హుజురాబాద్ ఉప ఎన్నికపై అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికపై ప్రత్యేక ఫోకస్ పెట్టి నిధుల వరద పారిస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్ని ప్రభుత్వానికి అనుకూలంగా మారతాయని భావిస్తూ నేతలు ముందుకు వెళుతున్నారు. కానీ కొన్ని వర్గాలు తమ నియోజకవర్గానికి సైతం నిధులు రావాలని కోరుతూ తమ నేతలు రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.
రాష్ర్టంలో సుమారు 800 మంది ఎంపీటీసీలున్నారు. వీరికి అధికారాలు, నిధులు, విధులు ఏమీ లేవు. దీంతో గ్రామాల అభివృద్ధిపై ఎలాంటి ఆశలు లేకుండా పోయాయి. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో కూడా ఎంపీటీసీలకు కనీస మర్యాద దక్కకపోవడంతో వారిలో అసహనం పెరిగిపోతోంది. అలంకారప్రాయంగా మారిన పదవులపై కినుక వహిస్తున్నారు. నిధుల లేమితో ఎంపీటీసీలు తమకు అధికారాలు, విధులు, నిధులు కేటాయించకపోతే హుజురాబాద్ ఎన్నికల బరిలో నిలిచి అధికార పార్టీ అభ్యర్థిని ఓడించి తీరుతామని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.
రాష్ర్టంలో చేనేత కుటుంబాలు సైతం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా సైతం అందడం లేదని పేర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతనందించాలని డిమాండ్ చేస్తున్నారు. నేతకార్మికులు చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరు తప్పదని జాతీయ నేతన్న ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్ తెలిపారు.
నిరుద్యోగులు సైతం ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. హుజురాబాద్ బరిలో నిలిచేందుకు నిరుద్యోగులు కూడా రెడీ అయిపోతున్నారు. గతంలో నిజామాబాద్ ఎన్నికల్లో కూడా కవితను ఓడించేందుకు అక్కడి రైతులు పోటీలో నిలిచారు. హుజురాబాద్ ఉప ఎన్నికను టార్గెట్ చేస్తూ చేనేత కార్మికులు, నిరుద్యోగులు, ఎంపీటీసీలు కూడా సిద్ధంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వాన్ని ఓడించేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.