Akhilesh Yadav: యూపీలో అప్పుడే ఎన్నికల జోరు కనిపిస్తోంది. పొత్తులు, ఎత్తులతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విభేదాలను కూడా పక్కన పెట్టేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇందులో ముందు వరుసలో ఉన్నారు. తన బాబాయ్ శివపాల్ తో ఉన్న విభేదాలను పక్కన పెట్టేసి ఆయనతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఈ మేరకు ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ అధినేత శివపాల్ యాదవ్ ను కలిసి మాట్లాడారు.

రాబోయే ఎన్నికల్లో శివపాల్ పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెల్లే విధానం సమాజ్ వాదీ పార్టీని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఇది తమకు గొప్ప విజయాన్ని అందిస్తుందని తెలుపుతున్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా పొత్తు మీద అధికారికంగా ప్రకటన చేశారు. గతంలో ఎస్పీలోనే ఉన్న శివపాల్ యాదవ్.. అఖిలేష్ తో మనస్పర్థలు రావడంతో ఎస్పీ నుంచి వెళ్లిపోయి పార్టీని పెట్టుకున్నారు.
కాగా నవంబర్ లోనే పొత్తు విషయాన్ని శివపాల్ యాదవ్ కు అఖలేశ్ ప్రతిపాదించగా.. ఇప్పుడు దానిమీద స్పష్టత వచ్చేసింది. వచ్చే సంవత్సరంలో జరుగుతున్న ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడిస్తామని, ఇందుకు తమకు కలిసి వచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామని కూడా అఖిలేశ్ స్పష్టం చేస్తున్నారు. కాగా ఇదివరకే ప్రకాశ్ రాజ్‌భర్ అధినేతగా ఉన్న సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.
Also Read: Marriage Age: కనీస వయసు పెంపుతో లాభమా? నష్టమా? ఏ దేశాల్లో ఎంత ఉంది?
దీంతో పాటు జయంత్ చౌదరి నడిపిస్తున్న ఆర్ఎల్డీతో కూడా పొత్తు ప్రకటన చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం జాతీయ పార్టీలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. ఇక ప్రియాంక గాంధీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తున్న కాంగ్రెస్ ఒంటరిగానే పోరు సాగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ నడుమనే ప్రధాన పోటీ ఉంది.
Also Read: AIG Hospitals up for sale: అమ్మకానికి మరో ప్రముఖ హాస్పిటల్స్ గ్రూప్.. డీల్ విలువ ఎంతంటే?