Amaravati Farmers- AP Police: అమరావతి రైతులు, ప్రజాసంఘాలు, విపక్ష నాయకులు…ఇప్పుడు వీరే పోలీసుల టార్గెట్. శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే చాన్స్ లేదు. ప్రభుత్వంపై చిన్నపాటి విమర్శ చేసినా ఒప్పుకోవడం లేదు. చివరకు సోషల్ మీడియాలో పోస్టింగ్ వచ్చినా సరే వదలడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ డోస్ పెంచుతున్నాయి. అయితే ఇవేవీ ప్రజల రక్షణకు కాదు. వారిపై కర్కశానికి, అధికార పార్టీకి కొమ్ముకాయడానికి వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. శాంతిభద్రతలను పక్కనపడేసి అధికార పార్టీ సేవే తమకు ప్రధానమన్న రేంజ్ లో పోలీసులు వ్యవహరిస్తుండడంపై జనం సైతం అసహ్యించుకుంటున్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై పోలీసులే స్వయంగా దాడులు చేస్తున్నారు. దారి పొడవునా వైసీపీ నిరసనలు చేసుకోవచ్చని అనుమతులిస్తున్నారు. వారు దాడిచేస్తున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చివరకు పాదయాత్ర వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నాయని కోర్టును ఆశ్రయిస్తున్నారు.

అటు తెలుగుదేశం పార్టీ నాయకులను ఇళ్లను దాటనీయ్యడం లేదు. విశాఖలో వైసీపీ భూ కుంభకోణాలపై టీడీపీ అధిష్టానం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అయితే టీడీపీలో ఒక మోస్తరు నుంచి చిన్నపాటి నాయకుడు వరకూ ముందస్తు అరెస్ట్ లు చేశారు. రెండు రోజులు ముందుగానే తమ కస్టడీలోకి తీసుకొని గృహనిర్బంధం చేశారు. అదే టీడీపీ నేతల కామెంట్స్ పై నిరసనకు దిగుతున్న వైసీపీ నేతలకు ఇట్టే అనుమతులిస్తున్నారు. అసలు వారు ధ్రువపత్రాలు సమర్పిస్తున్నారో లేదో తెలియదు. దగ్గరుండి అన్నీ అరెంజ్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ప్రతిపక్షాల విధి. దానిని హౌస్ అరెస్ట్ లు, కేసుల నమోదుతో అణచివేయాలని చూడడంపై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అటు ఏపీ సీఐడీ పోలీసుల తీరు అలానే ఉంది. సోషల్ మీడియాలో చిన్నపాటి కామెంట్స్ చేసినా నోటీసులిస్తున్నారు. ఒక్క రోజులోనే మంగళగిరిలోని సీఐడీ కేంద్ర కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశిస్తున్నారు. విచారణ పేరిట రోజంతా హడావుడి చేస్తున్నారు. చివరకు రాంగ్ ట్రీట్ మెంట్ సైతం ఇస్తున్నారు. మొన్నటి రఘురామకృష్ణంరాజు నుంచి టీడీపీ మీడియా కోఆర్డినేటర్ వరకూ సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. అయితే గతంలో రాష్ట్ర స్థాయిలో సీఐడీ అత్యున్నత దర్యాప్తు సంస్థ. కానీ ఇప్పుడు వైసీపీ సర్కారు జేబు సంస్థగా మారిపోయింది.

అయితే కొందరు సెలెక్టివ్ పోలీసు అధికారుల వ్యవహార శైలి మరింత జుగుప్సాకరంగా ఉంటోంది. వైసీపీ కండువా వేసుకోకపోవడం ఒక్కటే మిగిలింది.. మిగతాది అసలు సిసలు కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. వారి అతియే పోలీస్ శాఖకు మాయని మచ్చగా మారుతోంది. ప్రస్తుతానికి వైసీపీ, తరువాత వచ్చే ప్రభుత్వాలకు సైతం పోలీసు బాస్ లు గులాం చెప్పే సంస్కృతి కొనసాగుతుంది. ఈ రోజులు బాధితులుగా ఉన్నవారు పాలకులుగా మారితే.. నేడు అనుభవించిన కష్టాలను.. ఎదుటివారికి కూడా పెట్టకుండా ఉంటే సమాజంలో చేతకానివారవుతారు. అందుకే రివేంజ్ కే మొగ్గుచూపుతారు. అప్పుడు ఈ దురాగతాలు మరింత పెరిగిపోతాయి. దీనిని ప్రాథమిక స్థాయిలో అడ్డుకట్ట పడాల్సి ఉన్నా..అభ్యంతరం వ్యక్తం చేసే పోలీసులు, అధికారులు బాధితులుగా మిగులుతుండడంతో ముందుకొచ్చే సాహసం ఎవరూ చేయడం లేదు.