ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం వచ్చే నెలలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శాసనమండలి రద్దు ప్రతిపాదనతో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్, పశు సంవర్థకశాక మంత్రి మోపిదేవి వెంకటరమణ లను రాజ్యసభకు పంపుతున్నారు. వారిద్దరి స్థానంలో ఇతరులను తీసుకోవడంతో పాటు, కొందరు సీనియర్ నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించగలరని తెలుస్తున్నది.
రెండన్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ తొలుత చెప్పిన మాటలకు భిన్నంగా సాధ్యమైనంత త్వరగా కేబినెట్‌లోకి కొత్త ముఖాలను తీసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొందరికి ఉద్వాసన తప్పదంటూ సంకేతాలు వెలువడుతున్నాయి. దీనికితోడు స్థానిక సంస్థాల ఎన్నికల్లో ఓటమి చెందితే అందుకు బాధ్యులుగా ఉన్న మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి హెచ్చరించడం తెలిసిందే.
తొలి మంత్రి వర్గ విస్తరణలో జగన్ అనేకమంది సీనియర్ నేతలను జగన్ పక్కన పెట్టారు. ప్రాంతాలు, సామాజికవర్గాల సమీకరణాల లెక్కలతో కొందరికీ తొలి విస్తరణలో చోటు దక్కలేదు. పార్టీ కోసం కష్టపడ్డవారికి కూడా జగన్ ఇవ్వలేకపోయారు. దానితో పాటు ప్రస్తుత మంత్రులు పలువురి పనితీరు సంతృప్తికరంగా లేదని, వారు పార్టీలో అందరిని కలుపుకు వెళ్లలేక పోతున్నారని జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు రాబోయే రోజులలో ప్రజలలో ప్రభుత్వంపై ఈ వ్యతిరేకత పెరిగితే ఎదుర్కోవడానికి సీనియర్లకు అవకాశం ఇవ్వాల్వసిందే అని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, విశాఖపట్నం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్, పశ్చిమగోదావరి నుంచి గ్రంధిశ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాడుగుల ఎమ్మెల్యే ముత్యాలనాయుడు, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి, గుంటూరు జిల్లా నుంచి చిలకలూరిపేల ఎమ్మెల్యే విడదల రజని, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయి. మైనార్టీ కోటాలో మరోకరికి మంత్రి పదవి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.