https://oktelugu.com/

AP Employees: ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు..చేతులెత్తేసిన పోలీసులు

AP Employees: పోలీసులను మోహరించినా.. అడుగడుగునా ఆంక్షలు పెట్టినా ఏపీ ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. కొందరు బిచ్చగాళ్ల వేషంలో.. మరికొందరు రైతుల రూపంలో విజయవాడకు తరలివచ్చారు. తమ వాణిని విజయవాడ నడిబొడ్డున గట్టిగా వినిపించారు. పోలీసులు, ప్రభుత్వం పెట్టిన నిర్బంధాలను ఛేదించారు. పెద్ద ఎత్తున తాము ‘చలో విజయవాడ’ నిర్వహించాలనుకున్న ‘బీఆర్టీఎస్’ రోడ్ కు చేరుకున్నారు. ఏపీ ఎన్జీవో భవన్‌ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు ఉద్యోగులు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఆ రోడ్డు మొత్తం ఎర్రజెండాలతో నిండిపోయింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 3, 2022 / 12:51 PM IST
    Follow us on

    AP Employees: పోలీసులను మోహరించినా.. అడుగడుగునా ఆంక్షలు పెట్టినా ఏపీ ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. కొందరు బిచ్చగాళ్ల వేషంలో.. మరికొందరు రైతుల రూపంలో విజయవాడకు తరలివచ్చారు. తమ వాణిని విజయవాడ నడిబొడ్డున గట్టిగా వినిపించారు. పోలీసులు, ప్రభుత్వం పెట్టిన నిర్బంధాలను ఛేదించారు. పెద్ద ఎత్తున తాము ‘చలో విజయవాడ’ నిర్వహించాలనుకున్న ‘బీఆర్టీఎస్’ రోడ్ కు చేరుకున్నారు.

    ఏపీ ఎన్జీవో భవన్‌ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు ఉద్యోగులు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఆ రోడ్డు మొత్తం ఎర్రజెండాలతో నిండిపోయింది. ఉద్యోగుల నినాదాలతో మార్మోగిపోయింది. వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్రగా వచ్చి వుయ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ఉద్యమానికి నాయకులు ఎవరూ లేరు. ఉద్యోగ సంఘ నేతలు పిలుపు మాత్రమే ఇచ్చారు. వారుకూడా బయట కనిపించలేదు. కానీ ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు తమకు తామే పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవాడలో కదంతొక్కారు.

    జిల్లాల నుంచి వస్తున్న వారిని పోలీసులు అన్ని రకాలుగా అడ్డుకున్నా ఉద్యోగులు ఎలాగోలా వివిధ రూపాల్లో విజయవాడకు చేరుకున్నారు. పీఆర్సీ, జీతాల విషయంలో ఉద్యోగుల్లో ఆగ్రహం.. కింది స్థాయి వరకూ ఉండడంతో అందరూ స్వతహాగా ఈ ఉద్యమానికి ఊపిరిపోశారు. వెల్లువలా తరలివచ్చిన ఉద్యోగులను ఆపడం పోలీసుల వల్ల కాలేదు. ఉద్యోగులని వందలమందిని అదుపులోకి తీసుకొని తిరిగి అలిసిపోయి వదిలిపెట్టేశారు. ఫలితంగా ప్రభుత్వ నిర్బంధాలు ఉద్యోగుల విషయంలో పనిచేయలేదు.

    పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకూ ఉద్యమిస్తామంటున్నారు. ప్రభుత్వ నిర్బంధంతో మొదట ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆందోళన చేశారు. ఉద్యోగులు ఎవరూ రారేమో అనుకున్నారు. కానీ ఉద్యోగులే స్వతహాగా వచ్చి విజయవాడలో కదం తొక్కి ప్రభుత్వానికి షాకిచ్చారు.

    పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు నిరసనను తెలిపారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు చేశారు. తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారు.. తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేను ఉన్నాను… నేను విన్నానని ప్రతిపక్ష నేతగా జగన్‌ అన్నారని.. కానీ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణమన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను రోడ్డుపైకి ఈడ్చారని మండిపడ్డారు.

    నిరంకుశంగా చలో విజయవాడను అణచివేసే చర్యలను ఖండిస్తున్నామని ఉద్యోగులు అన్నారు. అణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడమన్నారు. సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఉద్యోగులు హెచ్చరించారు.

    మేం ఏపీలో ఉన్నాం… పాకిస్థాన్‌లో కాదు… అణచివేత తగదంటూ ఉద్యోగులు హెచ్చరించారు. ఉద్యోగుల జీవితంలో ఇది చీకటిరోజు అంటూ ఆవేదన చెందారు. బీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయించారు. ఇక ఏమాత్రం వెనక్కి తగ్గమంటూ విజయవాడలో కూర్చొని ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. మొత్తానికి ఉద్యోగుల నిరసన విజయవంతమైందనే చెప్పాలి.

    రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ చలో విజయవాడ వైపే.. విజయవాడలో రహదారులన్నీ బీఆర్‌టీఎస్ రోడ్ల వైపే.. ఒక్కసారిగా ఉద్యోగులు ఉప్పెనలా తరలిరావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. బీఆర్‌టీఎస్ మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద నుంచి పీఆర్సీ సాధన సమితి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీకి అగ్రభాగాన పీఆర్సీ సమితి ముఖ్య నేతలు నిలిచారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఛేదించుకుని మరీ ఉద్యోగులు దూసుకెళ్లారు. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 200 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమని వెంటనే విడుదల చేయాలంటూ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులు నినాదాలు చేశారు. విజయవాడ నగరం వెలుపలే వేలాది మంది ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు. అయినా విజయవాడలో ఉద్యోగులు ఇసుకేస్తే రాలనంతగా తరలి వచ్చారు.