్తాయని సీఎం జగన్ తో చెప్పారట. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆ జీవోను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విధంగా.. జీవోలు ఎవరు పడితే వారు ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం సాధారణంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, దీనిపై ఏపీ సర్కారు ఇకనైనా తగిన చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.