
అమిత్ షా ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఇది పర్సనల్ టూర్. అయినప్పటికీ.. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి. అంతేకాదు.. కేంద్రంలో మోడీ తర్వాత నంబర్ 2 అని కూడా అంటారు. ఇటు వైసీపీ నేతలు బీజేపీతో సానుకూల వైఖరినే అవలంభిస్తుంటారనే ప్రచారం ఉంది. పలు సమస్యల మీద ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షాను ప్రసన్నం చేసుకోవడానికి ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తుంటారనే ప్రచారం కూడా ఉంది. మరి, అలాంటి అమిత్ షా.. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇంకెలా రిసీవ్ చేసుకుంటారు? కానీ.. అందుకు రివర్స్ లో జరిగిందిప్పుడు!
కేవలం ప్రొటోకాల్ పాటించారు. కర్నూలు ఎంపీ, కొందరు అధికారులు మాత్రమే అమిత్ షాకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కానీ.. ఇతర మంత్రులు కానీ కనిపించలేదు. కేంద్రం నుంచి వచ్చిన వారికి రాష్ట్ర సమస్యలు వివరించే అవకాశం ఉంటుంది. ఈసారి అది కూడా చేయలేదు. కనీసం.. వినతిపత్రాలు వంటివి కూడా ఎవరూ అందించలేదు. కేంద్ర హోమంత్రి, దేశంలో కీలక నేతగా ఉన్న అమిత్ షా పట్ల వైసీపీ ఇలా వ్యవహరించడం వెనుక కారణం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది.
అయితే.. ఇలా వ్యవహరించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఇలా వ్యవహరించారా? అనే చర్చ సాగుతోంది. ఇందులో భాగంగానే.. కేవలం ఖచ్చితమైన ప్రొటోకాల్ ను మాత్రమే పాటించారని అంటున్నారు. మొత్తానికి.. రాజకీయ పార్టీల్లో ఒక విధమైన చర్చ జరుగుతోంది.