
అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరుకుల్లో పడిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే షాక్ ఇచ్చింది. నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏపీ తీసుకున్న నిర్ణయాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు చెక్ పెడుతున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మోకాలడ్డుతోంది. ఇన్నాళ్లు బ్యాంకుల నుంచి తెచ్చుకున్న రుణాలపై కూడా ఝలక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీగా ఉంది. దీంతో ఏపీ చిక్కుల్లో పడింది. ప్రభుత్వ నిర్వహణ కష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ గండాన్ని దాటేందుకు నానా తిప్పలు పడుతోంది.
2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పెరిగిపోతున్నాయి. టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన అప్పుల వ్యవహారం ప్రస్తుతం నిరాటంకంగా కొనసాగుతోంది. అప్పుల భారం తగ్గించుకోవాలని భావిస్తున్నా అది నెరవేరడం లేదు. వచ్చే ఆదాయానికి అప్పులకు పొంతన ఉండడం లేదు. దీంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. అప్పులతో నెట్టుకొస్తున్న జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు కేటాయిస్తున్న మొత్తాన్ని దారి మళ్లించి తన సొంత పథకాలకు వాడుకుంటున్న ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఇకపై కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయికి రాష్ర్టం లెక్క చెప్పాల్సిందే అని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో తమ సొంత అవసరాలు తీర్చుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వం సడన్ గా ఇరుకున పడింది. కేంద్ర పథకాల మొత్తాల మళ్లింపు కుదరకపోవడంతో కొత్త దారుల్ని వెతుకుతోంది.
కేంద్రం ఇస్తున్న నిధుల్ని తాత్కాలికంగా అయినా మళ్లించి వాడుకునేందుకు వీల్లేకుండా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే బ్యాంకర్ల వద్ద కూడా చిట్టా పెరిగిపోయింది. కొత్త అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో జగన్ సర్కారుకు ఎటూ పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారుకు తిప్పలు తప్పడం లేదు.