Amit Shah-Ramoji Rao meeting: తెలంగాణలో ఈనాడు బీజేపీని భుజానికెత్తుకుంటుందా? అసలేం జరుగుతోంది?

Amit Shah-Ramoji Rao meeting:   నాడు ఎన్టీఆర్ నుంచి.. నేటి కేసీఆర్ వరకూ అదే కథ.. బలమైన మీడియాను చేతిలో పట్టుకొని రాష్ట్ర రాజకీయాలను అతాలకుతలం చేసే వ్యథ.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మాట వినడం లేదని.. ఆయనపై వ్యతిరేకత వార్తలు రాయించి.. తానా అంటే తందానా అన్న చంద్రబాబును నాడు సీఎం కుర్చీలో కూర్చోబెట్టడంలో రాజగురువు ‘రామోజీ పాత్ర’ గురించి రాజకీయవర్గాల్లో కథలు కథలుగా ఇప్పికీ చెబుతుంటారు. చంద్రబాబు సొంత మామను ‘వెన్నుపోటు’ పొడిచినప్పటికీ […]

Written By: NARESH, Updated On : August 22, 2022 9:18 am
Follow us on

Amit Shah-Ramoji Rao meeting:   నాడు ఎన్టీఆర్ నుంచి.. నేటి కేసీఆర్ వరకూ అదే కథ.. బలమైన మీడియాను చేతిలో పట్టుకొని రాష్ట్ర రాజకీయాలను అతాలకుతలం చేసే వ్యథ.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మాట వినడం లేదని.. ఆయనపై వ్యతిరేకత వార్తలు రాయించి.. తానా అంటే తందానా అన్న చంద్రబాబును నాడు సీఎం కుర్చీలో కూర్చోబెట్టడంలో రాజగురువు ‘రామోజీ పాత్ర’ గురించి రాజకీయవర్గాల్లో కథలు కథలుగా ఇప్పికీ చెబుతుంటారు. చంద్రబాబు సొంత మామను ‘వెన్నుపోటు’ పొడిచినప్పటికీ ఆయననే హీరో.. సీనియర్ ఎన్టీఆర్ ను ‘లక్ష్మీపార్వతి వ్యసనపరుడిగా’ చూపించిన ఘనత నాటి టీడీపీ అనుకూల మీడియాదని చెప్పుకుంటారు. అందుకే చంద్రబాబు అంటేనే ఒక మేనేజ్ మెంట్. మీడియాను, కొన్ని వ్యవస్థలను ఆయన ఈజీగా మెయింటేన్ చేస్తాడని పేరుంది. చంద్రబాబుకు రాజగురువు సపోర్ట్ తోనే ఈ 40 ఏళ్ల పాలిటిక్స్ విజయవంతంగా నడిపించాడన్న టాక్ ఉంది.

-మీడియా, సోషల్ మీడియా లేవు.. నాడు పత్రికలనే నమ్మవారు..
ఈ టీవీలు, సోషల్ మీడియాలు లేని కాలంలో ప్రజలకు సమాచారం చేరే వేసే ఏకైక సాధనం కేవలం ‘పత్రికలు’ మాత్రమే.. ఉదయం పత్రికలు రాగానే రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అని కేవలం పత్రికల ద్వారానే ప్రజలు అర్థం చేసుకునేవారు. అందుకే ప్రజల కళ్లకు గంతలు కట్టి నాడు బలమైన పత్రికగా ఉన్న ఈనాడు వాస్తవాలు కప్పి పుచ్చి తనకు అనుకూలమైన వారినే భుజానకెత్తుకున్నదన్న వాదన ఉంది. నాడు లక్ష్మీపార్వతితో కలిసిన ఎన్టీఆర్ ను ప్రజల్లో విలన్ ను చేయడంలో.. చంద్రబాబును దైవాంస సంభూతుడుగా చూపడంలో రామోజీ రావు సక్సెస్ అయ్యాడని ఇప్పటికీ నాడు ప్రత్యక్షంగా చూసిన వారు ఆరోపిస్తుంటారు. ఎన్టీఆర్ తన మాట వినడం లేదని.. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడన్న ఒకే ఒక కారణంతో రాజగురువు ఇలా చంద్రబాబును పైకి లేపాడని అంటుంటారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు రాజగురువు చెప్పిన అన్ని కండీషన్లకు ఒప్పుకొని ఆయన మాట ప్రకారం చేసి సీఎం అయ్యారని ఆరోపణలున్నాయి. అందుకే ‘వెన్నుపోటు’ అని ప్రతిపక్షాలు ఎంత బలంగా అంటున్నా కానీ.. ఆ మరకను బలంగా తీసుకెళ్లలేకపోవడానికి కారణం నాటి మీడియానే. చంద్రబాబుకు అనుకూలంగా రామోజీ సహా ప్రధాన మీడియా కమ్మేయడంతో ఇప్పటికీ అప్పటి వాస్తవాలు బయటకు విస్తృతంగా వెళ్లవు. ప్రధాన మీడియా అంతా మన చంద్రబాబు చేతుల్లోనే, కమ్మవారి కబంధ హస్తాల్లోనే ఉండడంతో ఆయనపై వ్యతిరేకత అన్నది ఇప్పటికీ బయటకు రాదు. ఇప్పుడంటే సోషల్ మీడియా, మీడియా వల్ల చంద్రబాబు పప్పులు ఉండకడం లేదు కానీ అప్పట్లో చంద్రబాబును ఈ స్థాయికి తేవడంలో రాజగురువు, ఆయన మీడియా ప్రముఖ పాత్ర పోషించింది..

-గత 2018 తెలంగాణ ఎన్నికల్లోనూ విరుచుకుపడిన ఈనాడు, జ్యోతి
చంద్రబాబు ఎటు నిలబడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా టీడీపీ అనుకూల మీడియా అటే సపోర్టు చేస్తుంది. ఈక్రమంలోనే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. అక్కడ రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి.. తెలంగాణలో కాంగ్రెస్ ను గద్దెనెక్కించడానికి పడరాని పాట్లు పడ్డారు. ఈ క్రమంలోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా అధినేతలు అయితే ‘కాంగ్రెస్ గెలుస్తోంది.. కేసీఆర్ ఓడిపోతున్నారని’ తన మీడియాలో తెగ ప్రచారం చేశారు. కాంగ్రెస్ యాడ్స్ ను ఫుల్ పేజీ ఇచ్చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ సహా ఇతర కీలక నేతలు ఓడిపోతున్నారని.. ఆ సర్వే ఈ సర్వే, లగడపాటి సర్వే అంటూ టీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బతీసేందుకు మీడియాలో చేసిన అతి అంతా ఇంతాకాదు. ముఖ్యంగా ఈనాడులో ,. ఆంధ్రజ్యోతిలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమంటూ చేసిన ప్రచారం చూసి ఒకానొక సమయంలో కేటీఆర్ కూడా ‘ఈ రెండు పత్రికలు చదివితే మేం ఓడిపోతామని మాకే డౌటు వస్తోంది’ అని అన్నాడంటే ఈ రెండు మీడియాల పవర్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు చెబితే కొండ మీద కోతి అయినా ఆ రెండు పత్రికలకు దేవుడిగా కనిపిస్తారు. వారినే అందలం ఎక్కించాలని చూస్తారు. 2018లో అదే జరిగింది. కానీ చంద్రబాబు-కాంగ్రెస్ ద్వయం తెలంగాణలో గెలవలేదు. వీరిని ‘ఆంధ్రా సెంటిమెంట్’ బూచీగా చూపించి కేసీఆర్ ఓడించాడు. ఒకవేళ చంద్రబాబు-కాంగ్రెస్ గెలిస్తే నిజంగానే ఇక్కడ టీఆర్ఎస్ ను మరింతగా దెబ్బతీసేవారు. ఈ మేరకు ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కథనాలు కూడా వండివార్చేవన్న టాక్ ఉంది.

-తెలుగు రాష్ట్రాల్లో గెలుపునకు మీడియా తప్పనిసరి
ఎక్కడైనా సరే ప్రజల్లో నిలబడాలన్నా.. పాపులారిటీ సాధించాలన్న మీడియా తప్పనిసరి. మీడియా లేకపోతే ప్రజల్లోకి బలంగా వెళ్లలేం. ఈ వాస్తవాన్ని గుర్తించాడు కాబట్టే చంద్రబాబు తన అను‘కుల’ కమ్మ పారిశ్రామికవేత్తలతో పత్రికలు, న్యూస్ చానెళ్లు పెట్టించి మొత్తం టీడీపీకి అనుకూల వాతావరణం సృష్టించుకున్నాడు. ఇది లేదని గ్రహించే నాడు ‘వైఎస్ఆర్’ సాక్షికి ప్రాణంపోశాడు. తెలంగాణలో ఇదే చంద్రబాబు మీడియా దెబ్బకు ఆగమాగమైన కేసీఆర్ ‘నమస్తే తెలంగాణ’కు పురుడుపోశాడు. ఇలా జనాల్లో తమ వాణి వినిపించాలంటే మీడియా అవసరం. అయితే ఇప్పటికీ తెలుగు నాట అగ్ర మీడియా అంటే ‘ఈనాడు’నే.. దాని సర్య్కూలేషన్, వెబ్ సైట్ వ్యూయర్ షిప్ లో సగానికి కూడా మిగతా వాటిలో లేవు. చంద్రబాబుకు కొమ్ము కాస్తూనే అది తెలియకుండా వాస్తవాన్ని చెబుతూ ఈనాడు మ్యాజిక్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువగా అందిస్తుంది. అందుకే అందరూ దాన్నేచూస్తారు. ఎన్నికల వేళ తమకు అనుకూలమైన వారి సైడ్ జంప్ అవుతుంది. అదునుచూసి దెబ్బకొడుతుంది. అందుకే ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మద్దతు కోసం తెలంగాణ పార్టీలు అర్రులు చాస్తుంటాయి. పీసీసీ చీఫ్ కాగానే రేవంత్ రెడ్డి వెళ్లి రామోజీరావును కలిసి మద్దతు కోరారు. బీజేపీ చీఫ్ అయ్యాక బండి సంజయ్ ఇదే పనిచేశారు. ఇప్పుడు అమిత్ షా వంతు వచ్చేసింది..

-రామోజీరావుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏకాంత భేటి
రామోజీరావు లాంటి ఉద్దండ మీడియా మొఘల్ తో భేటి అంటే అది సామాన్యమైన ముచ్చట కాదు.. రాష్ట్ర రాజకీయాలను చిటికెలో మార్చగల ఘనత రామోజీ సొంతం. నాడు వైఎస్ఆర్ పై ‘పెద్దలా గద్దలా’ అంటూ వరుస అవినీతి మరకలు అంటించి ఆయన ప్రతిష్టను మీడియాలో దిగజార్చిన ఘనత ఈనాడు సొంతం. ఆయన పత్రికలో వైఎస్ఆర్ ను అవినీతిపరుడిగా ప్రొజెక్ట్ చేశారు. ఇప్పటికీ జగన్ కు అదే మరక కొనసాగుతోంది. మీడియాను ఎంత ప్రభావవంతంగా వాడుకోవచ్చో రామోజీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.. ఈనాడుతోపాటు ఆంధ్రజ్యోతిది అదే బాట కావడతో ఈ రెండు బలమైన మీడియాలో మద్దతు తెలుగు రాష్ట్రాల్లో ఎదిగే పార్టీకి అవసరం. అందుకే దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తి అయిన అమిత్ షాలాంటి వారు కూడా హైదరాబాద్ వచ్చి రామోజీని కలవడం వెనుక ఆంతర్యం అదే. తెలంగాణలో బీజేపీకి వచ్చేసారి గెలుపు అవకాశాలున్నాయి. దానికి మీడియా సపోర్టు అవసరం. బీజేపీకి ‘వీ6’ ఒకటి అరా తప్పితే పెద్ద మీడియా సపోర్టు లేదు.అందుకే రామోజీతో అమిత్ షా ఈ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

ఇక రామోజీతో డీల్ లో మరొక విషయం కూడా ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు.అదే చంద్రబాబుతో బీజేపీ పొత్తు అంశం. బీజేపీ పెద్దాయన అమిత్ షాను. చంద్రబాబును ఒక్కటి చేసే బాధ్యతను రామోజీ భుజానికెత్తుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీలో సపోర్టు కావాలంటే చంద్రబాబుతో బీజేపీ కలిసి పనిచేయాలన్నది రామోజీ ఆలోచన. దీనికి అమిత్ షా ఒప్పుకుంటే మద్దతుగా నిలవడానికి ఆయనకు ఏం అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఎన్నిసార్లు బీజేపీతో కలుద్దామన్నా 2019లో వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును బీజేపీ పెద్దలు దగ్గరకు రానీయడం లేదు. అందుకే తన రాజగురువు రామోజీతో బీజేపీతో చెలిమికి చంద్రబాబు ఈ మీటింగ్ అరేంజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుతో పొత్తుకు ఏపీలో బీజేపీ అంగీకరిస్తే.. తెలంగాణలో బీజేపీని భుజానికెత్తుకోవడానికి రామోజీకి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇదే భేటీలో సీరియస్ గా చర్చించి ఉండొచ్చు. చంద్రబాబును బతికించడానికి మరోసారి రాజగురువు రంగంలోకి దిగినట్టు మీడియా సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

మొత్తంగా ఈనాడు రామోజీ, అమిత్ షా భేటిలో ఇరువురి అవసరం ఉంది. తెలంగాణలో బీజేపీని భుజానికెత్తుకోవడానికి ఈనాడు సపోర్టు కోసం అమిత్ షా ప్రయత్నించారు. ఇక దిగజారిపోతున్న తన మిత్రుడు చంద్రబాబును బతికించేందుకు రామోజీ అటునుంచి నరుక్కొచ్చాడు. ఈ ఉభయకుశలోపరి ఒప్పందం కుదిరిందా? లేదా? అన్నదే ఈ భేటీలో తేలిన అంశం. కుదిరితే ఇక నుంచి బీజేపీని ఈనాడు భుజానికెత్తుకోవడం ఖాయం. మున్ముందు ఈ విషయాలపై క్లారిటీ రానుంది.