Satvik : శ్రీచైతన్య దారుణాల్లో ఇది మరో కోణం.. సాత్విక్ ఉసురు తీసినా కించిత్ పశ్చాత్తాపం లేదు

Satvik : తమ కొడుకు మంచి చదువులు చదివి, ప్రయోజకుడయి ఉన్నత స్థానంలో ఉండాలని ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు.. రెక్కలు ముక్కలు చేసుకుని శ్రీ చైతన్య కాలేజీలో చేర్పించారు. కానీ వారు ఒకటి తలిస్తే, కాలేజీ యాజమాన్యం మరొకటి తలచింది. పదహారేళ్ల కొడుకు వారి కళ్ళముందే విగతజీవిగా పడి ఉండడంతో వారి వేదన చెప్పనలవి కాకుండా ఉంది.. నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న ఒక్కో విషయం దిగ్బ్రాంతికి […]

Written By: Bhaskar, Updated On : March 1, 2023 1:10 pm
Follow us on

Satvik : తమ కొడుకు మంచి చదువులు చదివి, ప్రయోజకుడయి ఉన్నత స్థానంలో ఉండాలని ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు.. రెక్కలు ముక్కలు చేసుకుని శ్రీ చైతన్య కాలేజీలో చేర్పించారు. కానీ వారు ఒకటి తలిస్తే, కాలేజీ యాజమాన్యం మరొకటి తలచింది. పదహారేళ్ల కొడుకు వారి కళ్ళముందే విగతజీవిగా పడి ఉండడంతో వారి వేదన చెప్పనలవి కాకుండా ఉంది.. నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న ఒక్కో విషయం దిగ్బ్రాంతికి గురిచేస్తోంది..

వాస్తవానికి సాత్విక్ చదువులో చురుకే.. పదో తరగతిలో అతడికి 9 ప్లస్ జీపీఏ వచ్చింది.. ఈ క్రమంలో అతని తల్లిదండ్రులు శ్రీ చైతన్య లో చేర్పించారు.. మొదట్లో పాఠాలు అర్థం కాకపోవడంతో చదువులో కొంచెం వెనుకబడ్డాడు. పైగా ఇతడిది వెనుకబడిన తరగతులకు చెందిన సామాజిక వర్గం కావడంతో, అధ్యాపకులు వేధించడం మొదలుపెట్టారు. పైగా అతడిని తీవ్రంగా కొట్టారు. గాయపడిన అతడు 15 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు.. దీంతో కాలేజీకి తిరిగి వెళ్లేందుకు అతడు నిరాకరించాడు. అయితే తల్లిదండ్రులు అతడిని బుజ్జగించి మళ్లీ కాలేజీకి పంపారు.. తమ కొడుకును ఏమీ అనొద్దని యాజమాన్యాన్ని కోరారు. కానీ అవేవీ యాజమాన్యం పట్టించుకోలేదు.

ఈ క్రమంలో అతడిని మళ్లీ వేధించడం మొదలుపెట్టారు.. మార్కులు తక్కువ వస్తున్నాయని తీవ్రంగా కొడుతున్నారు. రక్తాలు వచ్చేలా కొట్టి, రక్తపు మరకలను విద్యార్థులతోనే తుడిపిస్తున్నారు.. ఈ దృశ్యాలను కొంతమంది సెల్ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయినప్పటికీ విద్యాశాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. పైగా శ్రీ చైతన్య క్యాంపస్ లోకి తల్లిదండ్రులకు ప్రవేశం నిషిద్ధం. కేవలం సంవత్సరానికి మూడుసార్లు మాత్రమే వారికి వచ్చే అవకాశం కల్పిస్తారు.. తమ పిల్లలు అనారోగ్యానికి గురైనా సరైన సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు అంటున్నారు..

ఇక సాత్విక్ విషయంలో అధ్యాపకులు వ్యవహరించిన తీరు విస్తు గొలిపేలా ఉంది. మార్కులు తక్కువ వస్తున్నాయనే నెపంతో అతడికి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టడం లేదు.. ఫీజు చెల్లించడం ఆలస్యమైన నేపథ్యంలో మండుటెండలో నిలబెట్టారు.. అతని కర్రలతో కొడితే శరీరం అంతా వాతలు తేలింది.. అతడు ఆత్మహత్య చేసుకునే ఒకరోజు ముందు కూడా ఆధ్యాపకులు తీవ్రంగా కొట్టారు.. బట్టలు ఆర వేసుకునే తాడుతో ఉరి వేసుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ అధ్యాపకుల మనసు కరగలేదు.. హాస్టల్ వార్డెన్ అయితే నాకెందుకు అన్నట్టుగా బయటకు వెళ్లిపోయాడు. సాత్విక్ చనిపోయినప్పటికీ కనీసం ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్పేందుకు కూడా యాజమాన్యం నిరాకరించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. పైగా కాలేజీలో హాస్టల్ గదులు అధ్వానంగా ఉంటాయని, పెట్టే భోజనం రుచిగా ఉండదని విద్యార్థులు అంటున్నారు. మార్కుల పేటలో విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారని అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది. విద్యార్థుల పార్టీ మృత్యుకుహారాలుగా మారిన కార్పొరేట్ కాలేజీ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తున్నది.