
Karnataka Election – BJP : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానాన్ని అవలంబిస్తోంది. అక్కడ మాదిరే ఓట్లేసే ప్రైమరీల తరహా సంస్కృతిని తెరపైకి తీసుకొచ్చింది. అభ్యర్థులకు సంబంధించి ప్రతీ నియోజకవర్గంలో విస్తృతంగా జల్లెడ పట్టింది. ఎంపిక విధానాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించింది. ప్రతి స్థానంలో ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి గత శుక్రవారం వరకు ఎన్నికలు(సగటున150 మంది పార్టీ కార్యకర్తలతో అంతర్గతంగా) నిర్వహించింది. ఈ విభాగంలో మండల కమిటీల బాధ్యులు, సభ్యులు.. నియోజకవర్గ స్థాయి అన్ని విభాగాల మోర్చాల సభ్యులు ఉన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి పూర్తి మెజార్టీ సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అభ్యర్థుల ఎంపికను పకడ్బందీగా చేపడుతోంది. అధిష్ఠానం అదేశాల ప్రకారం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో 22 వేల మంది బీజేపీ కార్యకర్తలు పాలు పంచుకున్నారు. ఈ జాబితాను పార్టీ నాయకులు జిల్లా కోర్ కమిటీలకు పంపారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరాయి. దీనికి సబంధించి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం బీఎస్ య డ్యూరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కతీల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్, రాష్ట్ర సీనియర్ నేతలతో కూడిన రాష్ట్ర కోర్ కమిటీ 3,4 తేదీల్లో సమావేశమైంది. ఒక్కో అభ్యర్థిపై స్ర్కీనింగ్ జరిపింది. ఎంపిక చేసిన జాబితాను వారు సీల్డ్ కవర్‌లో ఢిల్లీ పంపారు.
దీనిపై శనివారం బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఆ జాబితాపై చర్చిస్తుంది. ఆదివారం అభ్యర్థుల తుది జాబితా విడుదలవుతుంది. కనీసం వందకుపైగా అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం జాబితా ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. బీజేపీ ఇలాంటి విధానం పాటించడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. అభ్యర్థుల ఎంపికపై గతంలో తప్పులు జరిగాయి. అది అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసింది. అయితే ఈసారి మేజిక్ మార్కు (113 అసెంబ్లీ స్థానా లు)ను సాధించాలని పార్టీ పట్టుదలగా ఉంది. అందుకే ఈ ప్రాథమిక విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ‘ప్రైమరీ’ విధానాన్నే పాటించింది. కానీ దారనంగా దెబ్బతింది. 543 స్థానాలకు గాను 44 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు కర్ణాటకలో ఆ పార్టీ ఒక్కో ఆశావహుడి నుంచి దరఖాస్తు ఫీజుగా రూ.2 లక్షల చొప్పున వసూలు చేసింది. దీనిపై సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి ఆ విధానానికి పార్టీ స్వస్తి పలికింది.