https://oktelugu.com/

Chandrayaan 3: ఇస్రో ను చూసి.. జాబిల్లి పైకి మరిన్ని దేశాలు

చంద్రుడి దక్షిణ ధృవం పై దిగుతుంది. అది ఇక్కడ ఉపరితలంపై నమూనాలు సేకరించి భూమికి తిరిగి వస్తుంది. దీనిని ఎప్పుడు ప్రయోగిస్తారు అనే విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు.

Written By:
  • Rocky
  • , Updated On : August 29, 2023 11:41 am
    Chandrayaan 3

    Chandrayaan 3

    Follow us on

    Chandrayaan 3: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3 విజయవంతమైన నేపథ్యంలో.. మిగతా దేశాలు జాబిల్లి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. చంద్రుడి ఉపరితలం మీద చంద్రయాన్_1 నీటి జాడలు పసిగట్టినప్పటి నుంచే.. చంద్రుడి పైకి ఇతర దేశాల పోకడ పెరిగింది. వీటితోపాటు అక్కడ ఉన్న విలువైన వనరులను సద్వినియోగం చేసుకుంటూ జాబిల్లి ఉప్పరితనంపై అంతరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయా దేశాలు గట్టిగా తలపోస్తున్నాయి. తద్వారా సౌర కుటుంబంలో సుదూర ప్రాంతాలకు చేపట్టే యాత్రలకు చంద్రుడిని ఒక మజిలీగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాయి. ప్రధానంగా దక్షిణ ధ్రువ ప్రాంతం పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఇస్రో చంద్రయాన్_3 విజయవంతమైన నేపథ్యంలో మిగతా దేశాలు ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నాయో తెలుసుకుందాం.

    పెరె గ్రైన్ మిషన్_1(అమెరికా)

    జాబిల్లి పైన ఉన్న “సైనస్ విస్కో సైటాటిస్” అనే ప్రాంతంలో ఇది దిగుతుంది. అది జాబిల్లి చుట్టూ ఉన్న ఎక్సో స్పియర్ పై పరిశోధనలు సాగిస్తుంది. చందమామపై హైడ్రోజన్ ఎంత పుష్కలంగా ఉందన్నది లెక్కలు కడుతుంది. అలాగే అక్కడి అయస్కాంత క్షేత్రాలు, రేడియో ధార్మిక వాతావరణం, తదితరాల గురించి శోధిస్తుంది. ఈ ఏడాది ఈ ప్రయోగం జరగవచ్చని తెలుస్తోంది.

    ఐఎం_1( అమెరికా)

    “ఇంట్యూటివ్ మిషీన్స్” అనే ప్రాజెక్టు కింద “నోవా_ సీ” అనే లాండర్ ను ” మలా పెర్ట్ ఎ” బిలంపై దించాలని అమెరికా చూస్తోంది. అక్కడి ధూళి_ఉపరితలం మధ్య జరిగే చర్యలు, అంతరిక్ష వాతావరణం చూపే ప్రభావాలు, కచ్చితమైన ల్యాండింగ్, కమ్యూనికేషన్ పరిజ్ఞానాలను పరీక్షించడమే దీని ఉద్దేశం. ఈ ప్రయోగం ఈ ఏడాది జరుగుతుంది.

    ప్రైమ్_1(అమెరికా)

    ఇది ల్యాండర్ మిషన్. ఇందులో భాగంగా “నోవా_ సీ” ల్యాండర్ ను చందమామ దక్షిణ ధ్రువానికి సమీపంలోని ప్రాంతంలో దించుతారు. అక్కడ ఈసాధన డ్రిల్లింగ్ నిర్వహిస్తుంది. జాబిల్లి వనరులతో వినియోగ యోగ్యమైన ఉత్పత్తులను అక్కడికక్కడే తయారు చేయవచ్చా అన్నది ఈ ల్యాండర్ పరిశీలిస్తుంది.. దీనిని ఐఎం_2 గా కూడా పేర్కొంటున్నారు. ఈ ఏడాది నవంబర్లో ఈ ప్రయోగం జరిగే అవకాశం ఉంది.

    స్లిమ్( జపాన్)

    ఇది ల్యాండర్. ఆగస్టు 26న జపాన్ అంతరిక్ష సంస్థ దీనిని ప్రయోగించాలి. అయితే ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రయోగం వాయిదా పడింది. చిన్నపాటి వ్యోమ నౌకను అత్యంత కచ్చితత్వంతో జాబిల్లిపై దించేందుకు ఉద్దేశించిన పరిజ్ఞానాలను పరీక్షించడం దీని ఉద్దేశం.

    చాంగే_6

    చంద్రుడి దక్షిణ ధృవం పై దిగుతుంది. అది ఇక్కడ ఉపరితలంపై నమూనాలు సేకరించి భూమికి తిరిగి వస్తుంది. దీనిని ఎప్పుడు ప్రయోగిస్తారు అనే విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు.

    దక్షిణ ధృవం పైకి ఎందుకంటే..

    ఇస్రో ప్రయోగం విజయవంతమైన తర్వాత జాబిల్లిలో దక్షిణ ధృవం పైనే అన్ని దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ ధ్రువం పై అనేక ప్రాంతాలు శాశ్వతంగా నీడలో ఉన్నాయి. సూర్యుడి కిరణాలు అక్కడ పడవు. మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ స్థాయి శీతల వాతావరణం కారణంగా అక్కడ పదార్థాలు మొత్తం గడ్డకట్టి ఉంటాయి. కాలక్రమంలో అవి ఎలాంటి మార్పులకు లోను కావు. వాటిని శోధించడం అంటే దాదాపు కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూడటమే. తొలినాటి సౌర కుటుంబానికి సంబంధించిన ఆనవాళ్లు అక్కడ ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే అక్కడ మంచి రూపంలో భారీగా నీరు ఉండొచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇక చంద్రుడి మీద హీలియం_3 నిల్వలు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది భూమిపై చాలా స్వల్పంగా ఉంది. చందమామపై పది లక్షల టన్నుల హీలియం_3 నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్రకసంలీన రియాక్టర్ల (న్యూక్లియర్ ఫ్యూజన్) లో ఇది ఇంధనం గా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.