Ayodhya Ram Mandir : అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు నుంచి గంటలు.. గుజరాత్ నుంచి అగర్‌బత్తి, నేపాల్ నుంచి కానుకలు సీతమ్మవారి ఊరి నుంచి కానుకలు, హైదరాబాద్ నుంచి గుడి తలుపులు, రాములవారి పాదాలు ఇలా ఒక్కో కానుక ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రెండు రోజుల క్రితం 2.5 కిలోల స్వర్ణ విల్లంబును కూడా అందించారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన హరిసన్ లాక్స్ అనే తాళాల వ్యాపారి అయోధ్య రామమందిరం కోసం 50 కిలోల తాళాన్ని సిద్ధం చేశారు. దీనిని పూర్తిగా చేతితో తయారు చేశారు. ఈ తాళంపై జైశ్రీరామ్ అని చెక్కారు.
తాళాలకు ప్రసిద్ధి అలీఘర్..
ఉత‍్తరప్రదేశ్‌లోని అలీఘర్ తాళాల పరిశ్రమకు ప్రసిద్ది. అందుకే తమ నగరం నుంచి అయోధ్య రామమందిరానికి ఏదైనా కానుకగా ఇవ్వాలని భావించారు హారిసన్ లాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమంగ్ మోంగా. ఈమేరకు అందరి భాగస్వామ్యంతో భారీ తీళం తయారు చేయాలని నిర్ణయించారు. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అయోధ్య చరిత్రలో తాము నిలవాలని తాళం తయారు చేసినట్లు తెలిపారు. స్థానిక ఎంపీ సతీష్ గౌతమ్ ద్వారా దీనిని అయోధ్యకు పంపించనున్నారు.
చేతితో తయారీ..
అయోధ్య రామాలయం కోసం ఈ తాళాన్ని పూర్తిగా చేతితో తయారుచేశారు. ఇందుకోసం ఆరుగురిని ప్రత్యేకంగా నియమించారు గత ఆగస్టులో దీని తయారీ ప్రారంభించారు. సుమారు ఆరు నెలలు శ్రమించి 50 కిలోల తాళం తయారు చేశారు. ఇందుకోసం జింక్, స్టీల్ వాడారు. దీనికన్నా ముందే అలీఘర్‌కు చెందిన మరో తాళాల తయారీదారుడు సత్యప్రకాశ్, రుక్మిణీబాయి దంపతులు కూడా భారీ తాళం యారు చేశారు. 400 కిలోల బరువు, 10 ఫీట్ల ఎత్తుతో దీనిని రూపొందించారు. దీని తయారీకి ఏడాది సమయం పట్టింది. 65 మంది వర్కర్లు పనిచేశారు.