US Exit From Afghanistan: అఫ్గానిస్తాన్ లో పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే దేశం మొత్తం తాలిబన్ల వశం కావడంతో దానికి తోడు అమెరికా దళాలు సైతం అక్కడి నుంచి వైదొలిగాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆగస్టు 31 గడువులోగా అఫ్గాన్ నుంచి అమెరికా రక్షణ దళాలు దేశం విడిచి వెళ్లిపోయాయి. ప్రస్తుతం అఫ్గాన్ తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లింది. అఫ్గాన్ నుంచి చివరి విమానం సోమవారం అర్థరాత్రి బయలుదేరి వెళ్లింది. దీంతో అఫ్గాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాలిబన్లను నిలువరించగల వారెవరు లేకపోవడంతో వారి ఆగడాలు పెరిగిపోతున్నాయి.
ప్రస్తుతం అఫ్గాన్ మొత్తం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. ఇక అక్కడ ఏ దేశం కూడా అడుగుపెట్టేందుకు సాహసం చేయదు. దీంతో హమీద్ కర్జాయ్ విమానాశ్రయం తాలిబన్ల గుప్పిట్లోనే ఉండిపోయింది. శరణార్థులుగా ఉన్న వారు ఇతర దేశాలకు వెళ్లాలన్నా వారి అనుమతి పొందాల్సిందే. అమెరికా సేనల ఉపసంహరణపై అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. అఫ్గాన్ లో గత 20 ఏళ్లుగా మా సేవలు అందించాం. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశ ప్రయోజనాల కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని గుర్తు చేశారు.
అమెరికా సైనికులు 1.20 లక్షల మందిని తరలించి తామేమిటో నిరూపించుకున్నామని బైడెన్ చెప్పారు. అఫ్గాన్ పరిణామాల నేపథ్యంలో ఆయన తన మనసులోని మాటలు వెల్లడించారు. దేశంలో ఎక్కువ మంది ప్రజలు తన నిర్ణయాన్ని ఆమోదించారని పేర్కొన్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా సేనల తరలింపు పూర్తి కావడంతో వారిలో ఆనందానికి అవధులు లేవు. గాల్లో తుపాకులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా సైనికుల తరలింపుతో ఒక శకం ముగిసిందని తాలిబన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అఫ్గనిస్తాన్ నుంచి 20 దేశాలు తమ ప్రజలను తరలించాయి. కానీ అక్కడ సుమారు రెండు వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో అఫ్గాన్ లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అఫ్గాన్ వీడి పోవాలని చూస్తున్న అక్కడి పౌరులకు సరైన ధ్రువపత్రాలు ఉన్నా వారిని తీసుకెళ్లేందుకు అనుమతులు రావడం లేదు. దీంతో వారు తమ దేశంలోనే ఉండిపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కాబుల్ ను వీడాలని భావిస్తున్నా కుదరడం లేదని అక్కడి వారు భయాందోళన చెందుతున్నారు.
అమెరికా అఫ్గన్ నుంచి వైదొలిగిన క్రమంలో ఉగ్రవాదం పెట్రేగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉగ్రవాద సంస్థలైన అల్ ఖైదా, ఐసిస్ లాంటి సంస్థలు తమ ఉనికి కోసం ఉగ్ర దాడులకు తెగబడే సూచనలు కనిపిస్తున్నాయి. అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించడంతో తమ పని అయిపోయిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. లాడెన్ ను మట్టుబెట్టడంతో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిపోయాయని చెప్పారు.
అఫ్గనిస్తాన్ లో తిరుగుబాటును అణచివేయాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లు అఫ్గాన్ లో ఉన్నామని తెలిపారు. యుద్ధం చేసి అమెరికా సైనికులను నష్టపోలేదలుచుకోలేదని చెబుతున్నారు. అఫ్గనిస్తాన్ కోసం ఇప్పటి వరకు చాలా ఖర్చు చేశాం. అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేశామని పేర్కొన్నారు. దీంతో అఫ్గన్ పరిస్థితిపై బైడెన్ తనదైన శైలిలో తన మనసులోని మాటలను వెల్లడించారు.