Jagan: రాయలసీమను చేజేతులా దూరం చేసుకుంటున్న జగన్

కృష్ణా జలాల పంపిణీ విషయమై పునః సమీక్షకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు పున సమీక్ష బాధ్యతలను అప్పగించింది. దీనిపై జగన్ మౌనం పాటిస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 13, 2023 12:46 pm

Jagan

Follow us on

Jagan: వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీకి దెబ్బ తప్పదా? జగన్ తీరుపై సీమ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అమరావతి రాజధానిని దూరం చేశారు. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు తరలించుకుపోయే పనిలో ఉన్నారు. కర్నూలు న్యాయ రాజధాని అన్న మాటే మర్చిపోయారు. కృష్ణా జలాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించి సీమకు అన్యాయం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో వైసీపీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయం.

వైసిపి ఆవిర్భావం నుంచి రాయలసీమ ఆ పార్టీకి పెట్టని కోట. 2014లో రాయలసీమలో 52 స్థానాలు గాను 29 సీట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమైంది. 2019లో అయితే వైసిపి దాదాపు స్వీట్ చేసినంత పని చేసింది. ఏకంగా 49 స్థానాలను సాధించింది. టిడిపి మూడు సీట్లకే పరిమితమైంది. ఇంతటి ఘనమైన విజయాన్ని అందించిన రాయలసీమ ప్రజల విషయంలో జగన్ వైఖరి సంతృప్తికరంగా లేదు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని విషయాల్లో వైసీపీ ప్రభుత్వం నడుచుకోలేదన్న అసంతృప్తి అంతటా విస్తరించింది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో అది వెల్లడయ్యింది. అయినా సరే జగన్ లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.

కృష్ణా జలాల పంపిణీ విషయమై పునః సమీక్షకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు పున సమీక్ష బాధ్యతలను అప్పగించింది. దీనిపై జగన్ మౌనం పాటిస్తున్నారు. కేవలం కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు. పున సమీక్ష జరిగితే తెలంగాణకు ప్రయోజనం.. ఏపీకి అంతులేని నష్టం ఖాయం. మరోవైపు కృష్ణా బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయకుండా.. విశాఖలో ఏర్పాటు చేయడానికి పట్టుదలతో ఉన్నారు. అసలు విశాఖకు కృష్ణా నది తో సంబంధమే లేదు. అయినా సరే ముందుగా విశాఖలోనే ఏర్పాటు చేసేందుకు జగన్ ముగ్గు చూపుతున్నారు. ఏపీ విభజన సమయంలోనే కృష్ణా బోర్డు ఏపీలోనూ, గోదావరి బోర్డును తెలంగాణలోనూ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రెండు కార్యాలయాలు ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నాయి.

హైదరాబాద్ నుంచి కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విశాఖకు రప్పించాలన్నది జగన్ సర్కార్ ప్లాన్. విశాఖలో సౌకర్యవంతమైన భవనాన్ని సిద్ధం చేశామని.. అక్కడికి తరలించేందుకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ కృష్ణా బోర్డు చైర్మన్ శివ నందన్ కుమార్ కు లేఖ రాయడం పెను దుమారానికి దారితీస్తోంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం పై రాయలసీమ ఉద్యమకారులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఈ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని టిడిపి ప్రభుత్వం భావించింది. అప్పట్లోనే రాయలసీమ ప్రజలు వ్యతిరేకించారు. కృష్ణా పరివాహ ప్రాంతమైన విజయవాడలో ఏర్పాటు చేస్తామంటే ఒప్పుకోలేదు. అటువంటిది విశాఖలో ఏర్పాటు చేస్తామంటే భగ్గుమనడం ఖాయం. చేజేతులా ఇది రాయలసీమను దూరం చేసుకున్నట్టే. ఈ విషయంలో పంతాలకు పోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రాయలసీమలో మూల్యం తప్పదు.