
Pawan Kalyan- Chandrababu: తెలుగుదేశం పార్టీకి మంచి చేస్తున్నారో ..చెడు చేస్తున్నారో తెలియదు కానీ..ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాత్రం ఏరికోరి కష్టాలు తెచ్చిపెడుతున్నారు, టీడీపీ పార్టీ పత్రిక అన్న మాటే కానీ.. జిల్లాల్లో యాడ్లు, ఇతరత్రా విషయాల్లో తమను పీక్కుతింటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాధాక్రిష్ణతో మేలు కంటే కీడే అధికమని నమ్మే నాయకులు టీడీపీలో కొదువ లేదు. పార్టీ గెలిస్తే తన ప్రభావమేనంటూ చెప్పుకురావడం.. ఓటమి చవిచూస్తే మాత్రం తన సలహాలు, సూచనలు చంద్రబాబు పాటించడం లేదని చెప్పడం రాధాక్రిష్ణకు అలవాటైపోయింది. పేరుకే పార్టీ ముసుగు కానీ..ఈ 20 సంవత్సరాల కాలంలో పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ బాగానే వర్కువుట్ చేసుకున్న టాక్ టీడీపీలో వినిపిస్తుంటుంది.
వచ్చే ఎన్నికల్లో పొత్తు దిశగా టీడీపీ, జనసేన మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతిలో రాధాక్రిష్ణ రాసిన కథనంతో పవన్ మనస్తాపానికి గురయ్యారు. పవన్ తనతో కలిసి కానీ.. ఒంటరి పోరాటం కానీ చేస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూ.1000 కోట్లు లంచం ఆఫర్ చేశారన్నదే ఈ కథనం సారాంశం. ఏపీలో ఇప్పటికే పవన్ సోదరుడు చిరంజీవి రాజకీయంగా పెయిలయ్యారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు సొంతంగా ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం లేదని కూడా కథనం సూచించింది. అక్కడితో ఆగకుండా వద్దని ఓ కాపు సంఘం నేత వారించిన విషయాన్ని కూడా ఆర్కే ప్రస్తావించారు.
అయితే దీనిపై పవన్ ఇంతవరకూ స్పందించలేదు. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం రియాక్టయ్యారు. ఇటువంటి దిగజారుడు కథనాలతో మీకే నష్టమని చంద్రబాబుకు గట్టి సంకేతాలే పంపారు. అక్కడ నుంచి చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా పవన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇద్దరి నేతల మధ్య మాటలు బంద్ అయినట్టు సమాచారం.రాధాక్రిష్ణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతటి పరిస్థితికైనా దిగజారుతారని అందరికీ తెలిసిందే, అయితే ఈ కథనం వెనుక చంద్రబాబు ఉన్నట్టు జన సైనికులు నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ కు సూచిస్తున్నారు.

అయితే పవన్ కథనం ప్రచురించిన నాటి నుంచి తీవ్ర మనస్తానంతో ఉన్నారు. ఇది తన ప్రతిష్ఠను దిగజార్చిందని భావిస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జన సైనికులు రాధాక్రిష్ణపై మండిపడుతున్నారు. పొలిటికల్ బ్రోకర్ గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు పవన్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన దొరకడం లేదు. దీంతో పొత్తుపై తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఏబీఎన్ ఆర్కే వైఖరిపై మండిపడుతున్నారు. పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ మాత్రం బహిరంగ క్షమాపణల తరువాతే మరో అడుగు ముందుకేయాలని పట్టుదలతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?