ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే..? ‘అమరావతి మాత్రం కాదు’ అనే సమాధానం వ్యవస్థీకృతమైపోయింది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడిట్లో ఒకటిగా ఉన్న అమరావతిపై అందరికీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. చివరకు బ్యాంకులు కూడా ఇదే నమ్మకానికి వచ్చేసినట్టుగా ఉన్నాయి.
అమరావతి ప్రాంతంలో సగంలో ఉన్న పలు నిర్మాణాలను పూర్తిచేయడానికి సిద్ధపడింది జగన్ ప్రభుత్వం. ఇందుకోసం లెక్కలు వేస్తే 2 వేల కోట్ల రూపాయలు అవసరమైనట్టు సమాచారం. దీంతో.. ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని సర్కారు భావించిందట. ఇదే విషయాన్ని బ్యాంకులకు తెలియజేస్తే.. వారు షాకింగ్ రిప్లే ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఎలాగో అమరావతి రాజధానిగా ఉండట్లేదు కాబట్టి.. అక్కడి పనులకు రుణం ఇచ్చినా.. తిరిగి వచ్చే పరిస్థితి అంతంత మాత్రమేనని బ్యాంకులు భావిస్తున్నాయట. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలను మొండి పద్దుల్లో చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని, ఇప్పుడు అమరావతికి రుణం ఇస్తే.. జరగబోయేది ఇదే అని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ ఆలోచనతోనే రుణం ఇవ్వడానికి బ్యాంకులు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా.. మరోలా వ్యక్తపరిచాయట!
ఏఎంఆర్డీఏ కింద అమరావతి నిర్మాణాలకు రూ.2 వేల కోట్లు ఇవ్వాలని అడగ్గా.. ముందుగా ఇచ్చిన రుణాల సంగతేంటో చెప్పాలని అడిగాయట బ్యాంకులు. ఇప్పటి వరకూ తాము అమరావతికి రూ.3 వేల కోట్ల రుణం ఇచ్చామని, ముందు వాటి గురించి తేల్చిన తర్వాతే.. కొత్త అప్పుల గురించి మాట్లాడాలని చెప్పినట్టు సమాచారం. అంటే.. పాత అప్పులే తీర్చలేదు కాబట్టి.. కొత్తవి ఇవ్వబోమన్నదే ఇందులోని అంతరార్థం అని చెబుతున్నారు.
ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో సరంజామా మొత్తం అక్కడికి తరలించేందుకు ముహూర్తాలు కూడా చూసుకుంటోందనే ప్రచారం సాగుతోంది. కడప జిల్లాలో ఒక్క ఉప ఎన్నిక మినహా.. ఎలక్షన్ల హడావిడి మొత్తం ముగిసిపోయింది. కాబట్టి.. ఇక పాలనపై దృష్టిపెట్టి, రాజధాని తరలింపును వేగవంతం చేయబోతున్నారని సమాచారం. అదే జరిగితే.. అమరావతిలో అసెంబ్లీ హాలు తప్ప.. మిగిలేది ఏమీ ఉండదని అంటున్నారు.
ఈ విధంగా.. అమరావతి నుంచి ప్రభుత్వమే తరలి వెళ్లిన తర్వాత.. అక్కడి భవనాలకు రుణాలు ఇస్తే వసూళ్లకు నానా తంటాలు పడాల్సి వస్తుందని బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారట. అందుకే.. పరోక్షంగా రుణం ఇచ్చేది లేదని చెప్పారని అంటున్నారు. ఈ విధంగా.. అమరావతితో రుణం తీరిపోయిందన్న నిజం అందరికీ అర్థమైపోయిందని అంటున్నారు.