Tirupati sabha : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలంటూ.. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు అక్కడి రైతులు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అంటూ 45 రోజులపాటు అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. ఇవాళ ముగింపు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు అధికార పార్టీ మినహా.. మిగిలిన ప్రధాన పార్టీలన్నీ మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? విపక్షాలన్నీ ఒకే వేదిక మీదకు రాబోతుండడంతో.. అమరావతి ఉద్యమం ఏ మలుపు తీసుకోనుంది? అనే అసక్తి మొదలైంది.
ఆరు నూరైనా ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు నిర్మించి తీరుతామని అధికార వైసీపీ స్పష్టం చేస్తోంది. ఇందుకోసం కొత్త బిల్లును సైతం తీసుకొస్తామని ప్రకటించింది. ఇటు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రెండేళ్లుగా రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇదంతా రొటీన్ వ్యవహారంగా మారిపోయిన వేళ.. హైకోర్టులో రాజధాని కేసు చర్చకు రావడం.. రైతులు పాదయాత్ర చేపట్టడం.. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకోవడం.. మళ్లీ కొత్త బిల్లు తెస్తామని ప్రకటించడం.. వంటి పరిణామాలు వెంట వెంటనే జరిగిపోవడంతో.. ఒక్కసారిగా కాకరేగింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతు సభకు విపక్షాలన్నీ ఒకే నినాదంతో హాజరవుతున్నాయి.
ఈ సభలో.. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్నారు. అటు సీపీఐ నుంచి నారాయణ, జాతీయ నాయకుడు అతుల్ కుమార్ అంజన్ హాజరవుతున్నారు. బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు, సీ.ఎం. రమేష్ తదితరులు పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కూడా సభకు వస్తానని చెప్పారని అమరావతి రైతులు చెప్పారు. ఈ విధంగా ప్రధాన పార్టీల నుంచి నేతలు ఈ సభకు హాజరవుతున్నారు. తిరపతి సభ నుంచి ప్రభుత్వానికి వీరంతా అల్టిమేటం జారీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు వైసీపీ మాత్రం.. ఇది టీడీపీ రాజకీయ సభగా కొట్టి పారేస్తోంది.
మొత్తంగా.. అధికార, విపక్షాలు మరోసారి రాజధాని అంశం కేంద్రంగా మాటల యుద్ధానికి సిద్ధమయ్యాయి. మరి, ఈ సభ ఎలాంటి సమీకరణాలకు కేంద్ర బిందువు అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజధానిపై వెనక్కు తగ్గేదేలే అంటూ.. ప్రభుత్వం ప్రకటించేసింది. విపక్షాలు తాము సైతం అంటున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ ఏకపక్షంగా విజయాలు సాధిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో.. తిరుపతిలో నిర్వహించే అమరావతి సభ, కొత్త పొత్తులకు వేదిక అవుతుందా? అనే చర్చకూడా సాగుతోంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.