రచ్చ రచ్చ, రసాభాసగా మారిన అమెరికా అధ్యక్ష డిబేట్

అమెరికా అధ్యక్ష డిబేట్ల పై ప్రజలకు చాలా నమ్మకముండేది. దేశ భవిష్యత్తుకి సంబంధించి ఏమి చేయబోతున్నారో ప్రజలకు వివరించటానికి మంచి అవకాశం ఈ డిబేట్ ద్వారా వస్తుందని అధ్యక్ష స్థానానికి పోటీ చేసే అభ్యర్ధులు భావించేవారు. అందుకే అమెరికా ఓటర్లు డిబేట్ ని ఆసక్తిగా చూడటంతో పాటు ఆ తరవాత ఎవరికి ఓటేయ్యాలో కూడా (అందరూ కాకపోయినా) నిర్ణయించు కొనేవాళ్ళు. అంతటి ప్రాముఖ్యతగల ఈ డిబేట్ చివరకి జనం కొద్దిసేపుచూసి ఛీ ఛీ ఇందుకోసమా మేము ఇన్నిరోజులు […]

Written By: Ram, Updated On : October 1, 2020 8:31 am
Follow us on

అమెరికా అధ్యక్ష డిబేట్ల పై ప్రజలకు చాలా నమ్మకముండేది. దేశ భవిష్యత్తుకి సంబంధించి ఏమి చేయబోతున్నారో ప్రజలకు వివరించటానికి మంచి అవకాశం ఈ డిబేట్ ద్వారా వస్తుందని అధ్యక్ష స్థానానికి పోటీ చేసే అభ్యర్ధులు భావించేవారు. అందుకే అమెరికా ఓటర్లు డిబేట్ ని ఆసక్తిగా చూడటంతో పాటు ఆ తరవాత ఎవరికి ఓటేయ్యాలో కూడా (అందరూ కాకపోయినా) నిర్ణయించు కొనేవాళ్ళు. అంతటి ప్రాముఖ్యతగల ఈ డిబేట్ చివరకి జనం కొద్దిసేపుచూసి ఛీ ఛీ ఇందుకోసమా మేము ఇన్నిరోజులు ఎదురుచూసింది, అని మధ్యలోనే టీవీని ఆపేసే స్థాయికి దిగజార్చారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష స్థానంలో వున్న ట్రంప్. జో బైడెన్ కూడా నేనేమీ తక్కువతిన్నానా అని ట్రంప్ మాట్లాడేటప్పుడు తనూ అదే స్థాయిలో మాట్లాడటం జరిగింది. వెరసి ఇద్దరూ కలిసి అధ్యక్ష డిబేట్ ని రసాభాస గా మార్చారు. ఇదీ నిన్నటి అమెరికా అధ్యక్ష డిబేట్ సారాంశం. అదేమిటో ఇంకొంచెం వివరంగా చూద్దాం.

రచ్చ రచ్చ, రసాభాసగా మారిన డిబేట్ 

ఈ డిబేట్ నిన్న ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్ ల్యాండ్ నగరంలో జరిగింది. ఫాక్స్ న్యూస్ ఆదివారం యాంకర్ క్రిస్ వాలెస్ ఈ డిబేట్ కి మోడరేటర్ గా వ్యవహరించారు. ముందుగానే ఇరువురి అనుమతితో ఆరు అంశాలు ఒక్కొక్కటి 15 నిముషాల చొప్పున ఆరు కలిపి 90 నిముషాలలో ముగించేటట్లు నిర్ణయించారు. ప్రతి అంశంపై ముందుగా 2 నిముషాలు ఒక్కొక్కరూ మాట్లాడేటట్లు, ఆ తర్వాత దానిపై ఒకరికొకరు వాద  ప్రతివాదాలు చేసుకునేటట్లు అనుకున్నారు. ముందు రెండు నిముషాలు ఒకరు మాట్లాడేటప్పుడు రెండోవారు జోక్యం చేసుకోకూడదని కూడా అనుకున్నారు. కానీ చర్చ అందుకు భిన్నంగా జరిగింది. ముందుగా దాన్ని పాటించకుండా జో బైడెన్ మాట్లాడేటప్పుడు ట్రంప్ జోక్యం చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ మాట్లాడేటప్పుడు బైడెన్ కూడా చెణుకులు, నవ్వులు విసరటం జరిగింది. మోడరేటర్ మధ్యలో ట్రంప్ ని వారించటం కూడా జరిగింది. చివరకు పరుషపదజాలం తో తిట్టుకోవటం కూడా జరిగింది. అబద్దలకోరువి, జోకర్ వి , చరిత్రలోనే అధమ అధ్యక్షుడివి, నోరు మూసుకో లాంటి అనేకపదాలు బైడెన్ వాడటం జరిగింది. అలాగే ట్రంప్ మాట్లాడేటప్పుడు బైడెన్ అవహేలనగా నవ్వటం చాలాసార్లు జరిగింది. ట్రంప్ ప్రధానంగా క్రమశిక్షణ పాటించలేదు కానీ ఈ తిట్ల దండకం చేయలేదు. అసలు కనీస పద్దతులు పాటించకుండా ఇలా ఒకరికొకరు తిట్టుకోవటం, శాపనార్ధాలు పెట్టుకోవటం సభ్య ప్రపంచానికే సిగ్గుచేటు. దిగజారుతున్న నైతిక విలువలకి ఇది సూచన. నిజం చెప్పాలంటే ట్రంప్ 2016 ఎన్నికల్లోనే ఈ దిగజారుడు డిబేట్ కి అంకురార్పణ చేసాడు. కాకపోతే అప్పటికి అధికారంలోకి రాలేదని కొంత సర్దుకుపోయారు. మరి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అధికారం వెలగ పెట్టినతర్వాత కూడా అదే జుగుప్స కలిగించేవిధంగా మాట్లాడటం కుక్క తోక వంకర సామెత గుర్తుకొస్తుంది.

కాకపోతే జో బైడెన్ స్మార్ట్ గా ప్రవర్తించ గలిగాడు. నేరుగా పోడియం నుంచి అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. ట్రంప్ వైపు తిరిగి మాట్లాడకుండా , చాలా సందర్భాల్లో ట్రంప్ జోక్యాన్ని విస్మరించి తను చెప్పదలుచుకుంది సూటిగా ప్రజల దగ్గరకి చేరవేయగలిగాడు. డిబేట్ చూసిన వారికి బైడెన్ మెరుగ్గా , సూటిగా, స్పష్టంగా చెప్పగలిగాడని భావించారు. దానితోపాటు ట్రంప్ 750 డాలర్ల పన్ను చెల్లింపు ని ప్రజలముందు వుంచి చట్టాల్ని ట్రంప్ ఎలా వాడుకున్నాడో చెప్పగలిగాడు. కాకపోతే ఇద్దరూ వాడిన పదజాలం జనం చరిత్రలో మరిచిపోకుండా చేసింది. మొదటి డిబేటే ఇలావుంటే మిగతా రెండూ ఇంకెలా వుంటాయోనని జనం విస్తుపోతున్నారు. ఇందుకోసం మిగతా రెండు డిబేట్లు అసలు చూడాలా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు.సరే ఈ పోకడను కొంచెం పక్కనపెట్టి అసలు ఇద్దరూ ఈ డిబేట్లో ఏంమాట్లాడుకున్నారో స్థూలంగా చూద్దాం.

ఏయే అంశాలు చర్చకు వచ్చాయి?

ముందుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకం పై ఇరువురూ తమ వాదనలు వినిపించారు. జో బైడెన్ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది కాబట్టి కొత్తగా ఎన్నికయిన వాళ్ళే ఈ ప్రక్రియ చేపట్టాలని చెబితే రాజ్యాంగం ప్రకారం మాకు అధికారం వుంది కాబట్టి మేము చేస్తామని ట్రంప్ వాదించాడు. జో బైడెన్ ఇదే జరిగితే ఒబామా తీసుకొచ్చిన ఒబామా కేర్ ఆరోగ్య పధకం మూసివేస్తారని, ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పాడు. అలాగే ట్రంప్ మొదట్నుంచీ ఈ ఆరోగ్య పధకాన్ని తీసేస్తానని చెబుతున్నాడని దాని స్థానంలో ప్రత్యామ్నాయం ఏమిటో ఇంతవరకు బయట పెట్టలేదని నిలదీశాడు. ట్రంప్ నా హయాం లో మందుల ధరలని నియంత్రించానని, ఇప్పుడున్న పద్దతుల్లో కనుక ఈ పధకం అమలుజరిగితే అది ఆర్ధికంగా కుప్పకూలుతుందని వాదించాడు. అక్కడనుంచి ఒకరికొకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. 750 డాలర్లు పన్ను చెల్లించటం ఏమిటని ప్రశ్నిస్తే కాదు మిలియన్లు డాలర్లు చెల్లించానని ట్రంప్ జవాబిచ్చాడు. బైడెన్ తను 3 లక్షల డాలర్లు చెల్లించానని అదే నీవు మిలియన్ల డాలర్లు చెల్లించి వుంటే వెల్లడించమని సవాలు విసిరాడు. దానికి ప్రతిగా ట్రంప్ బైడెన్ కుమారుడు రష్యా దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆరోపించాడు. దానిపై వాదోపవాదాలు జరిగాయి.

కరోనా మహమ్మారి పై జరిగిన చర్చలో బైడెన్ ట్రంప్ అసమర్ధ పాలన వలన 2 లక్షలమంది చనిపోయారని అసలు తనకి పాలన చేయటం రాదని ఆరోపించాడు. నావలనే ఇంకా ఎక్కువమంది చనిపోకుండా ఆపగాలిగానని ట్రంప్ చెప్పాడు. అసలు మాస్క్ ఎందుకు ధరించవని ట్రంప్ ని ప్రశ్నిస్తే కోటులో నుంచి మాస్క్ తీసి చూపించాడు. ట్రంప్ ఎన్నికల ప్రచారం పేరుతో అంతమందిని గుంపుగా చేర్చటం, అందులో ఎక్కువమంది మాస్కులు ధరించకుండా పాల్గొనటం ఏమిటని మోడరేటర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సరయిన సమాధానం ఇవ్వలేకపోయాడు. ఇక ఆర్ధిక పరిస్థితి , ఉద్యోగాల కల్పన పై ఇరువురూ వాదోపవాదాలు చేసుకున్నారు. నీ 47 ఏళ్ల నిర్వాకం కన్నా నా 47 నెలల పరిపాలనే మెరుగని ట్రంప్ ఎద్దేవా చేసాడు. సమాజంలోని జాతులమధ్య చిచ్చు, సామరస్యం పై మోడరేటర్ ఇద్దర్ని పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. బైడెన్ ని ఇన్ని రోజులనుంచి జరుగుతున్న పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్ ఘటనలపై మీ పార్టీ కే చెందిన మేయర్, గవర్నర్ లతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించాడు. అలాగే ట్రంప్ ని నువ్వు వామపక్ష వాదుల నిరసనల పై మాట్లాడుతున్నావు గాని శ్వేత జాతి దురహంకార వాదుల పై ఒకమాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించాడు. ఇరువురూ సమాధానాలు దాటవేశారు. ‘వామపక్ష తీవ్రవాదం’ యజెండా గా బైడెన్ ముందుకోస్తున్నాడని ట్రంప్ ఆరోపిస్తే కాదు బైడెన్ ప్రణాళికనే అమలుచేస్తున్నానని బైడెన్ జవాబిచ్చాడు.

ట్రంప్ తను ఏమి చెప్పదలుచుకున్నాడో 2 నిముషాల్లో చెప్పమంటే ఆ అవకాశాన్ని కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. చివరిగా ఎన్నికల ఫలితాన్ని ఆమోదిస్తారా అని అడిగితే ట్రంప్ అంతా సవ్యంగా వుంటే ఆమోదిస్తానని , మిలియన్ల బ్యాలట్లు అక్రమాలు జరిగితే ఆమోదించనని జవాబిచ్చాడు. అదే బైడెన్ తనకి ఈ ఎన్నికల విధానం పై నమ్మకముందని ప్రకటించాడు. ఏ విధంగా చూసినా ఈ డిబేట్ లో జో బైడెన్ గెలిచాడు. అయితే దీని ప్రభావం ఎన్నికలపై ఎంతమేరకు పోటీ వున్న రాష్ట్రాల్లో ఉంటుందనే దానిపై ఫలితం ఆధార పడి వుంటుంది. ఈ డిబేట్ల తో పాటు మిగతా అంశాలు ఎలా ప్రభావితం చేయబోతున్నయనే దానిపై ఫలితం ఆధారపడి వుంటుంది. మొత్తం మీద ఈ అధ్యక్ష డిబేట్ రసాభాసగా, రచ్చరచ్చగా మారిందని చెప్పటానికి విచారిస్తున్నాము.