Niranjan Reddy vs Chandrababu : 2002 సంవత్సరంలో దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయం. ఎన్డీఎ తరపున భారతరత్న డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాంను నిలబెట్టారు. వామపక్షాల తరపున సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్య్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరి కెప్టెన్ గా పోరాడి, 1971లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై, 1998లో పద్మ విభూషణ్ పురస్కారం పొందిన లక్ష్మీ సెహగల్ ను నిలబెట్టారు.
లక్ష్మీ సెహగల్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడంపై చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ‘నేను రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఆమె ఎవరో నాకు తెలియదు. వామపక్షాల నిర్ణయం పట్ల పశ్చాత్తాప పడుతున్నాను’ అన్నారు. వెంటనే అక్కడ ఉన్న జర్నలిస్ట్ లు ఆశ్చర్యపోయి చంద్రబాబుకు లక్ష్మీ సెహగల్ చరిత్ర, గొప్పతనం వినిపించారు. చంద్రబాబుకు చరిత్ర, గొప్ప, గొప్ప వాళ్ల గురించి తెలియకపోతే, తెలుసుకోవాలన్న ఆలోచన లేకపోతే అతనిది అజ్ఞానం. కానీ తనకు తెలియదు కాబట్టి ఎవరికీ తెలియదు అనుకోవడం మూర్ఖత్వం. ఏమీ తెలియని చంద్రబాబు నాయుడును దార్శనికుడుగా భ్రమింపచేసింది, భ్రమింపచేస్తున్నది అతని అనుకూల మీడియా. తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం మూలంగానే ఇక్కడి ప్రజలు అన్నం తింటున్నారు. అంతకుముందు జొన్నలు, రాగులు, సజ్జలే తినేవారు అనడం చంద్రబాబు నాయుడు అజ్ఞానానికి పరాకాష్ట.
11వ శతాబ్దం కాకతీయుల పాలనలో తెలంగాణ అంతటా చిన్న, పెద్ద చెరువులు, కుంటలను నిర్మించారు. బావులను తవ్వించారు. ఊరికి దిగువన చెరువు, చెరువుకు దిగువన వ్యవసాయ భూములు ఉండేలా జాగ్రత్తపడ్డారు. దీంతో ఊరిలో కురిసిన వాననీరు చెరువులకు చేరేది. వరదలు గ్రామాలను ముంచెత్తేవి కావు. మూసీ నది నుంచి మూసేటి కాలువ, రావిపాటి కాలువ, బొమ్మకంటి కాలువ, ఉత్తమ గండకాలువ, ఉటుం కాలువ, చింతకాలువ, దుందుభి నదీ తీరాన ఉన్న గండకాలువ వంటివి కాకతీయుల కాలంలో ఉండేవని శాసనాధారాలు ఉన్నాయి. చెరువులు, కాలువల నిర్వహణకు ప్రత్యేకంగా వ్యక్తులను నియమించి, వారి పోషణకు భూములు, పుట్టికి కుంచం చొప్పున వారికి జీతమిచ్చేవారు. గణపతిదేవుని పాలనలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం ఉధృతంగా నడిచింది. అప్పట్లో ప్రధానంగా వరి, గోధుమలు, కొర్రలు, పెసలు, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు లాంటివి పండించేవారు. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులే కాలక్రమంలో తెలంగాణ వ్యవసాయానికి ప్రధాన సాగునీటి వనరులు అయ్యాయి. ఆ తరువాత నిజాం పరిపాలనలో 58 టీఎంసీల సామర్ద్యంతో 2.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం 1923లో ప్రారంభించి 1931లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ సమయంలోనే పోచారం ప్రాజెక్టు, ఆ తరువాత అప్పర్ మానేరు ప్రాజెక్టు, డిండి రిజర్వాయర్, మంజీరా నదిపై ఘణపురం ఆనకట్ట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, కోయిల్ సాగర్, తుంగభద్ర ప్రాజెక్టులు నిర్మించారు. హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనమయ్యే నాటికి 1,20,000 చిన్న, పెద్ద చెరువులు, కుంటలు ఉండేవని రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి.
ఇవికాక నిజాం ప్రభుత్వం మరి కొన్ని భారీ ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేసింది. గోదావరి పై 400 టీ.ఎం.సీ.ల పోచంపాడు (కుస్తాపురమ్) ప్రాజెక్టును, 350 టీ.ఎం.సీ.ల ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును, మంజీరానదిపై 38 టీ.ఎం.సీల దేవనూరు ప్రాజెక్టును, కృష్ణా నదిపై 132 టీ.ఎం.సీల నందికొండ ప్రాజెక్టును, 54.4 టీ.ఎం.సీల అప్పర్ కృష్ణ్ణా ప్రాజెక్టును, తుంగభద్ర నదిపై 65 టీ.ఎం.సీల తుంగభద్ర ఎడమ కాలువ, రాజోలి బండ మళ్ళింపు పథకము, భీమా నదిపై 100 టీ.ఎం.సీల భీమా ప్రాజెక్టును, పెండ్లిపాకల జాలాశయం, మూసీ నదిపై మూసీ ప్రాజెక్టు, మరాఠ్వాడాలో పూర్ణా, పెన్‌గంగ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. మొత్తంగా తెలంగాణలో 1365 టీ.ఎం.సీ.ల కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు ఉన్నవి. రాష్టాల పునర్వ్యవస్థీకరణ జరిగి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడంతో కొన్ని ప్రాజెక్టులను లిస్టులోంచి తొలగించారు. కొన్నింటి సామర్థ్యాన్ని కుదించారు. మరికొన్నింటిని సుప్తావస్థలో ఉంచారు.1956లో తెలంగాణ ఆంధ్రలో విలీనం అయ్యే నాటికి తెలంగాణ సాగునీటి రంగం పటిష్టంగా ఉండేది. తెలంగాణ, ఆంధ్ర విలీనమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించాకనే తెలంగాణ రైతాంగానికి కష్టాలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురయింది. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల నిర్మాణ స్థలాలు మారిపోవడం, అప్పర్ క్రిష్ణ, భీమా ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. తెలంగాణ చిన్ననీటి వనరులు చెరువులు, కుంటలను ప్రణాళికాబద్దంగా ధ్వంసం చేశారు. తెలంగాణలో చెరువులు పటిష్టంగా ఉండి వాగులు, వంకలలో పారిన నీరు చెరువులు, కుంటలలో చేరితే దిగువన ఉన్న ఆంధ్రాకు నీటి కొరత వస్తుందన్న ఉద్దేశంతో వాటిని నీరుగార్చారు. సాగునీటి వనరులు ధ్వంసమై, ప్రాజెక్టుల నుండి సాగునీరు అందక, సాగునీటి ప్రాజెక్టులు ప్రతిపాదించినా వాటి నిర్మాణం దశాబ్దాల పాటు పూర్తికాకుండా నిధుల కేటాయింపులో తీవ్ర వివక్షకు గురిచేశారు. చెరువులు, కుంటల కింద సాఫీగా సాగిన తెలంగాణ వ్యవసాయం బోరుబావుల మీద ఆధారపడే స్థితికి చేరింది. క్రమంగా వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగి, దిగుమతులు రాక అప్పులపాలై వ్యవసాయాన్ని వీడి రైతులు ఇతర రంగాలలో ఉపాధి వెతుక్కుంటూ వలసల బాటపట్టారు.
తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదు. వెనకబడేయబడ్డ ప్రాంతం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పదే పదే చెప్పిన వాస్తవం ఇది. తెలంగాణ భూములను ఎండబెట్టి ఆంధ్రలో గోదావరి, డెల్టా ప్రాంతాల కింద పండిన పంటలకు ప్రభుత్వ ఉచిత మార్కెట్ ఏర్పాటు చేసి సబ్సిడీ బియ్యం తెలంగాణ, తెలంగాణ వంటి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి ప్రజలను ఆదుకున్నట్లు ప్రచారం చేసుకున్నారు. అందరికీ అన్నం పెట్టిన నేల తెలంగాణ. సమైక్య పాలనలో సృష్టించిన కృత్రిమ కరువు, కృత్రిమ క్షామం మూలంగా తెలంగాణ నష్టపోయింది. తెలంగాణ ఉద్యమంలో నీటి దోపిడి, వివక్ష ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. గోదావరి, కృష్ణా నదులు పారు తున్నా తెలంగాణకు ఈ నీటి గోస ఎందుకు? అన్న ప్రశ్న గ్రామీణ ప్రజలను తట్టి లేపింది. సుధీర్ఘ ఉద్యమంతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది.
తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, కేవలం మూడేళ్లలో కాళేశ్వరం వంటి అతి పెద్ద ఎత్తిపోతలను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. సమైక్య పాలనలో సాగు నష్టాలను భరించలేక వలసబాట పట్టిన రైతన్నలను తిరిగి వ్యవసాయం వైపు మళ్లించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు సాగునీరు అందివ్వడంతో పాటు రైతుబంధు, రైతుభీమా పథకాలతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు రైతుబంధు కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున పది విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమచేశారు. అందరికీ అన్నం పెట్టే రైతుకు ఆపద వస్తే ఆ కుటుంబం ఎవరి ముందు చేయిచాచకుండా ధైర్యంగా ఉండాలని రైతు ఏ కారణం చేత మరణించినా పది రోజులలోపు రూ.5 లక్షలు ఆ కుటుంబానికి అందేలా రైతుభీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 97,913 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4895.65 కోట్ల పరిహారం అందుకున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా 2014 నాటికి కోటీ 31 లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2021 నాటికి అది 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014-15 నాటికి 68 లక్షల టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి 2021-22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది. అన్ని పంటల ఉత్పత్తి కలిపి 4.04 కోట్ల టన్నులకు చేరుకోవడం విశేషం. ఈ యాసంగిలో తెలంగాణలో ఇప్పటి వరకు 55.51 లక్షల ఎకరాలలో వరి నాట్లు వేయడం గమనార్హం. 2014 – 15లో ఆంధ్రప్రదేశ్ లో వానాకాలం, యాసంగి కలిపి 59.16 లక్షల ఎకరాలలో సాగయింది. 2022 – 23లో వానాకాలం, యాసంగి కలిపి 55.60 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. ఒక్క యాసంగిలో తెలంగాణలో సాగవుతున్న మొత్తం ఆంధ్రలో వానాకాలం, యాసంగిలలో కలిపి కావడం లేదు. గత తొమ్మిదేళ్లలో వ్యవసాయరంగంలో అద్వితీయ ప్రగతి సాధించి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
అనాలోచిత విధానాలతో నేల విడిచి సాము చేసి వ్యవసాయరంగాన్ని భ్రష్టుపట్టించిన చంద్రబాబు నాయుడు ఒకనాడు వ్యవసాయం దండగ అని అన్నారు. ఐటీ రంగం నావల్లనే వచ్చింది. నేను ఐటీ తేవడం వల్లనే సత్యనాదెళ్ల మైక్రో సాఫ్ట్ సీఈఓ అయ్యాడని, హైదరాబాద్ నేనే ప్రపంచపటంలో పెట్టానని నోటికొచ్చిన మాటలన్నీ వివిధ సంధర్భాలలో అన్నాడు. అదేక్రమంలో తాజాగా చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల క్రితం ‘‘1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 2 రూపాయల కిలో బియ్యం మూలంగానే అన్నం తింటున్నారని, అంతవరకు జొన్నలు, సజ్జలు, రాగులే వారి ప్రధాన ఆహారమని’’ చెప్పడం ఆయన అవివేకం, అజ్ఞానానికి పరాకాష్ట.
‘‘జొన్నకలి, జొన్నయంబలి జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్ సన్నన్నము సున్న సుమీ పన్నుగ పల్నాటి సీమ ప్రజలందఱకున్ ’’
అని మహాకవి శ్రీనాథుడు (1365 – 1441) ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారు. గత శతాబ్దాల చరిత్ర గమనించినా తెలంగాణ ప్రాంతం అన్ని పంటలకూ అనుకూలమని, కేవలం సమైక్య రాష్ట్రంలో పాలకుల వివక్ష మూలంగా నిరాదరణకు గురై నష్టపోయిన ప్రాంతమే తప్ప వనరులు లేక కాదన్నది సుస్పష్టంగా తేలిపోతున్నది. తెలంగాణతో పోల్చుతూ ఆంధ్రా ప్రాంతాన్ని, ప్రజలను చిన్నగ చేయాలన్నది మా ఉద్దేశం కాదు. అలాంటి ఆలోచన మాకెన్నడూ లేదు. కానీ చారిత్రక వాస్తవాలను అర్ధంచేసుకోకుండా, అజ్ఞానం, అహంకారంతో వ్యవహరిస్తూ మేమే గొప్పోళ్లం అనే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్లో ఎంత మూర్ఖత్వం ఉన్నదో ప్రపంచానికి చాటి చెప్పడమే మా ఉద్దేశం.
వనరులు ఒక చోట ఉంటాయి. ఒక చోట ఉండవు. కానీ వాటన్నింటినీ హేతుబద్దం చేసి ప్రజలకు ఉపాధినివ్వాలి. బతుకుదెరువునివ్వాలి. ప్రపంచానికి అన్నం పెట్టాలి అన్న ధృక్పధం ఉన్న దూరదృష్టి గల నేత కేసీఆర్. ఈ దిశగా ఒక్కనాడు కూడా ఆలోచన చేయని, ఆలోచన కూడా రాని చంద్రబాబు నాయుడును ఒక దార్శనికుడుగా భ్రమింపచేసింది, భ్రమింపచేస్తున్నది ఆయన అనుకూల మీడియా. నదుల నీళ్లు సముద్రాల పాలు కావద్దు. ఇక్కడి భీళ్లను తడపాలి అన్నది కేసీఆర్ ఆలోచన. ప్రపంచానికి అన్నం పెట్టే శక్తి భారతదేశానికి ఉన్నది. అది సద్వినియోగం చేసుకుంటామని చెబుతున్నాం. అందుకే ‘అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్’ అంటున్నాం.
– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Agriculture minister niranjan reddy criticizes chandrababu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com