YS Viveka Murder Case: అప్పటి వరకు అతను బాహ్యప్రపంచానికి తెలియదు. సీబీఐ విచారణతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. వైఎస్ వివేకా హత్య జరగగానే పులివెందుల నుంచి అతనికే ఫోన్ వెళ్లింది. అది కూడా కడప ఎంపీ నుంచి. ఇంతకీ అతనెవరు ? కడప ఎంపీకు అతనికున్న సంబంధం ఏమిటి ? వైఎస్ వివేకా హత్య తర్వాత అతనికి ఫోన్ ఎందుకు చేశారు ? ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ ఇది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించింది. అవినాష్ రెడ్డి విచారణ సమయంలో నవీన్ అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా నవీన్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు నవీన్ ఎవరన్న ఆసక్తి ఏపీలో నెలకొంది. నవీన్ కు వైఎస్ వివేకా హత్యకు సంబంధం ఏంటన్న ఆసక్తి మొదలైంది.
నవీన్ కుటుంబం పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది. నవీన్ కుటుంబ సభ్యులు గతంలో రాజారెడ్డి దగ్గర పనిచేసేవారు. నవీన్ కూడా చదువుకుంటూ జగన్ కు దగ్గరయ్యారు. జగన్ ఎక్కడ ఉంటే అక్కడ నవీన్ ఉండేవారు. బెంగళూరు నివాసం, హైదరాబాద్ లోటస్ పాండ్, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్.. జగన్ ఎక్కడికి వెళ్తే నవీన్ అక్కడికి వెళ్లారు. జగన్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారు. దాదాపుగా 15 ఏళ్ల నుంచి జగన్ కుటుంబంతోనే ఉన్నారు. జగన్ భార్య భారతీకి విధేయుడిగా ఉంటూ ఇంటి పనులు చేసి పెడతా ఉంటాడు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగాక కడప ఎంపీ అవినాష్ రెడ్డి మొదట ఫోన్ చేసింది నవీన్ కే. ఆ తర్వాత నవీన్ ఫోన్ కు అవినాష్ ఫోన్ నుంచి పలుమార్లు కాల్స్ వచ్చినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. దీంతో నవీన్ పై సీబీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అసలు కడప ఎంపీ అవినాష్ రెడ్డి నవీన్ కు ఎందుకు ఫోన్ చేశారన్న కోణంలో విచారణ జరిగే అవకాశం ఉంది. నవీన్ కు వివేకా హత్యకు ఉన్న సంబంధం గురించి కూడా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది.

నవీన్ అసలు పేరు హరిప్రసాద్. కాగా నవీన్ అని పేరు మార్చుకొన్నాడు. సీబీఐ అధికారులు కూడా హరిప్రసాద్ పేరుతో పులివెందులలో విచారించారు. ఇప్పుడు హరిప్రసాద్ అలియాస్ నవీన్ పాత్ర పై సీబీఐ విచారణ జరుపుతోంది. నవీన్ పాత్ర ఏంటనేది తేలితే కేసులో మరింత మంది కీలక వ్యక్తుల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి నవీన్ తో మాట్లాడటానికి ఫోన్ చేశారా ? లేదా నవీన్ ఫోన్ నుంచి వేరే వ్యక్తులు ఎవరైనా మాట్లాడారా ? అన్న కోణంలో సీబీఐ విచారణ సాగనుంది.