Anand Mahendra : దోమలు స్వైర విహారం చేస్తున్నాయా.. డెంగీ కేసులు నమోదు అవుతున్నాయా.. ఆనంద్ మహీంద్రా పరిచయం చేసిన ఈ ఐరన్ డోమ్ గురించి తెలుసా?

అడపాదడపా కురుస్తున్న వర్షాలతో దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. దోమల నివారణకు నగర పాలకాలు, పురపాలకాలు, గ్రామపంచాయతీలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ దోమల నివారణ పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా దోమల సమస్య ముంబైలో ఎక్కువగా ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 25, 2024 8:39 am

Anand Mahendra

Follow us on

Anand Mahendra : పెరిగిపోతున్న దోమలను తగ్గించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహీంద్రా ఒక పరిష్కారాన్ని నెటిజన్లకు సూచించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన.. ఒక ప్రత్యేకమైన పరికరాన్ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు.. ఆ వీడియో లో ఉన్న పరికరం ఒక్కసారిగా విస్తృతమైన వ్యాప్తిలోకి చేరింది.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఆ వీడియోలో.. ఓ పరికరం చిన్న సైజు లేజర్ ఆధారిత క్యానన్ లాగా కనిపిస్తోంది. దీనిని చైనా దేశానికి చెందిన ఒక ఇంజనీర్ అభివృద్ధి చేశాడు. దీనిని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ” నేను దీనిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా. ఈ పరికరం మీ ఇంటికి ఐరన్ డోమ్ లాగా పనిచేస్తుంది. దోమలను నియంత్రిస్తుంది. దానివల్ల డెంగీ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు దరిచేరవని” ఆనంద్ రాసుకొచ్చారు.

ఎలా పని చేస్తుందంటే..

ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన పరికరం లో లేజర్ ఆధారిత క్యానన్ ఉంది. ఇది రాడార్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. దాని చుట్టూ ఉన్న దోమలను వేగంగా పసిగడుతుంది. ఆ తర్వాత లేజర్ పాయింట్ దోమలను సమూలంగా నాశనం చేస్తుంది. చైనా దేశానికి చెందిన ఆ వ్యక్తి తన ఎలక్ట్రిక్ కారులోని రాడార్ ను తనకు అనుకూలంగా మార్చుకొని.. ఈ మిషన్ తయారు చేశారు. ఇది దోమలను చంపడంతో పాటు.. ఇతర కీటకాలను కూడా నాశనం చేస్తుంది. దోమలను చంపే క్రమంలో ఎటువంటి రసాయనాలు విడుదల కావు. సాధారణంగా వాడే మస్కిటో కాయిల్స్ వివిధ రకాల వాయువులను విడుదల చేస్తాయి. అవి శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలగజేస్తాయి. ఇదే విషయం పలు పరిశోధనల్లో తేలింది. అయితే ఇన్నాళ్లకు ఎటువంటి విషయ వాయువులు లేకుండా.. ఎటువంటి రీఫిల్స్ వాడకుండా దోమలను నివారించే క్యానన్ ను తయారు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే దోమలు అనేవి ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారాయి. ముంబై అని మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రస్తుతం జ్వరాలు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నాయి. డెంగీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నాయి. పారిశుద్ధ్యలేమి, వర్షాలు కురవడం, మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇదే సమయంలో రకరకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. దోమలను నియంత్రించేందుకు చైనా దేశానికి చెందిన వ్యక్తి ఈ పరికరాన్ని కనిపెట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.. ఒకవేళ ఈ ప్రయోగం మరిన్ని దశలు దాటుకుని అభివృద్ధి చెందితే దోమల నివారణ దాదాపుగా సాధ్యమైనట్టే.