Telangana Irrigation Projects: ప్రాజెక్టులకు 1.59 లక్షల కోట్లు పోసిన కేసీఆర్‌కు తెలంగాణలో ఫలితమొచ్చిందా? లెక్కలివీ?

సాగునీటి గోస తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తొలుత ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌’ను పూర్తిచేశారు.

Written By: Raj Shekar, Updated On : October 13, 2023 12:43 pm

Telangana Irrigation Projects

Follow us on

Telangana Irrigation Projects: వ్యవసాయం అంటే దండగ అనే రోజుల నుంచి వ్యవసాయం అంటే పండుగ అనే స్థితికి తెచ్చారు సీఎం కేసీఆర్‌. రైతుబంధు, రైతు బీమా, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి విప్లవాత్మక కార్యక్రమాలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పదేండ్లలో తెలంగాణ వ్యవసాయం పండుగైంది. రైతులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు సత్ఫలితాలనిచ్చాయి. ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, రుణమాఫీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ వంటి పథకాలతో తెలంగాణలో వ్యవసాయరంగం రూపురేఖలు మారిపోయాయి. స్వరాష్ట్రంలో సాగు విస్తీర్ణం 81%, పంట ఉత్పత్తులు 145% పెరగడం పదేండ్ల ప్రగతికి అద్దంపడుతున్నది. ఐక్యరాజ్యసమితి సంస్థ ప్రపంచ ఆహార సంస్థ 2018–19లో ప్రపంచంలో రైతులకు ఉపయోగపడే మేటి 20 పథకాల్లో రైతుబంధు, రైతుబీమాను గుర్తించింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రూ.1.59 లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగునీరు చింత తీర్చింది.

సాగునీటి ప్రాజెక్టులు
సాగునీటి గోస తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తొలుత ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌’ను పూర్తిచేశారు. ఇందుకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే. రూ.84,500 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇక దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకు రూ.22,800 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయరంగానికి జీవనాడిగా నిలిచాయి. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి, చెరువులను బాగు చేశారు. తద్వారా రాష్ట్రంలో సాగునీటి గోస తీరడంతోపాటు భూగర్భ జలాలు పెరిగాయి.

ఇతర ప్రాజెక్టులకు..
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డితోపాటు ఇతర ప్రాజెక్టులకు కూడా కేసీఆర్‌ భారీగా నిధులు వెచ్చించారు. ఇందిరమ్మ కెనాల్‌కు 6,327 కోట్లు వెచ్చించారు. ఏఎంఆర్‌ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు రూ.2,500 కోట్లు ఖర్చు చేశారు. సీతారామ లిఫ్ట్‌ పథకానికి రూ.7,300 కోట్లు మంజూరు చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.2,500 కోట్లు కేటాయించారు. ఎస్సారెస్పీకి రూ.2 వేల కోట్లు, లోయర్‌ పెన్‌గంగకు రూ.900 కోట్లు కేటాయించారు. ఇలా తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగు నీటి ప్రాజెక్టులు రూ.1.59 లక్షల కోట్లు కేటాయించారు.

చెరువులు, చెక్‌డ్యాంలు..
సాగునీటి ప్రాజెక్టులతోపాటు చెరువుల పునరుద్ధరణకు మిషన్‌ కాకతీయ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద తెలంగాణలో 46,531 చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. ఇందుకోసం రూ.9,155 కోట్లు ఖర్చు చేశారు.