Maharashtra Politics: రాజకీయం అంటేనే పదవి. ఆ పదవి ఉంటేనే ఏమైనా చేయొచ్చు. దేన్నయినా శాసించొచ్చు. దానికోసం నాయకులు ఎలాంటి యుక్తులకు వెనుకాడరు. దానికోసం ఎంతకయినా తెగిస్తారు. ఈ సువిశాల భారత దేశంలో కేవలం పదవుల కోసం ఎన్నో రాజకీయ సంక్షోభాలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ సంక్షోభాలన్నింటి రికార్డులను మహారాష్ట్ర తిరగరాస్తోంది. రాజకీయ చదరంగాన్ని మించిపోతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ రాజకీయ పండితులను సైతం ఆశ్యర్య పరుస్తోంది. ఆదివారం కూడా అంతకుమించి అనే స్థాయిలో సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఏం జరిగిదంటే.
శరద్ పవార్ కు షాక్
మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కు ఆయన సమీప బంధువు అజీత్ పవార్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఎన్‌సీపీలో తిరుగుటు చేసి ప్రత్యర్థి పక్షంతో చేతులు కలిపారు. బీజేపీ శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్‌తో పాటు ఎన్‌సీపీలో ప్రముఖ నేత చగన్ భుజ్‌బల్ కూడా శివసేన కూటమితో చేతులు కలిపారు. ఆదివారం అజిత్ పవార్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఆయన వర్గానికి చెందిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. వీరిలో ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ కూడా ఉన్నారు. అజిత్ పవార్ నాలుగేళ్లలో మూడో సారి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్య మంత్రి దేవేంద్రఫడ్నవిస్ పాల్గొనడం విశేషం. నేషనల్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబావుటా ఎగరేసి బీజేపీ శివసేన కూటమిలో అజీత్ పవార్ చేరడం, ప్రభుత్వంలో రెండవ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఒకప్పుడు తమ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలయిక తో డబుల్ ఇంజన్‌గా ఉండేదన్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల కలయిక ద్వారా ట్రిబుల్ ఇంజన్‌గా మారిందన్నారు.
చీలికా? మద్దతా?
అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో శివసేన, బీజేపీ కూటమిలో ఎన్ సీ పీ చేరిన నేపథ్యంలో ఇది చీలికా? మద్దతా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా, నలభై మంది ఎమ్మెల్యేల మద్దతుతో తాను ప్రమాణ స్వీకారం చేశానని అజీత్ పవార్ చెబుతున్నారు. శివసేన తరహాలోనే ఎన్‌సీపీ చీలినట్టు భావించాలా? అజీత్ పవార్‌పై ఎన్‌సీపీ చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నలను శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. మరో వైపు ఈ ఎపిసోడ్ లో సంజయ్ రౌత్ స్పందించారు. “నేను చాలా బలంగా ఉన్నాను.. శరద్ పవార్‌తో మట్లాడాను. ప్రజల మద్దతుతో ఉద్దవ్ థాకరేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని” ధీమా వ్యక్తం చేశారు.