Ruia Hospital: ఆపద సమయాల్లో అంబులెన్స్ ల సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చనిపోతాడనుకున్న వ్యక్తిని కూడా బతికించే అంబులెన్స్ ల సేవలు అందరికి అభిమానమే. రోడ్డుపై అంబులెన్స్ వెళ్తుందంటే ప్రతి ఒక్కరు దారిస్తారు. ఎందుకంటే ఆపదలో ఉన్నారని గ్రహించి. కానీ అలాంటి అంబులెన్స్ డ్రైవర్లే కర్కశంగా మారితే ఇక అంతే సంగతి. తాము చెప్పినంత ఇవ్వనిదే బండి కదలదని హుకుం జారీ చేసి మరీ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిందే.
మానవత్వం ఉందా నశించిందా అనే కోణంలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్య చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఓ తండ్రి కూతురు శవాన్ని దాదాపు పదికిలోమీటర్ల దూరం భుజంపై వేసుకుని నడుచుకుంటూ వెళ్లిన సంఘటన మరవకముందే తిరుపతిలోని రుయా ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ల ఘాతుకానికి ఓ తండ్రి తన కొడుకు శవాన్ని ద్విచక్ర వాహనంపై 75 కిలోమీటర్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: Mahesh Babu In Dubai: దుబాయి కి మహేష్ బాబు తో వెళ్లిన రాజమౌళి.. అభిమానులకు పూనకాలు రప్పించే వార్త
అన్నమయ్య జిల్లా గూడూరు నియోజకవర్గానికి చెందిన నర్సింహులు పొలాల దగ్గర కాపలా కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి ఓ కొడుకు ఉన్నాడు. కానీ అతడి ఆరోగ్యం బాగాలేకపోవడంతో రుయా ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. కొడుకు కన్నుమూశాడు. దీంతో పుట్టెడు దుఖంలో తండ్రి అంబులెన్స్ లో కొడుకు శవాన్ని సొంతూరు తీసుకెళ్లాలని అడిగాడు. దానికి వారు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని పేదవాడినని కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. రూ. 20 వేలకు పైసా తగ్గ్గినా తీసుకెళ్లేది లేదని తెగేసి చెప్పారు.
దీంతో బాధితుడు బయట ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ ను బతిమాలితే అతడు రూ. 8 వేలకు తీసుకెళ్తానని చెప్పాడు. కానీ ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్లు అతడిని రానీయలేదు. లోపలికి వస్తే ఊరుకునేది లేదని బెదిరించడంతో అతడు నిరాకరించాడు. ఇక చేసేది లేక తండ్రి తన కొడుకు శవాన్ని బైక్ పై వేసుకుని తీసుకెళ్లాడు. ఇంతటి దారుణమైన ఘటనను చూసి అందరు చలించారు. కానీ అంబులెన్స్ డ్రైవర్లు మాత్రం యమదూతల్లా అడ్డుకున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అని అందరు ఎదురు చూస్తున్నారు. ఇంతటి అమానవవీయ ఘటనకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బెస్ట్ డైలాగ్స్ ఇవే !