JanaSena: జనసేన స్థానాలు ఫిక్స్.. బిజెపి వస్తే మారనున్న లెక్క

డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అక్కడి ఫలితాలు ఏపీపై తప్పకుండా ప్రభావం చూపుతాయని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై బిజెపికి ఒక క్లారిటీ రానుంది.

Written By: Dharma, Updated On : November 30, 2023 10:28 am

JanaSena

Follow us on

JanaSena: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలను ప్రారంభించాయి. అధికార వైసీపీ దూకుడు మీద ఉండగా.. టిడిపి, జనసేన సైతం స్పీడ్ పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 1న జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అక్కడకు ఒకటి, రెండు రోజుల్లో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలపై స్పష్టత రానుంది. ఇప్పటికే టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరిగిందని.. కానీ బిజెపి విషయంలో ఓ స్పష్టత వచ్చాకే బయటకు వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది. జనసేన విస్తృత స్థాయి సమావేశం, చంద్రబాబుతో పవన్ భేటీ తర్వాత ఫుల్ క్లారిటీ రానుందని సమాచారం.

డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అక్కడి ఫలితాలు ఏపీపై తప్పకుండా ప్రభావం చూపుతాయని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై బిజెపికి ఒక క్లారిటీ రానుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే మాత్రం బిజెపి టిడిపి, జనసేన కూటమిలోకి తప్పకుండా రావాలి. సీట్ల సర్దుబాటు విషయంలో అణిగిమణిగి ఉండాలి. కాంగ్రెస్ ఓడిపోయి.. బిజెపికి గౌరవప్రదమైన స్థానాలు లభిస్తే మాత్రం ఏపీలో ఆ పార్టీ పట్టు బిగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే తప్పకుండా ఆ రెండు పార్టీలకు బిజెపి కలిసి వెళ్లక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ప్రాథమికంగా టిడిపి,జనసేన సీట్ల విషయంలో ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. తొలుత జనసేన 50 వరకు అసెంబ్లీ స్థానాలు, 7 వరకు లోక్సభ స్థానాలు కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని.. కేవలం 20 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలు ఇచ్చేందుకు టిడిపి సుముఖంగా ఉందని మరో ప్రచారం జరిగింది. అయితే గత రెండు నెలలుగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సరికొత్త లెక్కలు తెరపైకి వచ్చినట్లు సమాచారం. టిడిపి కష్టకాలంలో ఉండగా స్నేహ హస్తం అందించిన జనసేనకు 30 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు టిడిపి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.

లోక్ సభ స్థానాలకు సంబంధించి కాకినాడ ఎంపీ సీటు, కర్నూలు, నెల్లూరు నుంచి మరో సీటు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కాకినాడ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని నాగబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి సీటు కీలకంగా భావిస్తున్న తరుణంలో నాగబాబు బలమైన అభ్యర్థిగా ఉంటారని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన ఒప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని.. మరో స్థానం విషయంలో స్పష్టత రావాల్సి ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే పొత్తులో ఉండడంతో ఈసారి ఒక స్థానానికి మాత్రమే పరిమితం అవుతారని టాక్ నడుస్తోంది. రేపు జనసేన విస్తృత స్థాయి సమావేశం తర్వాత చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి తేనున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.