ACB 14400 App: లంచగొండ్ల వివరాలు తెలిపితే భారీ పారితోషికం.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి

ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవరత్నాలతో పేద లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : September 8, 2023 11:38 am

ACB 14400 App

Follow us on

ACB 14400 App: ఇప్పుడు అంతటా అవినీతి రాజ్యమేలుతోంది. లంచం ఇవ్వనిదే పని జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పని జరగాలన్నా చేయి తడపాల్సిందే. ప్రభుత్వం పారదర్శక సేవలు అందిస్తున్న వాటికి ధర కట్టి మరీ వసూలు చేస్తున్నారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా.. ఎక్కడికక్కడే లంచగొండులు అవతారం ఎత్తుతున్నారు. అందుకే అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సమర శంఖం పూరించింది. ఇప్పటికే దిశ యాప్ తో అవినీతి నిర్మూలనకు అడుగు ముందుకేసింది. ఏసీబీ 14400 పేరుతో ఒక యాప్ ను రూపొందించింది.

ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవరత్నాలతో పేద లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పథకాల లబ్ధిలో లంచానికి తావు లేకుండా చూడాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే ఏసీబీ ని బలోపేతం చేస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ 14400 యాప్ ను డౌన్లోడ్ చేసి.. బటన్ ప్రెస్ చేసి సమాచారం ఇవ్వొచ్చు. వీడియో ద్వారా కానీ.. ఆడియో ద్వారా కానీ సంభాషణలను రికార్డు చేసి ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చు. ఆ సమాచారం ఏసీబీ నేరుగా సీఎంవోకి నివేదిస్తుంది. వెంటనే సంబంధిత ఏసీబీ అధికారులు అలర్ట్ అవుతారు. లంచగొండి అధికారులను అదుపులోకి తీసుకుంటారు.

కలెక్టరేట్, ఆర్డీవో, సబ్ రిజిస్టార్, సబ్ ట్రెజరీ, తహసిల్దార్, మండల పరిషత్, పోలీస్ స్టేషన్, విద్యుత్, విద్యాశాఖ కార్యాలయాలతో పాటు సచివాలయాల్లో సైతం ఎవరైనా లంచం అడిగితే నేరుగా ఈ యాప్ ను ఉపయోగించి ఏసీబీ ని ఆశ్రయించవచ్చు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు లంచం అడిగినా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్14400 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. అటువంటి వ్యక్తులకు ప్రోత్సాహం కింద రూ.5000 నుంచి రూ.10,000 వరకు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. యాప్ డౌన్లోడ్ కు సంబంధించి ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. ప్లే స్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది.