Amit Shah: బిపర్జోయ్ తుఫాన్ నైరుతి రుతుపవనాలనే కాదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనను కూడా అడ్డుకుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను గుజరాత్ తీరంగా మహా ఉగ్రంగా మారుతోంది. దీని ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాల విస్తరణలో మందగమనం ఏర్పడింది. అదే సమయంలో వాతావరణం కూడా అత్యంత క్లిష్టంగా మారింది. ఫలితంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది.. షెడ్యూల్ ప్రకారం అమిత్ షా బుధవారం రాత్రికి ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. రాత్రికి శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో ఆయన బస చేయాల్సి ఉంది. గురువారం ఉదయం రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశం, అనంతరం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ, ఆ తర్వాత ప్రముఖ శని దర్శకుడు రాజమౌళితో మణికొండలో సమావేశం నిర్ణయించారు. 12:45 నిమిషాలకు శంషాబాద్ లోని జెడి కన్వెన్షన్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులతో, క్యాడర్ తో విందు సమావేశం నిర్వహించాల్సి ఉంది… ఆ తర్వాత రెండు గంటల 25 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి భద్రాచలంలో రాములవారిని సాయంత్రం నాలుగు గంటలకు దర్శించుకున్న తర్వాత ఐదు గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఖమ్మం చేరుకోవాల్సి ఉంది. అయితే తుఫాన్ వల్ల ఈ కార్యక్రమాలు మొత్తం రద్దు చేసుకున్నారు.
తాత్కాలికంగా రద్దు
ఈ తుఫాను మూడు రోజుల క్రితమే ఏర్పడింది. ఇది అంతకంతకు విస్తరిస్తోంది.. ఈ తుఫాన్ గురించి అధికారులకు తెలిసినప్పటికీ వారు ఈ టూర్ ప్లాన్ చేశారు. అయితే ఇటీవల నాయకులు మధ్య విభేదాలు ఏర్పడి, అవి అంతర్గత చిచ్చుకు దారి తీసిన నేపథ్యంలో అమిత్ షా రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టాలని నిర్ణయించారు..ఇందులో భాగంగా మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజంలోని అత్యున్నత వ్యక్తులను కలిసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇక అమిత్ షా వస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యవర్గం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. భారీగా జన సమీకరణ చేసేందుకు నేతల మొత్తం క్షేత్రస్థాయిలో విరామం అనేది లేకుండా శ్రమించారు. అయితే తుఫాన్ తీవ్ర రూపం దాల్చడంతో, విమానం నడిచేందుకు పరిస్థితులు అనవుగా లేకపోవడంతో అమిత్ షా టూర్ ను తాత్కా లికంగా రద్దు చేసినట్టు ఈ రాష్ట్ర నాయకులు చెప్తున్నారు.
త్వరలో మళ్లీ పర్యటన
తుఫాన్ వల్ల రద్దయిన అమిత్ షా పర్యటన మళ్లీ ఎప్పుడు నిర్వహించేది చెబుతామని పార్టీ నాయకులు ఒక పత్రికా ప్రకటనలో వివరించారు. తుఫాన్ వల్ల వాతావరణం కఠినంగా మారడంతో విమానం నడిచే పరిస్థితులు లేవని, అందుకే అమిత్ షా పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు వారు వివరించారు. కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన పార్లమెంట్ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో అమిత్ షా ఖమ్మం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే బుధవారం పొంగులేటి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇద్దరి మధ్య టిక్కెట్లకు సంబంధించి చర్చలు జరిగాయి. వాస్తవానికి పొంగులేటి భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరుతారని అందరూ అనుకున్నారు. అప్పట్లో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు తో కలిసి పొంగులేటి ఇంటికి వెళ్లారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. మొన్నటిదాకా కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరగడం, ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తుండడం వంటి పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చుతాయని భావించిన అమిత్ షా తెలంగాణ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేడర్లో జవసత్వాలు నింపేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆయన పర్యటన మీద తుఫాన్ నీళ్లు చల్లింది. మళ్లీ ఆయన ఎప్పుడు పర్యటిస్తారో చెబుతామని బిజెపి నాయకులు వివరిస్తున్నారు. ఇక అమిత్ షా పర్యటన వాయిదా పడటంతో బిజెపి శ్రేణుల్లో నైరాశ్యం అలముకుంది.