ఇప్పుడు అందరి దృష్టి హుజురాబాద్ ఉప ఎన్నికపైనే. రాష్ర్టం మొత్తం ఆసక్తికరంగా చూస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని అందరు భావిస్తున్నారు. అందరి నోట హుజురాబాద్ మాటే వినిపిస్తోంది. నలుగురు కలిసిన చోట హుజురాబాద్ గురించే చర్చిస్తున్నారు. టీఆర్ఎస్ ను ఏ విధంగా ఢీకొంటారనే దానిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈటల సొంత నియోజకవర్గం కావడంతో గులాబీ పార్టీలో కూడా గుబులు పుట్టినట్లు కనిపిస్తోంది. అందుకే ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో పలు పథకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
అన్ని పార్టీలు ఇప్పుడు హుజురాబాద్ పైనే దృష్టి సారించాయి. చావో రేవో అన్న చందంగా పోరాటానికి రెడీ అయిపోయాయి. ఎన్నికలో గెలుపే ప్రధానంగా ముందుకు సాగాలని చూస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటివరకు ఇంకా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. ఒక్క బీజేపీ తప్ప. కానీ ప్రచారమైతే నిర్వహిస్తున్నాయి. తమ పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నాయి. ఎలాగైనా ఇక్కడ గెలుపు సాధించాలనే ఉద్దేశంతో ముందుకు కదులుతున్నాయి.
ఈటల రాజేందర్ ను బీజేపీలోకి తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. కానీ ఆయన గెలుపు కోసం మాత్రం పనిచేయడం లేదు. ఏ చిన్న సమీక్ష కూడా పెట్టడం లేదు. దీంతో అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ కు చెక్ పెట్టడానికే ఈ మేరకు సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. బండి సంజయ్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి మౌనం పాటిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేస్తే ఆ క్రెడిట్ అంతా బండి సంజయ్ ఖాతాలోకి వెళ్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల ఓడిపోతే అది కూడా సంజయ్ కే దక్కుతుందని తెలుసుకుని ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. బండి సంజయ్ దూకుడుకు కళ్లెం వేయాలనే తలంపుతోనే కిషన్ రెడ్డి ఈ విధమైన చర్యలకు దిగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నికపై బీజేపీ ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.