Anam Ramanarayana Reddy: వైసీపీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు వచ్చి టిడిపిలో చేరుతున్నారు. తమతో చాలామంది టచ్ లో ఉన్నారని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ అభ్యర్థుల మార్పుతో ఆ పార్టీలో గందరగోళం నెలకొందని.. టికెట్ దక్కని వారు నేరుగా టిడిపిలో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆరు నెలల కిందట పార్టీకి దూరమైన సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం టిడిపిలో ఇంతవరకు చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఆయన వేరే ఆలోచనతో ఉన్నారా? అన్న ప్రచారం సాగుతోంది.
ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్యేల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నలుగురు టిడిపికి అనుకూలంగా ఓటు వేశారని వైసిపి హై కమాండ్ వెయిట్ వేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిని అప్పట్లో సస్పెండ్ చేశారు. అయితే ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు. ఇటీవల చంద్రబాబు సమక్షంలో చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి టిడిపిలో చేరిపోయారు. ఇక మిగిలిన ఆనం రామనారాయణరెడ్డి ఎక్కడ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయన టిడిపిలో చేరుతారా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
అయితే ఆయన పోటీ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు కాక ఆయన వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నుంచి టిక్కెట్ ఇవ్వనని ఇదివరకే చంద్రబాబు తేల్చేశారు. అక్కడ టిడిపికి బలమైన అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉన్నారు. నెల్లూరు సిటీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు నారాయణ ఉన్నారు. ఆయనను కాదని ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఇక మిగిలింది ఆత్మకూరే. అయితే అక్కడ పోటీ చేసేందుకు ఆనం రామనారాయణరెడ్డి సరుకులు పెడుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఇవ్వడంతో పాటు ఎలక్షన్ ఫండ్, మంత్రి పదవి అడుగుతున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు.
మరోవైపు సర్వేపల్లి నుంచి ఆనం పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంటుంది. దీనిని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. అటు వైసీపీలోకి వెళ్లలేక.. ఇటు టిడిపిలోకి ఎంట్రీ లేక ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మున్ముందు ఆనం రామనారాయణ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.