Ali- YCP: సినీ నటుడు అలీకి ఎట్టకేలకు ఏపీ మీడియా సలహాదారు పదవి దక్కించుకున్నారు. చాలా రోజుల ఎదురుచూపుల తరువాత జగన్ సర్కారు ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్ల పాటు ఆయన పదవిలో ఉంటారని పేర్కొంది. జీతభత్యాల గురించి మరో ఉత్తర్వు జారీచేయనున్నట్టు ప్రకటించింది. అయితే అలీకి పదవి ఇచ్చి అవమానించినట్టుంది. వాస్తవానికి ప్రస్తుతం ఏపీలో వంద మందికి పైగా సలహాదారులు ఉన్నారు. అందులో అలీ ఒకరు. మీడియా సలహాదారులు ముగ్గురు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు సహకరించిన వారు…వచ్చే ఎన్నికల్లో పనికి వస్తారని భావించిన వారందరికీ జగన్ సర్కారు సలహదారులుగానో.. నామినేటెడ్ పదవుల్లోనూ నియమించింది. లక్షల్లో వేతనాలు అందిస్తోంది. ఈ కోవలోకే అలీని సైతం లెక్కించడం కమిడియన్ కు ఏ మాత్రం మింగుడుపడడం లేదు. ప్రస్తుతం అలీ సినిమారంగంలో మంచి పొజిషన్ లోనే ఉన్నారు. అటు బుల్లితెర పై కూడా మెరుస్తున్నారు. అయితే ఆయన డబ్బులు ఆశించి వైసీపీలో చేరలేదు. ఎమ్మెల్యేగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావించారు. కానీ వైసీపీ బెర్త్ దక్కలేదు. అటు అధికారంలోకి వచ్చిన తరువాత సైతం పెద్ద పెద్ద నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తామని చెబుతూ వచ్చారు. తీరా వందలాది మందిలో ఒకరిగా సలహాదారు పదవి కట్టబెట్టారు.

వాస్తవానికి సినీరంగంలో పవన్ కళ్యాణ్ అలీని ఆప్త మిత్రుడిగా భావిస్తుండేవారు. అటు మిత్రుల సాయంతో టీడీపీ అధినేత చంద్రబాబుతో సైతం అలీకి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ వారిద్దర్నీ కాదని ఆయన జగన్ పంచన చేరారు. గుంటూరు, రాజమండ్రి ..ఏదో చోట నుంచి ఎమ్మెల్యే అయిపోదామని భావించారు. పార్టీలో చేర్చుకున్న తరువాత జగన్ అసలు విషయం చెప్పారు. ఎమ్మెల్యే సీట్లు ఖాళీ లేవని చెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే చూద్దాంలే అని సర్దుబాటు చేశారు. అప్పటికే మిత్రుడు పవన్ కు, ఆది నుంచి ఉంటున్న టీడీపీలోకి తిరిగి వెళ్లలేని పరిస్థితి అలీకి ఎదురైంది. అయితే ఎన్నికల్లో అనూహ్య విజయం తరువాత అలీకి మంచి బెర్త్ ఖాయమని భావించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన ప్రతిసారి అలీ పేరు వినిపించడం.. తరువాత జాబితా నుంచి గల్లంతు కావడం జరిగిపోయేవి. ఓ సారి జగన్ నుంచి పిలుపురావడంతో డిజైనర్ డ్రస్ లో సతీసమేతంగా వెళ్లి కలిశారు. వారం రోజుల్లో గుడ్ న్యూస్ వస్తుందని..సిద్ధంగా ఉండమని సీఎం చెప్పారని మరీ అలీ మీడియాకు లీకులిచ్చారు. అప్పటి వారం ఇప్పటికి వచ్చినట్టుంది. చావు కబురు చల్లగా చెప్పారు. మీడియా సలహాదారు పదవి ఒకటుంది.. సర్దుకోమని చెప్పారు. తాను ఆశించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, చివరకు వక్ఫ్ బోర్డు పదవి లేకపోయేసరికి అలీకి తత్వం బోధపడింది.

అయితే ఇప్పటికే ఇద్దరు మీడియా సలహదారులు ఉన్నారు. అలీ ముచ్చటగా మూడో సలహాదారు. అలీ రెండేళ్లు ఆ పదవిలో ఉంటారని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇంకా వైసీపీ సర్కారుకు ఉన్నది ఏడాదిన్నరే. అది కూడా ఎలక్షన్ ఈయర్. ప్రభుత్వం మారితే సలహాదారులంతా ఇంటికి వెళతారు. జగన్ చర్యలు పుణ్యమా అని తదుపరి ప్రభుత్వం లూప్ హోల్ష్ వెతుకుంది. అప్పుడు సలహాదారుల్లో కూడా కొంతమంది దొరికే చాన్స్ సైతం ఉంది. ఇటువంటి సమయంలో సలహాదారు పదవి తీసుకోవడం శ్రేయస్కరమా అన్న ప్రశ్న అలీ మదిలో మెదులుతోంది. అయితే ఇప్పుడు తిరస్కరిస్తే నవ్వులపాలవుతానని ఆయన వెనక్కి తగ్గుతున్నారు. ఇష్టం లేకపోయినా కొద్దిరోజులు సర్దుకుపోతామన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆప్త మిత్రుడు పవన్ కు కాదని.. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా వైసీపీలోకి రావడం తప్పేనని అలీ సన్నిహితులు వాపోతున్నారు. కనీసం జనసేనలో ఉంటే టాప్ టెన్ జాబితాలో అలీ ఉండేవారని.. మంచి భవిష్యత్ ఉండేదని భావిస్తున్నారుట. మొత్తానికి అలీ తన రాజకీయ జీవితాన్ని చేజేతులా జారవిడుకున్నారున్నమాట.