అఫ్గనిస్థాన్ లో రాక్షస పాలన రానుంది. తాలిబన్ల చెరలో అల్లకల్లోలం అయిపోనుందని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వారు చేస్తున్న ఆగడాలకు హద్దు ఉండదని భయపడుతున్నారు. 20 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న అఫ్గాన్ లో ప్రస్తుతం తాలిబన్ల పాలన షురూ అయింది. అఫ్గన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయి అధికారం ఇచ్చేయడంతో వారి దుర్మార్గాలకు అంతులేకుండా పోతుందని పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియంతలా ప్రవర్తించే తాలిబన్ల పాలన దారుణంగా ఉంటుందని చెబతున్నారు.
ఇక మహిళల స్వేచ్ఛకైతే ఆంక్షలు ఉంటాయి. వారి ఆదేశాలు పాటించకపోతే ఎంతకైనా తెగిస్తారు. మహిళలు ఉద్యోగాలు చేయకూడదని, బహిరంగంగా తిరగడానికి వీలు లేదని హెచ్చరిస్తున్నారు. 2001లో అమెరికా నాయకత్వంలో నాటో దళాలచే అధికారం నుంచి తొలగించబడిన తాలిబన్లు ఇప్పుడు 20 ఏళ్ల తరువాత దేశంలోని అధిక భాగాన్ని హస్తగతం చేసుకుని తమ ఇష్టానుసారంగా చట్టాలను అమలు చేయడం ప్రారంబించారు. 15 ఏళ్లు పైబడిన బాలికలు, 45 ఏళ్ల లోపు వితంతు మహిళల జాబితాను తయారు చేయాలని సూచించారు.
తాలిబన్లు మహిళలను బలవంతంగా వివాహం చేసుకుంటారు. మహిళలు ఇంటి నుంచి బయటకు రాకుండా నిషేధాలు విధించారు. మహిళ తన భాగస్వామితో మాత్రమే బయటకు రావాలని కొత్త నిబంధన పెట్టారు. తాలిబన్ల కనుసన్నల్లో పాలన అంటేనే భయపడిపోతున్నారు. మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తూ తమ రాక్షస ఆనందాన్ని పొందుతారు. గతంలో వారు అనుభవించిన హక్కులు ప్రస్తుతం వారికి సంక్రమించేలా లేవు.
ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పింది. 1979లో మొదటి రష్యా సైన్యం అఫ్గనిస్థాన్ చేరుకున్నప్పుడు హోరియా మొసాదిక్ చాలా చిన్నది. తాలిబన్ మహిళల కోసం మానవ హక్కులను కూడా రద్దు చేసింది. ప్రతి చోట వారి పట్ల వివక్ష మొదలైంది. ఇక్కడ అమ్మాయిగా పుట్టడం అతి పెద్ద నేరంగా మారిపోయింది. తాలిబన్ ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలు చేసింది. మహిళలు, బాలికల కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. తాలిబన్ల నిర్మూలన తరువాత గత 20 సంవత్సరాలలో మహిళలు అధిక సంఖ్యలో రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. కానీ ఇప్పుడు వారు మళ్లీ పాత చీకటిరోజులకు వెళ్లాల్సి వస్తోంది.