Children of Afghanistan: బరువెక్కిన గుండెలు.. బరువైన హృదయాలు.. తమ పిల్లలనైనా కాపాడుకోవాలనే తపన. ఆ తల్లుల ఆతృత. తాము బతికినా లేకపోయినా తమ పిల్లలైనా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ తల్లులు దుఖాన్ని దిగమింగుతున్నారు. కడుపుకోతను పంటి బిగువున పట్టుకుని గుండె రాయి చేసుకుని తమ పిల్లలను ఇతర దేశాలకు పంపించేందుకు సైన్యానికి అందజేస్తున్నారు. దీంతో వారి బాధలు చూస్తుంటే తోటి వారికి సైతం కన్నీరు వస్తోంది. కానీ తాలిబన్లకు(Taliban) మాత్రం గుండె లేనట్లుగానే కనిపిస్తోంది. కాఠిన్యమే వారి ఆయుధంగా కనిపిస్తోంది. కాబుల్ విమానాశ్రయంలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే మనసు కరుగుతుంది.
అఫ్గానిస్తాన్(Afghanistan) లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. తాలిబన్ల అరాచక పాలనలో అఫ్గాన్ వాసుల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. దేశం విడిచి వెళ్లాలన్నా ఆంక్షలే. అడుగడుగునా ముష్కరుల కాపలా ఉంటోంది. ఎలాగైనా దేశం విడిచిపోవాలని కాబుల్ విమానాశ్రయానికి చేరుకున్న వారిని వెళ్లకుండా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తమ పిల్లలనైనా సురక్షితంగా ఉంచాలనే తాపత్రయంతో తల్లులు తమ చంటి బిడ్డల్ని అమెరికా దళాలకు అందిస్తూ దుఖాన్ని దిగమింగుతున్నారు. విదేశీ బలగాలు సైతం వారిని అక్కున చేర్చుకుంటున్నాయి.
కాబుల్ విమానాశ్రయంలో పసికందును ఇనుప కంచెపై నుంచి సైనికులు తీసుకుంటున్న దృశ్యాలు అందరిని కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ చిన్నారికి అనారోగ్యంగా ఉండడంతో అమెరికా దళాలకు అప్పగించడంతో వారు తమ సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కల్లోల పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది మానవతా దృక్పథం అందరిలో ఆలోచనలు కల్పిస్తోంది.
తాలిబన్ల బారి నుంచి తమ పిల్లలనైనా కాపాడుకోవాలని ఇనుప కంచెలపై నుంచే పిల్లలను ఎయిర్ పోర్టులో ఉన్న అమెరికా, బ్రిటన్ సైన్యాలకు అప్పగిస్తున్నారు. విదేశీ బలగాలు సైతం వారిని అక్కున చేర్చుకుంటున్నాయి. విదేశీ భద్రతా సిబ్బంది చిన్నారులను ఎత్తుకుని లాలిస్తున్నారు. పసిపాపల బోసి నవ్వులు చూడగానే తమ బిడ్డలను గుర్తు చేసుకుంటున్నారు. సైనికులు చేస్తున్న సాయానికి తల్లులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.