Kuttram Purinthavan Series Review: ఒకప్పటి మాదిరిగా ప్రేక్షకులు ఇప్పుడు లేరు. రొటీన్ సినిమాలను కష్టపడటం లేదు. మసాలా సినిమాలను దేకడం లేదు. కట్టిపడేసే కథ, అదరగొట్టే సస్పెన్స్, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లను ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కరోనా కాలం నుంచి ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. అందువల్లే చాలావరకు ఓటీటీలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నాయి. అలాంటి ఒక వెబ్ సిరీస్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
కుట్రం పూరిందవన్; ది గిల్టీ వన్ పేరుతో సోనీ లీవ్ లో ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.. ఏడు ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ కట్టిపడేస్తోంది. ముఖ్యంగా సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో పశుపతి, విదార్థ్ కీలక పాత్రలు పోషించారు. సెల్వమణి కీలకపాత్ర పోషించారు. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
కథ ఏంటంటే
ఓ గ్రామంలో భాస్కర్ (పశుపతి), తన భార్య ఆనంది (లిజీ ఆంటోనీ) తో కలిసి ఉంటాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసీగా పనిచేస్తుంటాడు. ఇతడికి సెల్వి అనే కూతురు ఉంటుంది. కాకపోతే ఆమె చనిపోతుంది. దీంతో ఆమె కుమారుడు రాహుల్ పెంచే బాధ్యత భాస్కర్ మీద పడుతుంది. రాహుల్ మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటాడు. అతడికి సర్జరీ చేస్తేనే బతుకుతాడని డాక్టర్లు చెబుతారు. దీంతో తాను పదవి విరమణ చేయగా వచ్చిన డబ్బుతో రాహుల్ కు సర్జరీ చేయించాలని భాస్కర్ భావిస్తాడు.
భాస్కర్ ఉంటున్న ఇంటికి పక్క ప్రాంతంలో ఎస్తేర్(లక్ష్మీ ప్రియ) దంపతులు ఉంటారు. ఎస్తేర్ భర్త సాల్మన్ మద్యానికి బానిస అవుతాడు. నిత్యం తాగుతూనే ఉంటాడు. దీంతో ఎస్తేర్ తన 12 సంవత్సరాల కూతురు మెర్సి బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో జాతర జరుగుతుంది. అదే సమయంలో సాల్మన్ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. మెర్సీ కూడా కనిపించదు. దీంతో ఈ కేసును చేదించడానికి పోలీస్ శాఖ ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ బృందంలో కానిస్టేబుల్ గౌతమ్ (విదార్థ్) కూడా ఉంటాడు. అయితే అతడు అనుకోకుండా కొన్ని కారణాలవల్ల కేవలం జీప్ డ్రైవర్ గా మాత్రమే పనిచేయాల్సి వస్తుంది.
కేసు పరిశోధనలో భాగంగా పోలీసులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పోలీసులు విచారణ సాగిస్తుండగా భాస్కర్ ఉన్నట్టుండి తన భార్యకు ఒక నిజం చెబుతాడు. తన ఇంట్లో ఉన్న ఫ్రిజ్లో మెర్సీ శవం ఉందని చెబుతాడు. మెర్సి అపస్మారక స్థితిలో ఉండగా సాల్మన్ తన చేతిలో పెట్టి చనిపోయాడని చెబుతాడు.. పోలీసులు ఒకవేళ తనపై కేసు నమోదు చేస్తే పదవి విరమణ చేసిన తర్వాత డబ్బు రాదని.. రాహుల్ సర్జరీ ఆగిపోతుందని చెప్పి బాధపడుతుంటాడు. ఈ విషయం తెలిసిన నాటి నుంచి ఆనంది భయభ్రాంతులకు గురవుతుంది. తన భార్య ఎక్కడ నిజం చెబుతుందోనని భాస్కర్ కూడా ఆందోళన చెందుతుంటాడు. మరోవైపు ఎస్తేరు కన్నీరు పెడుతున్న దృశ్యాలను కూడా చూడలేక పోతాడు. అయితే మనవడి సర్జరీ కోసం ఈ నిజాన్ని దాయడం ఎంతవరకు కరెక్ట్ అని తనలో తానే అంతర్మథనం చెందుతుంటాడు. గౌతమ్ కూడా ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరికి మెర్సీ ని ఎవరు చంపారు? సాల్మన్ ను ఎందుకు చనిపోయాడు? భాస్కర్ రాహుల్ కు సర్జరీ చేయిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ దర్శకుడు ఒక్కో ఎపిసోడ్ మలిచాడు.
మొత్తం వెబ్ సిరీస్ లో ఒకటి మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నేటి కాలంలో నిజాయితీగా బతకడం.. మనస్సాక్షి చెప్పినట్టుగా వ్యవహరించడం సాధ్యం కాదు. అలాంటివారు నిజాలు కూడా చెప్పలేరు. నిజాలు చెప్పే ధైర్యం కూడా చేయలేరు.. స్వార్థం, ఆత్మసాక్షి మనిషిని ఎలాంటి వైపు సాగేలా చేస్తాయనేది గొప్పగా చూపించారు.
మొదట్లో ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రేక్షకులు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయలేరు. ఎందుకంటే దర్శకుడు అంత గొప్పగా ఈ కథను డిజైన్ చేసుకున్నాడు. ముఖ్యంగా కథనం ఊహించని విధంగా ఉంటుంది. మలుపుల గురించి రాయడం కంటే, చూడడమే గొప్పగా ఉంటుంది. ఒక వ్యక్తి నేరం చేస్తే.. అతని కుటుంబం ఏ స్థాయిలో బలైపోతుంది.. పోలీసులు దర్యాప్తులో ఎటువంటి కోణాలను పరిశీలిస్తారు..
ఒక నిజాన్ని దాచిపెట్టడానికి ఒక నిజాయితీపరుడు ఎలా నలిగిపోతాడు.. ఈ అంశాలు మొత్తం ఈ వెబ్ సిరీస్ ను గొప్పగా నిలబెట్టాయి. ” మనలో మంచితనం ఎదుటివారికి తెలుస్తుంది. మనలో ఉన్న చెడ్డతనం మనకు మాత్రమే అర్థమవుతుంది” అనే డైలాగ్ ఈ మొత్తం వెబ్ సిరీస్ ఉద్దేశం ఏమిటో చెబుతుంది.
ఈ వెబ్ సిరీస్లో ఫరూక్ భాషా కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. ప్రసాద్ నేపథ్య సంగీతం కూడా గొప్పగా అనిపిస్తుంది. కదిరేష్ ఎడిటింగ్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. నటీనటులు తమ పాత్రలలో జీవించారు. ఈ వెబ్ సిరీస్ కోసం భారీగా ఖర్చుపెట్టినట్టు ప్రతి సన్నివేశంలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సాగదీతలు ఉన్నప్పటికీ.. డిఫరెంట్ స్టోరీలను కోరుకునే వారికి ఈ వెబ్ సిరీస్ బెస్ట్ ఛాయిస్.
ఈ వెబ్ సిరీస్ కు మేమిచ్చే రేటింగ్ 3/5
