
Kanna Lakshminarayana- Janasena: పేరుకు సీనియర్ నేత అయినా, కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఏ మాత్రం ప్రభావితం చేస్తారోనన్న చర్చ మొదలైంది. మొన్నటి వరకు బీజేపీలో ఉన్నా ఏం చేశారయ్యా అంటే ఏమీ లేదు. ఇప్పడు టీడీపీలోకి వచ్చినా, ఉన్నట్టుండి వచ్చి పడేదేమీ లేదు. ఏ మొగుడు దొరక్కపోతే అక్క మొగుడు దిక్కన్నట్టుగా ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ. ఇదీ కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి. ఆయన టీడీపీలోకి వెళ్లినంత మాత్రాన కొత్తగా ఆవిర్భంచి అనతికాలంలోనే జనాదరణకు సొంతం చేసుకుంటున్న జనసేనపై ఆయన ప్రభావం ఏమైనా ఉంటుందా అనే దానిపై స్పెషల్ ఫోకస్.
వచ్చిన అవకాశం చేజార్చుకొని…
కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న సందర్భంలో జనసేన సీనియర్ నేతలు ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఆయన ముందు ఒప్పుకున్నా.. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. పార్టీలో మంచి భవిష్యత్తు దొరికేది. అయితే, ఇప్పుడు టీడీపీలో చేరినా, ఏ మాత్రం ఇమడగలరో ఆయన తేల్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జనసేనను మాత్రం ఆయన పెద్దగా విమర్శించకపోవడం గమనించదగ్గ విషయం. సూటిగా అధికార వైసీపీ వైఫల్యాలపైనే నిన్న ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరినప్పుడు మాట్లాడారు.
జనసేన కాపు పార్టీ కాదు కదా..
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ఒక సామాజిక వర్గానికి చెందినదేమి కాదు. అందులో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఉంది. సరే.. కాపు సామాజిక వర్గం పవన్ కల్యాణ్ వెన్నంటే ఉందని అనుకున్నా, కన్నా ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కాపు వర్గమంతా ఈయన వెన్నంటే ఉన్నారనడం లో సందేహం లేదు. పైగా కన్నా లక్ష్మీనారాయణ కాపులను అంతగా ప్రభావితం చేసే వ్యక్తి కాదు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ కూడా లేదు. ఆయనకు ఉంటే ఒక్క గుంటూరు జిల్లాలోనే ఒకింత పట్టు ఉంది.
గెలుపు నల్లేరు మీద నడకేం కాదు
కన్నా లక్ష్మీనారాయణను ఒక సీనియర్ నేతగా కాకుండా సామాజికవర్గ నేతగానే టీడీపీ చూస్తుంది. అంతేగాక, ఆయన పోటీ చేయదలుచుకున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాపు సామాజిక అంతగా లేదు. పైగా ఇక్కడ జనసేనకు కొద్దోగొప్పొ జవసత్వాలు ఉన్నాయి. రాయపాటి సాంబశివరావు ఆయనను ఓడిస్తానని శపథం చేశారు. తరువాత యూ టర్న్ తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి తులసీ రామచంద్ర ప్రభు వంటి సీనియర్ నేతలు ఉన్నారు.

పొత్తు కోసం ఆరాటానికా?
జనసేనతో టీడీపీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు ఉవ్విళ్లూరుతుంది. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు దీటుగా తయారవుతుంది. జనసేన మిత్ర పక్షం కాకపోతే సాధ్యమయ్యే పరిస్థితులు కనబడటం లేదు. మరోపక్క జనసేన బీజేపీకి దగ్గరగా ఉంది. ఈ క్రమంలో జనసేనను కలుపుకుపోయేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిసతుంది. కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్ నేతలను పావుగా చూపుకొని జనసేనను తనవైపునకు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోందనడంలో సందేహం లేదు.