Anam Ramanarayana Reddy- ABN RK: ఏపీ మీడియాలో ఎల్లో మీడియా తీరే వేరు. వారిది ఎప్పటికీ ఒకటే ఆరాటం. తెలుగుదేశం పార్టీ బాగుండాలి. తాము నాలుగు పైసలు వేనుకేసుకోవాలి. నిత్యం టీడీపీ గురించే పరితపిస్తుంటారు. ఈ క్రమంలో జగన్ నామస్మరణ లేనిదే వారికి నిద్రపట్టదు. జగన్ దిగిపోవాలి..చంద్రబాబు అధికార పీఠం ఎక్కాలి. అందుకు ఎంతదాకైనా తెగించే వరకూ వెనుకాడరు. టీడీపీ, చంద్రబాబు కోసం అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు. లేకపోతే అదే కాళ్లను లాగేసి నిలువునా బోర్లా కొట్టించగలరు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి విజయం దక్కడంతో వారి సంతోషానికి అవధులు లేవు. ఏబీఎన్ రాధాక్రిష్ణ అయితే పండుగ చేసుకుంటున్నారు. వైసీపీకి ధిక్కరించిన ఎమ్మెల్యేలను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారితో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కోటంరెడ్డిని పిలిచిన ఆర్కే.. ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డిని కూడా పిలిచారు. హుందాగా ఉండే నేతతో వైసీపీకి, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ ప్రోమోలు వైరల్ అవుతున్నాయి.
ఆ నలుగురిపై వైసీపీ ఆరోపణలు..
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాష్ ఓటింగ్ చేయడం వల్లే టీడీపీ అభ్యర్థి గెలుపు సాధ్యమైంది. గత కొద్దిరోజులుగా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఆనం, కోటంరెడ్డిలు ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఓటు వేశారు. వారితో పాటు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు సైతం టీడీపీ అభ్యర్థికే ఓటువేశారంటూ వైసీపీ అనుమానించి బహిష్కరించింది. ఈ క్రమంలో రూ.20 కోట్లు చొప్పున టీడీపీ కొనుగోలు చేసిందని వైసీపీ విమర్శలు చేస్తూ వస్తోంది. అయితే ఆర్కే తన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చీప్ గా రూ.20 కోట్లకు అమ్ముడుపోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీంతో రామనారాయణరెడ్డి ఓపెన్ అవ్వాల్సి వచ్చింది.
క్లారిటీ ఇచ్చిన ఆ ముగ్గరు..
ఇప్పటికే టీడీపీ రూ.,20 కోట్ల ఆఫర్ పై ధిక్కార ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. ఆమె కుటుంబసభ్యులు సైతం ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. రూ.20 కోట్లకు అమ్ముడుపోవడం ఏంది? చీప్ గా అంటూ కౌంటర్ ఇచ్చారు. తమ ఆస్తులే భారీ స్తాయిలో ఉంటే తాము మరీ రూ.20 కోట్లకు అమ్ముడుపోతామా అంటూ ప్రశ్నించారు. శ్రీదేవి కుమార్తె అయితే ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. చిన్న లాజిక్ ను మిస్సయ్యారంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం ఏకంగా వైసీపీ నేతలకు సవాలే చేశారు. రూ.20 కోట్లకు అమ్ముడుపోయే దీన స్థితిలో లేనని బదులిచ్చారు. అటు కోటంరెడ్డి సైతం తనదైన శైలిలో వ్యంగ్యోక్తులు సంధించారు.
కూల్ గా స్పందించిన ఆనం..
అయితే ఆనం రామనారాయణరెడ్డి మాత్రం ఎక్కడా స్పందించలేదు. కానీ ఏబీఎన్ ఆర్కే ఇంటర్వ్యూలో కూల్ గా సమాధానం చెప్పారు. తాము అంత తక్కువగా అమ్ముడుపోవడానికి కారణం ఒకటుందని చెప్పారు. ఏపీ పేద రాష్ట్రం కావడం వల్లే తాము తక్కువకు అమ్ముడుపోయామంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. అయితే ఇంకా టెలికాస్ట్ కానీ ఈ ఎపిసోడ్ సెగలు రేపుతోంది. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఇంటర్య్వ్యూ ప్రోమోకు … అల్లు అర్జున్ ఫొటో ట్యాగ్ చేసి.. చీప్ వెరీ చీప్ అంటూ కామెంట్ పెట్టి ట్రోల్ చేస్తోంది. నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఏపిసోడ్ కు ఇది ఉచిత ప్రచారం అవుతోంది. అసలు ఆనం ఏం చెప్పారంటూ అందరూ ఆసక్తిగా ఆరాతీయడం ప్రారంభించారు.