లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలి: ఆళ్ల నాని

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) స్పష్టం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని, లాక్ డౌన్ అమలు కు ప్రజలు […]

Written By: Neelambaram, Updated On : April 7, 2020 11:07 am
Follow us on


రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) స్పష్టం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని, లాక్ డౌన్ అమలు కు ప్రజలు సహకరించాలని, ఎవరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని, నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలు కోసం వచ్చేవారు దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని, ఎక్కువ మంది ఒకేసారి బయటికి వెళ్లరాదని సూచించారు. ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాత్రికి కోవిడ్ 19 కి సంబంధించి 303 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3241 శాంపిల్స్ ను పరీక్షించగా, 2938 శాంపిల్స్ నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చాయని, ఇప్పటి వరకూ 6 మంది వ్యక్తులు కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల కరోనా వేగంగా వ్యాప్తి చెందకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 860 మంది విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించామని, 95 శాతం మేరకు విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రేస్ అవుట్ చేశామని తెలిపారు. వారందరినీ హోమ్ క్వారం టైన్ లో ఉంచామని, విదేశాల నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి కాంటాక్ట్ లిస్ట్లో మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని, జిల్లాలో మొత్తం ఆరు కేసులు పాజిటివ్ గా నమోదైనట్లు తెలిపారు. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన వారు 54 మంది ఉండగా, వారందరికీ పరీక్షలు నిర్వహించామని, అందరికీ నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. కరోనా వైరస్ నివారణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

అలాగే జిల్లాకు పీ పీఈ లు, ఎన్ 95 మాస్కుల కొరతను నివారించడానికి చర్యలు తీసుకుంటామని, జిల్లాకు 300 నుంచి 400 వరకు పిపి ఈ లు ఇప్పటికే సరఫరా చేశామని తెలిపారు. జిల్లాలో 587 పిపి ఈ లు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో 48 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని, పిపి ఈ లను సమకూర్చుకునేందుకు ఎటువంటి నిధుల కొరత లేదని తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తామన్నారు.