Anam Ramnarayan Reddy : ఇప్పటికే నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను గిల్లి గిచ్చి కయ్యాలు పెట్టుకొని జగన్ ఏకును మేకుగా మార్చుకొని చాలా డ్యామేజ్ చేసుకున్నారు. రఘురామ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. దేశవ్యాప్తంగా జగన్ పై అపనిందలు పడ్డాయి. ఆయన ఇన్సిడెంట్ మరిచిపోకముందే ఇప్పుడు వైసీపీలో మరో రెబల్ ను జగన్ చేతులారా తయారు చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. ఆయన ఎవరో కాదు నెల్లూరు ‘ఆనం’ రెడ్డి.

వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందని.. పనులు చేయలేకపోతున్నామని.. నిధులు ఇవ్వడం లేదని.. మరోసారి ప్రజల్లోకి వెళ్లి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలని ఇటీవల వైసీపీ నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి నోరుపారేసుకున్నారు. దీంతో జగన్ సీరియస్ అయ్యి ఆయనకు సెక్యూరిటీ తగ్గించేశాడు. పైగా వెంకటగిరి వైసీపీ ఇన్ చార్జీగా మరో నేతను నియమించి షాకిచ్చాడు. ఆనంను నియోజకవర్గంలో డమ్మీని చేసిపడేశారు.
తాజాగా తనకు ప్రాణహాని ఉందని.. ప్రాణం తీసేస్థాయికి వైసీపీ దిగజారుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తాను దేనికైనా సిద్ధమంటూ ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే తనలాంటి వాళ్లు మరో పది మంది పుట్టుకు వస్తారని ఎమోషనల్ అయ్యారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నా తనకు సెక్యూరిటీ తగ్గించలేదని.. సొంత పార్టీలో ఉన్నా జగన్ తగ్గించేశాడని నిప్పులు చెరిగారు. తన ఫోన్లు, తన పీఏ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని..నెల్లూరులో మాఫియాగ్యాగ్ లు రాజ్యమేలుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
నెల్లూరు పెద్దారెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కూడా పార్టీ పట్ల ఏమంతా అనుకూలంగా లేరు. తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కకపోవడంతో ఆయన అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. విస్తరణ లో సైతం జగన్ ముఖం చాటేయ్యడంతో వైసీపీలో ఉండడం వృథా అని డిసైడ్ కు వచ్చారు. అందుకే తన కుమార్తెను చంద్రబాబు, లోకేష్ ల వద్దకు పంపించి పార్టీ హైకమాండ్ కు నేరుగా సంకేతాలు పంపించారు. అటు అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు కాకాని గోవర్థన్ రెడ్డిలకు మంత్రి పదవులిచ్చి.. తనపై జగన్ ఊసిగొల్పడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే ఈ పాటికే ఆనం ఫ్యామిలీ ఏకతాటిపైకి వచ్చారని.. ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఇప్పటికే రఘురామతో పెట్టుకొని జగన్ ఎంత డ్యామేజ్ కావాలో అంతా అయ్యారు. తాజాగా ఆనంను రెచ్చగొడుతూ ఫోన్లు ట్యాప్ చేస్తూ అంతగా జగన్ కొరివిపెట్టుకుంటున్నారు. మరో రఘురామలా ఆనంను మారుస్తున్నారన్న చర్చ సాగుతోంది.