ఇప్పటి వరకు కరోనా వైరస్ కు మందు లేదన్న సంగతి తెలిసిందే. ఉన్నంతలో వ్యాక్సిన్ తోనే రక్షణ అని ప్రపంచం నిర్ణయానికి వచ్చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు.. అన్ని దేశాలూ వ్యాక్సినేషన్లో బిజీగా ఉన్నాయి. అయితే.. వాటి సమర్థ ఎంత అన్న విషయంలో స్పష్టమైన క్లారిటీ లేదనేది అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నా.. వైరస్ వ్యాపిస్తుందని కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో.. అందరికీ ప్రాణం లేచివచ్చే శుభవార్త ఒకటి తెరపైకి వచ్చింది. అమెరికన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో ఆ గుడ్ న్యూస్ వెలుగు చూసింది. మరి అది ఏంటన్నది చూద్దాం.
ప్రస్తుతం ప్రపంచంపై డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు బలంగా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 112 దేశాల్లో డెల్టా వేరియంట్ ప్రభావం చూపుతోందని సమాచారం. గతేడాది అక్టోబర్ లో భారత్ లో గురించిన ఈ వేరియంట్.. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ కనిపించింది. యూరప్ దేశాల్లో గట్టిగానే ప్రభావం చూపుతోంది. అయితే.. ఈ వేరియంట్ పై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయా? లేదా? అనే ాందోళన కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఒక్క కొవిడ్-19ను మాత్రమే కాకుండా.. సార్స్ కొవీ-2కు చెందిన అన్నిరకాల కరోనా వైరస్ లను ఒకే మెడిసిన్ తో నిరోధించొచ్చు అని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి వారు చేసిన అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
అమెరికన్ శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్ లో ఓ సరికొత్త యాంటీబాడీని కనుగొన్నారు. ఇది.. కొవిడ్ జాతికి చెందిన అన్ని రకాల వైరస్ లను ఎదుర్కోగలదని చెబుతున్నారు. దీని పేరు ఎస్2హెచ్ 97. మొత్తం 12 యాంటీ బాడీల మీద అధ్యయనం చేసి దీన్ని కొనుగొన్నారట. ఇది.. అన్ని రకాల కరోనా వైరస్ ప్రొటీన్లకు అంటుకుపోయి.. కణాల్లోకి విస్తరించకుండా చేస్తుందట. అంటే.. కరోనా వైరస్ ఉన్న చోటు నుంచి ఇతర కణాలకు సోకదన్నమాట. ఆ విధంగా.. వైరస్ ను నిరోధించొచ్చని భావిస్తున్నారు.
అందుకే.. దీన్ని సూపర్ యాంటీ బాడీ అని పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సార్స్-కొవీ2 వైరస్ లు యాంటీ బాడీలను తప్పించుకొని తిరుగుతున్నాయి. వీటికి కూడా సూపర్ యాంటీ బాడీ చెక్ పెడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రకాల వేరియంట్లు విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఈ కొత్త యాంటీ బాడీ గొప్ప ఉపశమనంగా చెబుతున్నారు. దీని ద్వారా అన్ని రకాల కరోనా వైరస్ లకు ఒకే టీకా రూపొందించడానికి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.