Alpine Quest App : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 26 మంది అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్న ఈ మారణహోమానికి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉగ్రవాదులు గూగుల్ మ్యాప్‌ను కాకుండా, మారుమూల ప్రాంతాల్లో కూడా పనిచేసే ఒక ప్రత్యేకమైన యాప్‌ను లొకేషన్ల కోసం ఉపయోగించారని తెలుస్తోంది. ఇంతకీ ఆ యాప్ ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం!
పహల్గామ్‌లో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు అక్కడికి చేరుకోవడానికి ‘ఆల్పైన్ క్వెస్ట్’ (Alpine Quest) అనే అప్లికేషన్‌ను ఉపయోగించారు. గూగుల్ మ్యాప్స్ కాకుండా ఈ యాప్‌ను ఎందుకు ఎంచుకున్నారో తెలుసా.. ఈ మొబైల్ యాప్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులకు సహాయపడుతుంది. ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ సమాచారాన్ని లీక్ చేసే అవకాశం ఉందని ఉగ్రవాదులు భయపడుతున్నారు. అందుకే వారు ఇప్పుడు వారి సహాయం లేకుండానే నావిగేషన్ కోసం ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. గతంలో జరిగిన కతువా ఉగ్రదాడితో సహా అనేక ఇతర దాడుల్లో కూడా ఉగ్రవాదులు లొకేషన్ల కోసం ఇదే యాప్‌ను ఉపయోగించారు.
Also Read : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు.. పర్యాటక స్వర్గంపై నీడలు
పాకిస్తాన్‌లో ISI ఆధ్వర్యంలో ఉగ్రవాదులకు ఈ యాప్‌పై స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ యాప్ ద్వారానే అడవుల్లో ఉన్న ఉగ్రవాద గ్రూపులు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుతుంటాయి. జమ్మూలో గత కొన్నేళ్లుగా జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఇదే యాప్ ఉపయోగించబడిందని 2024లో దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ యాప్ ఉగ్రవాదులకు దట్టమైన అడవుల్లోని నదులు, కాలువలు, కొండ గుహల క్లియర్ లొకేషన్‌ను అందిస్తుంది.
ఆల్పైన్ క్వెస్ట్ అనేది ఆస్ట్రేలియన్ యాప్, దీనిని ట్రెక్కర్‌లు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఉపయోగిస్తారు. అయితే, ఉగ్రవాదులకు ఈ యాప్ ఆఫ్లైన్ వెర్షన్‌ను అందిస్తారు. అందులో CRPF క్యాంపులు, బారికేడ్ల వంటి స్థానాలు ముందుగానే యాడ్ చేసి ఉంటాయి. ఈ యాప్‌ను రెండు విధాలుగా ఉపయోగిస్తారు. మొదటిది యాప్‌లో ఫీడ్ చేసిన డేటా ద్వారా లొకేషన్‌ను కనుగొనడం, రెండవది ఉగ్రవాదులు స్వయంగా లొకేషన్, డేటాను ఫీడ్ చేయడం ద్వారా ఇతర ఉగ్రవాదులకు నావిగేషన్‌ను అందించడం.
Also Read : కాశ్మీర్ లో రిజర్వేషన్లను మార్చాలని పెద్ద ఎత్తున ప్రచారం