అధికార వైసీపీ పార్టీలో నెంబరు టు గా చలామణి అవుతున్న వారిలో ఒకరిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఆ పార్టీలో మరో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆయనను ఆ స్థానం నుంచి పక్కనపెట్టేందుకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ పదవిని ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరికి కట్టబెట్టనున్నారు. దీంతో వైసీపీలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తుందనేది స్పష్టమైంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పడు సిఎం విజయసాయిరెడ్డిని కారు నుంచి దించి ఆ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కన్నబాబుకు తీసుకువెళ్ళారు. అప్పటి నుంచి పార్టీలో విజయసాయికి పతనం ప్రారంభమైందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అది నిజమని స్సష్టం అయ్యింది.
Also Read: వైసీపీలో షాడో మినిష్టర్లు.. జగన్ కు కొత్త తలనొప్పి?
ఇప్పటి వరకూ ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి హోదాలో కొనసాగుతున్న విజయసాయిని ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పించి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అజయ్ కల్లాంకు అప్పగించాలని యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఢిల్లీలోని వ్యవహారాలను చక్కదిద్ధటంలో విజయసాయి విఫలమవుతున్నారని భావించిన సిఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఢిల్లీలో ప్రధాని మోడీ, ఇతర బిజెపి నేతలను సమన్వయం చేసుకుంటూ వైసీపీకి ఎన్నికల సమయంలో విజయసాయిరెడ్డి చాలా వరకూ మేలు చేశారనే వాదనలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఢిల్లీ వ్యవహారాల్లో సానుకూల వాతావరణం కనిపించకపోవడంతో జగన్ అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరగుతుంది. ప్రస్తుతం విజయసాయి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టి జాతీయ రాజకీయాలకు దూరం అయినట్లుగా కనిపిస్తోంది.
విశాఖ కేంద్రంలో విజయసాయిరెడ్డి చేస్తున్ననిర్వాకాలపైన కొంత కాలంగా పార్టీలో అంతర్గత చర్చ జరుగుతుంది. భూ మాఫియా, ఇటీవల కరోనా లాక్ డౌన్ సందర్భంగా సొంత ట్రస్టు పేరుతో బలవంతంగా బిల్డర్ల నుంచి విరాళాల వసూలు వంటి పలు అంశాలపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం ఆయనను దూరం పెడుతున్నట్లు సమాచారం. పార్టీలో అంతర్గతంగా సజ్జల, విజయసాయి, వైవిల మధ్య పలు అంశాల్లో ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పని చేసిన సంఘటనలు గుర్తించిన జగన్ ముగ్గురికి మూడు పాంతాలను కేటాయించారు. రాయలసీమ జిల్లాలను సజ్జలకు ప్రకాశం నుంచి గోదావరి జిల్లాల వరకూ వైవీకి, ఉత్తరాంధ్ర జిల్లాలను విజయసాయిరెడ్డికి కేటాయిస్తూ పార్టీ బాధ్యతలు అప్పగించారు.
Also Read: చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూల్చే జగన్ ఆయుధం!
మరోవైపు సిఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విశ్రాంత ఐఎఎస్ లు అజయ్ కల్లాం, పీవీ రమేష్ కుమార్ కు కొంత కాలం కిందట శాఖల బాధ్యతలను పూర్తిగా తొలగించారు. ఇది పీవీ రమేష్ కుమార్ విషయంలో వేటు వేసేందుకే అజయ్ కల్లాం శాఖలను తొలగించారని, ఆయనకు శాఖలు లేకపోయినా సిఎంఓలో కీలకంగానే వ్యవహరిస్తున్నారని, అన్ని ఫైల్స్ ఆయన వద్ద నుంచే వెళుతున్నట్లు చెబుతున్నారు. తాజాగా అజయ్ కల్లాంకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం.